Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లేదంటే ప్రభుత్వ భూముల్లో ఎర్రజెండాలు పాతుతాం
- డబుల్ బెడ్రూమ్స్ ఎప్పుడు పంచుతారు..?
- రెండో రోజూ కలెక్టరేట్ల ఎదుట తెలంగాణ ప్రజాసంఘాల పోరాట వేదిక ధర్నాలు
- సిరిసిల్లలో ఉద్రిక్తత.. ముందస్తు అరెస్టులు
- రంగారెడ్డిలోధర్నాకు ఖాకీల అడ్డు
- సౌండ్ బాక్స్, మౌత్ లాక్కున్న పోలీసులు
నవతెలంగాణ- విలేకరులు
''పేద వాడికి తలదాచుకోవడానికి కనీసం గూడు ఎందుకు ఉండకూడదు. ధనవంతులకు ఇవ్వడానికి వందల ఎకరాల భూమి ఎక్కడి నుంచి వచ్చింది.. ధనవంతులకు సర్కారు భూములను ధారదత్తం చేయడం కాదు. గూడు లేని నిరుపేదలకు ప్రభుత్వ భూముల్లో జాగాలు కేటాయించాలి. లేని పక్షంలో ఆ భూముల్లో ఎర్రజెండాలు పాతుతాం.. ఇప్పటికే గుడిసెలేసుకున్న వారికి పట్టాలివ్వాలి.. పూర్తయిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లను వెంటనే లబ్దిదారులకు పంచాలి'' అని తెలంగాణ ప్రజాసంఘాల పోరాట వేదిక నేతలు డిమాండ్ చేశారు. పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, ఇండ్ల స్థలాలు, ఇంటి జాగా ఉన్న వారికి నిర్మాణం కోసం రూ.5లక్షలు ఇవ్వాలని రెండో రోజూ కలెక్టరేట్ల ఎదుట ధర్నా చేశారు. పేదలు పెద్దఎత్తున తరలివచ్చి భారీ ర్యాలీలు తీసి.. కార్యాలయాల ఎదుట బైటాయించారు. అయితే, సిరిసిల్లలో మంత్రి కేటీఆర్ పర్యటన పేరుతో నేతలను ముందస్తుగా అరెస్టు చేశారు.
రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నాకు జిల్లా నలుమూలల నుంచి పెద్దఎత్తున్న ప్రజలు తరలివచ్చారు. జనసమూహాన్ని చూసిన పోలీసులు ధర్నాను అడ్డుకునే ప్రయత్నం చేశారు. నాయకులను లాక్కుపోయేందుకు యత్నించగా కార్యకర్తలు అడ్డగించారు. సౌండ్ బాక్స్, మౌత్‌ను పోలీసులు లాక్కొని పగులగొట్టారు. 'ఏండ్ల కొద్దిగా పెండింగ్‌లో పెట్టిన భూ సమస్యలపై కలెక్టర్ సమాధానం చెప్పాలి. కలెక్టర్ వచ్చే వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదు' అంటూ ఆందోళనకారులు భీష్మించి కూర్చున్నారు. దాంతో అక్కడికొచ్చిన డీఆర్వో హరిప్రియ.. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నాయకులు ఆమెకు పలు డిమాండ్ల కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జాన్‌వెస్లీ మాట్లాడుతూ.. రామోజీ ఫిలీం సిటీ ప్రాంతంలో 650 మందికి పట్టాలు ఇచ్చి స్థలం ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. వికారాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డికి అందజేశారు.
పేదల గూడు కోసమే సీపీఐ(ఎం) భూ పోరాటం
కేంద్ర కమిటీ సభ్యులు నాగయ్య
పేదలకు గూడు కల్పించాలనే సీపీఐ(ఎం) పోరాడుతుందని కేంద్ర కమిటీ సభ్యులు నాగయ్య అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పేదల సొంత ఇంటి కల నెరవేరుస్తుందని సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నారని, ఇంకెప్పుడు ఇండ్లు పంపిణీ చేస్తారని ప్రశ్నించారు. ఓపిక నశించిన పేదలు సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో చేపట్టిన భూ పోరాటంలో భాగస్వాములు అయ్యారని చెప్పారు. కిలా వరంగల్ మండలం రంగసాయిపేట సీపీఐ(ఎం) ఏరియా కార్యదర్శి మాలోతు సాగర్ అధ్యక్షతన ఏకశిలా పార్కు నుంచి కలెక్టర్ ఆఫీస్ వరకు భారీ ర్యాలీ చేపట్టారు. అనంతరం వరంగల్ జిల్లా కలెక్టర్‌కి, అడిషనల్ జిల్లా కలెక్టర్ (రెవెన్యూ) శ్రీ వాత్సవకి వినతిపత్రాలు అందజేశారు. అందుకు స్పందించి అడిషనల్ కలెక్టర్ మాట్లాడుతూ.. పేదల కష్టాలు, బాధలను తాను అర్థం చేసుకున్నానని, ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా నాగయ్య మాట్లాడుతూ.. జొక్కలోద్ది, బెస్తం చెరువు ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేసుకున్న పేదలకు స్థలంతోపాటు.. ఇంటి నిర్మాణానికి రూ.5లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమం లో సీపీఐ(ఎం) రాష్ట్ర నాయకులు జగదీష్, వరంగల్ జిల్లా కార్యదర్శి చింతమల్ల రంగయ్య పాల్గొన్నారు.
అర్హులైన పేదలందరికీ ఇండ్లు మంజూరు చేయాలి
ప్రజాసంఘాల పోరాట వేదిక రాష్ట్ర కన్వీనర్ ఎస్.వీరయ్య
అర్హులైన పేదలందరికీ డబుల్ బెడ్ రూం ఇండ్లు మంజూరు చేయాలని ప్రజాసంఘాల పోరాట వేదిక రాష్ట్ర కన్వీనర్ ఎస్.వీరయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రజాసంఘాల పోరాట వేదిక ఆధ్వర్యంలో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. సీఐటీయూ జిల్లా అధ్యక్షులు ఎర్ర అశోక్ అధ్యక్షతన జరిగిన ధర్నాలో వీరయ్య మాట్లాడుతూ.. డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కోసం సుమారు 6 లక్షలకు పైగా దరఖాస్తులు రాగా, లక్ష పదివేల ఇండ్లను మాత్రమే పూర్తి చేశారని, మిగిలిన ఇండ్లను ఎప్పటి వరకు పూర్తి చేస్తారని ప్రశ్నించారు.
నిర్మల్ కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం ఏవోకు వినతిపత్రం అందజేశారు. పేదలందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మించి ఇస్తామని ఎనిమిదేండ్లలో నిర్మించిన కొద్దిపాటి ఇండ్లను సైతం పంపిణీ చేయకుండా పెండింగ్‌లో ఉంచారన్నారు. నిర్మించిన ఇండ్లను వెంటనే పేదలకు పంపిణీ చేయాలని, లేనియెడల పేదలను ఐక్యం చేసి ఆ ఇండ్లలో గృహప్రవేశం చేయిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. ముందుగా స్థానిక జగ్జీవన్ రామ్ నగర్ కాలనీ నుంచి తెలంగాణ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. తెలంగాణ ప్రజా సంఘాల పోరాటవేదిక, సీఐటీయూ ఆధ్వర్యంలో గద్వాల జిల్లా కేంద్రంలో ధర్నా నిర్వహించి కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, ఇండ్ల స్థలాలు ఇవ్వాలని వనపర్తి జిల్లా కేంద్రంలోని పాల కేంద్రం నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి, ధర్నా చేపట్టారు.
ప్రభుత్వ స్థలాల్లో గుడిసెలు వేసుకున్న పేదలకు పట్టాలు, ఇంటి నిర్మాణం కోసం రూ.5 లక్షలు, అర్హులైన పేదలకు 120 గజాల ఇంటి స్థలం, నిర్మాణానికి రూ.5 లక్షలు తదితర డిమాండ్లతో తెలంగాణ ప్రజా సంఘాల పోరాట వేదిక రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నాచౌక్‌లో ఆందోళన నిర్వహించారు. ముందుగా భారీ ర్యాలీ తీశారు.
పూర్తయిన ఇండ్లను పేదలకు పంచాలి: బుర్రి ప్రసాద్
ప్రభుత్వ స్థలాల్లో గుడిసెలు వేసుకున్న పేదలకు వెంటనే పట్టాలు ఇవ్వాలని తెలంగాణ ప్రజాసంఘాల పోరాట వేదిక రాష్ట్ర నాయకులు బుర్రి ప్రసాద్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హనుమకొండలో కలెక్టర్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ, అనంతరం ధర్నా నిర్వహించారు. కలెక్టర్‌కు వివిధ డిమాండ్లతో కూడిన వినతిపత్రం అందజేశారు. ధర్నాలో ప్రసాద్ మాట్లాడుతూ.. ప్రభుత్వ మరియు చెరువు శిఖం భూముల్లో నిరుపేదలు గుడిసెలు వేసుకుని నివాసముంటున్న వారికి పట్టాలిచ్చి గృహ నిర్మాణం కోసం రూ.5లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లా కేంద్రాల్లో కలెక్టరేట్ల ఎదుట ధర్నా నిర్వహించారు.
మంత్రి కేటీఆర్ పర్యటన పేరుతో నేతల అక్రమ అరెస్ట్
వినతిపత్రం ఇవ్వబోతే అడ్డుకున్న పోలీసులు
సిరిసిల్లలో మంత్రి కేటీఆర్ పర్యటన పేరుతో ప్రజాసంఘాల పోరాట వేదిక నాయకులు గురువారం తెల్లవారుజామునే పోలీసులు అరెస్టు చేశారు. కలెక్టరేట్ వద్దకు వెళ్తున్న నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. ప్రజాసంఘాల నేతలు మూషం రమేష్, కోడం రమణతోపాటు ముఖ్యమైన నాయకులను తెల్లవారుజామున ముందస్తు అరెస్ట్ చేశారు. అలాగే, కలెక్టరేట్ వద్దకు వస్తున్న నాయకులను అరెస్టు చేసి తాడూరు పోలీసు హెడ్‌క్వార్టర్‌కు తరలించారు.
హెడ్‌క్వార్టర్‌లో నాయకులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.స్కైలాబ్‌బాబు మాట్లాడుతూ.. మంత్రి కేటీఆర్ పర్యటనకు ముందే ప్రజాసంఘాల పోరాట వేదిక ధర్నాకు పిలుపునిచ్చిందన్నారు. కేటీఆర్ ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే.. ఆయనకు ఇక్కడి ప్రజలంటే ఎందుకింత భయం? ఎందుకోసం ఈ అరెస్టులు.. ప్రజా సమస్యలు కూడా వినడం చేతకాకపోతే పదవి ఎవరికోసం ఎందుకోసం అని ప్రశ్నించారు.