Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టికెట్లు పూర్తిగా అమ్ముడుపోయాయి
- మంత్రి సమక్షంలోనే అజహరుద్దీన్ ప్రకటన
- హెచ్సీఏను సమర్థించేలా శ్రీనివాస్ గౌడ్ తీరు
నవతెలంగాణ-హైదరాబాద్
'గురువారం ఉదయం 10 గంటలకు ఆఫ్లైన్లో టికెట్లు అందుబాటులో ఉంటాయి. గురువారం రాత్రి 7 గంటలకు మరోసారి ఆన్లైన్లో టికెట్లు అమ్మకానికి పెడుతున్నాం'.. ఇలా వరుసగా పరస్పర విరుద్ధ ప్రకటనలు చేసిన హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్సీఏ).. ఆ రెండు పద్దతుల్లోనూ టికెట్లను అమ్మకుండానే ఏకంగా పూర్తి టికెట్లు అమ్ముడుపోయావని హెచ్సీఏ అధ్యక్షుడు మహ్మద్ అజహరుద్దీన్ రాష్ట్ర క్రీడా మంత్రి సమక్షంలో ప్రకటన చేశాడు. అక్టోబర్ 25న ఉప్పల్ స్టేడియంలో భారత్, ఆస్ట్రేలియా టీ20 మ్యాచ్ నిర్వహణ ఏర్పాట్లు, టికెట్ల అందుబాటుపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించిన క్రీడా మంత్రిత్వ శాఖ.. సమీక్ష సమావేశాన్ని కాస్త హెచ్సీఏ సమర్థనా సమావేశంగా మార్చివేసింది. అభిమానులకు టికెట్లను అందుబాటులోకి ఉంచేందుకు తీసుకోవాల్సిన చర్యలపై హెచ్సీఏ ఉన్నతాధికారులను ఆదేశించాల్సిన క్రీడా శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్.. హెచ్సీఏ అధ్యక్షుడు అజహరుద్దీన్, కార్యదర్శి విజయానంద్లు చెప్పిన మాటలనే తిరిగి మీడియాకు వెల్లడించటం గమనార్హం. రవీంద్రభారతిలో మంత్రి కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి రాచకొండ సీపీ మహేశ్ భగవత్, క్రీడాశాఖ కార్యదర్శి సందీప్ సుల్తానియా సహా ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.
అజహర్ చిందులు : సుప్రీంకోర్టు ఆదేశాలకు ప్రకారం టీ20 మ్యాచ్ నిర్వహణకు అడ్వజరీ కమిటీతో సంప్రదింపులు చేసుకోకుండా, ఏకపక్ష నిర్ణయాలు ఎందుకు తీసుకుంటున్నారని ఓ విలేకరి ప్రశ్నించగా మహ్మద్ అజహరుద్దీన్ ఆవేశంగా మాట్లాడాడు. ' సుప్రీంకోర్టు ఆర్డర్ మీ దగ్గర ఉందా?. మ్యాచ్ నిర్వహణ అంటే ఆషా మాషీ కాదు. ఎన్నో విభాగాలతో సమన్వయం చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఎవరైనా తెలంగాణ కీర్తి పెంచాలని చూసేవారే. అందరూ తెలంగాణ బిడ్డలే. అందరికి తెలంగాణ రాష్ట్ర ప్రతిష్టలే ముఖ్యం. ఆదివారం మ్యాచ్కు సంబంధించి టికెట్లు అన్నీ అయిపోయాయి. ఆన్లైన్లో, ఆఫ్లైన్లో సేల్స్ ఏమీ లేవు.భవిష్యత్లో ఇక్కడ జరిగే మ్యాచ్లను రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి నిర్వహిస్తాం. జింఖానాలో జరిగిన ఘటన దురదృష్టకరం. గాయపడిన వారి వైద్య ఖర్చులు పూర్తిగా హెచ్సీఏ భరిస్తుంది. అక్టోబర్ 25న టీ20 మ్యాచ్ను విజయవంతంగా నిర్వహించేందుకు అందరితో కలిసి ముందుకు సాగుతున్నామని' అజహరుద్దీన్ అన్నారు.
'గతంలో హెచ్సీఏలో పూర్తి స్థాయి సభ్యులు ఉండేవారు. ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పుతో కేవలం ఇద్దరు మాత్రమే ఉన్నారు. ఇద్దరు వ్యక్తులు అన్ని విభాగాలతో సమన్వయం చేసుకోవటం అంత చిన్న విషయం కాదు. కచ్చితంగా జింఖానా గ్రౌండ్స్ వద్ద టికెట్ల కోసం జరిగిన ఘటనలో హెచ్సీఏ లోపం ఉంది. అందుకు వారు బాధ్యత తీసుకుంటున్నారు. భవిష్యత్లో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు. జింఖానా ఘటనపై పోలీసు కమిషనర్, క్రీడాశాఖ ముఖ్య కార్యదర్శి ఓ నివేదిక అందజేస్తారు. నివేదిక ప్రకారం బాధ్యులపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని' మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.