Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దేశవ్యాప్తంగా 15 రాష్ట్రాల్లో సోదాలు
- మొత్తం 47 మంది అరెస్టు.. కొత్తగా 9 కేసులు నమోదు
- నిజామాబాద్ కేసు ఆధారంగానే ఈ దాడులు
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి : నిజామాబాద్‌లో వెలుగు చూసిన పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ) కార్యకలాపాలు దేశవ్యాప్తంగా వేళ్లూనుకున్నట్టు ఎన్ఐఏ, ఈడీ లు జరిపిన దాడుల్లో తాజాగా వెలుగు చూసింది. నిజామాబాద్ కేసు ఆధారంగా చేసుకొని దర్యాప్తును సాగిస్తున్న ఎన్ఐఏ ఈడీ అధికారులు దేశవ్యాప్తంగా గురువారం పదిహేను రాష్ట్రాల్లోని పీఎఫ్ఐ కేంద్రాల్లో మెరుపుదాడులను నిర్వహించారు. ఈ దాడుల్లో కొత్తగా 47 మందిని అరెస్టు చేసిన ఎన్ఐఏ, ఈడీ అధికారులు పీఎఫ్ఐ ఉగ్రవాద కార్యకలాపాలకు సంబంధించి పలు డాక్యుమెంట్లు, సీడీలు, కంప్యూటర్ హార్డ్ డిస్క్‌లతో పాటు కొన్ని పదునైన ఆయుధాలనూ స్వాధీనం చేసుకున్నారు. ఎన్ఐఏ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. నిజామాబాద్‌లో ఫిజికల్ ట్రైనింగ్ మాటున మత విద్వేషాలను రగిల్చేలా ఒక వర్గం యువతకు నిర్వాహకులు ఆయుధ శిక్షణనిచ్చినట్టు గత జులై 4న స్థానిక పోలీసులు పీఎఫ్ఐపై కేసు నమోదు చేసిన విషయం విదితమే. దాన్ని ఆధారంగా చేసుకొని రంగంలోకి దిగిన ఎన్ఐఏ తెలంగాణ, ఆంధ్రలో దాడులు నిర్వహించి కొత్తగా నలుగురిని అరెస్టు చేయటమే గాక విచారణను కొనసాగించింది. ఈ విచారణలో తేలిన అంశాల ఆధారంగా దేశంలోని పలు రాష్ట్రాల్లో పీఎఫ్ఐ కార్యకలాపాలు చాపకింద నీరులా సాగుతున్నట్టు అధికారుల దృష్టికి వచ్చింది. దీంతో తెలంగాణతో సహా ఆంధ్రప్రదేశ్, కేరళ, కర్నాటక, తమిళనాడు, గోవా, పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, త్రిపుర, మణిపూర్, అసోం, ఒడిశా కలిపి మొత్తం 15 రాష్ట్రాల్లో ఎన్ఐఏ, ఈడీ అధికారులు మెరుపుదాడులను నిర్వహించారు.
పీఎఫ్ఐకి చెందిన కార్యాలయాలు, ఆ సంస్థ నాయకుల ఇండ్లలో సోదాలను నిర్వహించారు. ఈ విధంగా పదిహేను రాష్ట్రాలకు చెందిన 93 ప్రాంతాల్లో ఎన్ఐఏ, ఈడీ అధికారుల సోదాలు సాగాయి. ఈ సోదాల్లో అనేక ప్రాంతాల్లో మత విద్వేషాలను రగల్చటం, మత కలహాలు సృష్టించటం, దాడులకు పాల్పడటం, మతాల మధ్య విద్వేషాలను రగల్చేలా ప్రసంగాలను సాగించటంతో పాటు ఒక ప్రొఫెసర్ హత్యకు పీఎఫ్ఐ కార్యకర్తలు పాల్పడ్డట్టు ఎన్ఐఏ, ఈడీ అధికారులు తేల్చారు. వీటికి సంబంధించిన పలు కీలక ఆధారాలనూ సేకరించారు. కొత్తగా పీఎఫ్ఐపై తొమ్మిది కేసులను నమోదు చేయటమే గాక హైదరాబాద్‌లో అబ్దుల్ వారిస్ అనే పీఎఫ్ఐ కార్యకర్తతో పాటు కేరళలో 19 మందిని, తమిళనాడులో 17 మందిని, ఏపీలో నలుగురుతో పాటు ఇతర ప్రాంతాల్లో మిగతావారు కలిపి మొత్తం 47 మంది పీఎఫ్ఐ కార్యకర్తలు, నాయకులను ఎన్ఐఏ, ఈడీ అధికారులు అరెస్టు చేశారు. పీఎఫ్ఐ కార్యకలాపాల దేశం మొత్తం సాగటానికి ప్రతి రాష్ట్రంలో ప్రత్యేకించి నిధులను కొందరు సమకూర్చుతున్నారనీ, వారు ఎవరనేది తేల్చి పట్టుకోవటానికి చర్యలు సాగుతున్నాయని ఎన్ఐఏ అధికారులు తెలిపారు. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ విధానాలను అనుసరించి పీఎఫ్ఐ కార్యకలాపాలు సాగుతున్నాయని దేశవ్యాప్తంగా ఉగ్రవాద కార్యకలాపాలను విస్తరింపచేయాలని పీఎఫ్ఐ లక్ష్యంగా గుర్తించినట్టు ఎన్ఐఏ అధికారులు తెలిపారు. తాజాగా నమోదు చేసిన కేసుల ఆధారంగా దర్యాప్తును కొనసాగిస్తున్నట్టు చెప్పారు.