Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సంస్కరణలంటూ మోడీ జపం.. పేదలకు అన్యాయమే
- విభేదాలను పక్కనపెట్టి కేంద్రానికి నిరసన తెలిపాలి: మంత్రి కేటీఆర్
నవతెలంగాణ - సిరిసిల్ల
వ్యవసాయం, ధాన్యం సేకరణ, విద్యుత్‌ను ప్రధాని మోడీ ప్రయివేటుపరం చేయబోతున్నారనీ, మోడీ సంస్కరణలతో పేదలకు అన్యాయమేనని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో గురువారం ఆయన పర్యటించారు. కలెక్టరేట్లో బతుకమ్మ చీరల పంపిణీని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పేదింటి ఆడబిడ్డల మోముల్లో చిరునవ్వులు చూసేందుకు, సిరిసిల్ల నేత కార్మికులకు పని కల్పించేందుకు, ఆత్మహత్యలు దూరం చేసేందుకు బతుకమ్మ పండుగ సారెగా బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టిందని అన్నారు. ప్రతేడాది రూ.300 కోట్లు బతుకమ్మ చీరల కోసం వెచ్చిస్తున్నామని తెలిపారు. ఇంకా ఎవరైనా పింఛన్లు రాని వారు ఉంటే వారందరికి అందిస్తామన్నారు. త్వరలోనే సొంత స్థలంలో ఇండ్లను నిర్మించుకునే పేదలకు ప్రభుత్వం తరపున రూ.3లక్షలు అందించే కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని చెప్పారు. అనంతరం మంత్రి విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో 2015 నుంచి నేటి వరకు సుమారు 50 లక్షల అదనపు ఎకరాలు సాగులోకి వచ్చిందన్నారు. రైతుబంధు, రైతు బీమా, సాగునీటి రంగాన్ని బలోపేతం చేయడం వంటి కార్యక్రమాల వల్లనే ఇది సాధ్యమైందన్నారు. కానీ కేంద్రమంత్రి పీయుశ్ గోయల్ తెలంగాణ వ్యవసాయంపై అవహేళనగా మాట్లాడారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం రైతుల మీద కత్తి కట్టిందనీ, ఆహార భద్రత చట్టం ప్రకారం ప్రతి గింజను కొనాల్సిన బాధ్యత కేంద్రానిదేననీ, దాన్ని కూడా కూడా ప్రయివేటుపరం చేయబోతుందన్నారు. హంగర్ ఇండెక్స్‌లో బంగ్లాదేశ్, పాకిస్తాన్ కన్నా దారుణంగా భారత్‌కు 111 స్థానం దక్కిందని, మోడీ పాలనలో నైజీరియా కన్నా ఎక్కువ మంది పేదలు భారతదేశంలో ఉన్నారన్నారు. పోడు భూములపై హక్కుల కల్పనకు జిల్లా కలెక్టర్ నాయకత్వంలో సంబంధిత ప్రభుత్వ శాఖల సమన్వయంతో అక్టోబర్ 5లోగా ఆచరణాత్మక ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ అంశంపై కలెక్టరేట్లో రెవెన్యూ, అటవీ, పంచా యతీరాజ్ అధికారులతో మంత్రి సమీక్షించారు. సమావేశంలో జెడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ, కలెక్టర్ అనురాగ్ జయంతి, వేములవాడ ఎమ్మెల్యే రమేష్ బాబు, చేనేత జౌలిశాఖ కమిషనర్ బుద్ధ ప్రకాష్ జ్యోతి, తదితరులు పాల్గొన్నారు.