Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 50వేల ఎకరాల్లో ప్లాంటేషన్
- 4వేల మొక్కలతో పల్లె పకృతి వనాలు
- ఈఎస్సీఐ మూడ్రోజుల సెమినార్ ప్రారంభోత్సవంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌కుమార్
నవతెలంగాణ-సిటీబ్యూరో
'మానవ-ప్రేరిత వాతావరణ మార్పు ప్రకృతిలో ప్రమాదకరమైన, విస్తృతమైన అంతరాయాన్ని కలిగిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ప్రజల జీవితాలను ప్రభావితం చేస్తోంది. నీరు, వేడి, ఆరోగ్యం వంటి ప్రమాదాలు పొంచి ఉన్నాయి. వీటన్నింటినీ తగ్గించడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. రాష్ట్రవ్యాప్తంగా 50వేల ఎకరాల్లో ప్లాంటేషన్, ప్రతిపల్లెలో 4వేల మొక్కలతో పల్లె పకృతి వనాలు ఏర్పాటు చేశాం' అని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌కుమార్ తెలిపారు.
ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో 'పర్యావరణ వ్యవస్థలపై వాతావరణ మార్పు ప్రభావం : ఉపశమనం, అనుసరణ' అంశంపై మూడ్రోజుల అంత ర్జాతీయ సదస్సును గురువారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వాతావరణ మార్పులపై అంతర్జాతీయ సదస్సును నిర్వహించినందుకు ఈస్కీని అభినందించారు. ఇలాంటి కార్యక్రమాల ద్వారా వాతావరణ మార్పు దుష్ప్రభావాలను తగ్గించడానికి ప్రభుత్వం చేపట్టిన వివిధ కార్యక్రమాలను వివరించారు. 254 కోట్ల మొక్కలతో హరితహారం, రాష్ట్రవ్యాప్తంగా 50 వేల ఎకరాల్లో ప్లాంటేషన్‌తో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బృహత్ ప్రకృతి వనం, ఇప్పటి వరకు సుమారు 20,000 ఎకరాల్లో ప్లాంటేషన్ సాధించిన విషయాన్ని ఆయన నొక్కి చెప్పారు. ఇంధనం లేని వాహనాలపై పన్నులను తగ్గించడం ద్వారా ఈ-మొబిలిటీని ప్రోత్సహించడంతోపాటు ప్రభుత్వం మంచి రాయితీ కల్పిస్తోందని తెలిపారు. పట్టణ, గ్రామీణాభివృద్ధిలో భాగంగా ప్రభుత్వం గ్రీన్ బిల్డింగ్ భావనను ప్రారంభించిందన్నారు.
ప్రాణనష్టం, పట్టణ/గ్రామీణ వరదల గురించి ప్రభుత్వం విపత్తు నిర్వహణ సంసిద్ధతపై ఆసక్తి చూపుతోందన్నారు. ప్రభుత్వం నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాల కారణంగా 2014, 2019 మధ్యకాలంలో అటవీ విస్తీర్ణం మొత్తం 1,360 చదరపు కిలోమీటర్లమేర పెరిగిందని గుర్తుచేశారు. పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ ప్రచురించిన ఇండియన్ స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ నివేదిక ప్రకారం అటవీ విస్తీర్ణంలో 104శాతం సంచిత పెరుగుదల ఉందని, అదే కాలంలో 7.7శాతం పచ్చదనం పెరుగుదల ఉందని తెలిపారు. ఈ డేటా ఉపగ్రహం ద్వారా సేకరించబడుతుందని చెప్పారు. అంతకుముందు ఈస్కీ డైరెక్టర్ డాక్టర్ జి.రామేశ్వర్రావు స్వాగతోపన్యాసం చేశారు.
అంతర్జాతీయ సదస్సు, ఎక్స్పో లక్ష్యాలను వివరించారు. ఈ కార్యక్రమంలో ఎన్విరాన్మెంటల్ ఇంజినీరింగ్ విభాగం చైర్మెన్ జేసీ సింఘాల్, కమిటీ ఫర్ ది ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ ఆఫ్ ఇరిగేషన్, జలవిద్యుత్ ప్రాజెక్టులు మాజీ చైర్మెన్ డాక్టర్ పీజీ.శాస్త్రి, ఆర్ఈసీ మాజీ ప్రిన్సిపాల్ జిఎల్.రావు ప్రసంగించారు. సీఎస్ఐఆర్-ఐఐసీటీ ప్రతినిధి సమీనాబేగం ధన్యవాదాలను ప్రతిపాదించారు. మొదటగా ఫ్యాకల్టీ హెడ్ అనితాఅగర్వాల్ ప్రముఖులను ఆహ్వానించారు. కార్యక్రమంలో ఈస్కీ ఫ్యాకల్టీ, సిబ్బందితో పాటు ఇంజినీర్లు, కార్యనిర్వాహకులు, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, విద్యావేత్తలు పాల్గొన్నారు.