Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అంతర్జాతీయ స్థాయిలో పెరుగుదల అనేది బీజేపీ చెప్పే అబద్ధం
- ఎస్వీకే వెబినార్లో ఆర్థిక విశ్లేషకులు డి.పాపారావు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
దేశంలో ధరల పెరుగుదలకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ఆర్థిక విధానాలే కారణమని ప్రముఖ ఆర్థిక విశ్లేషకులు డి.పాపారావు విమర్శించారు. సాధారణంగా పెట్రోల్, డీజిల్ పెరిగితే దాని వెంటే రవాణా ఛార్జీలు, నిత్యావసర సరుకులు పెరుగుతాయని వివరించారు. అంతర్జాతీయంగా ఆయిల్ ధరలు పెరగడం వల్లే మన దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయనేది కేంద్రం చెబుతున్న పచ్చి అబద్ధమని ఆగ్రహం వ్యక్తం చేశారు. రష్యా - ఉక్రెయిన్ యుద్ధం సందర్భంగా రష్యా క్రూడాయిల్ ను కొనుగోలు చేసేందుకు పాశ్చాత్య దేశాలు ముందుకు రాకపోవడంతో తక్కువ ధరకు భారతదేశానికి అమ్ముకుందని గుర్తుచేశారు. దీనికి పోటీగా ఇరాక్ సైతం మరింత తక్కువ ధరలకు ఇచ్చేందుకు ఆసక్తి చూపిస్తున్నదని తెలిపారు. వాస్తవంగా పెట్రోల్, డీజిల్ క్రూడాయిల్ ను తక్కువ ధరకు కొనుగోలు చేసిందన్నారు. వాటిపై బీజేపీ సర్కారు ఎక్సైజ్ డ్యూటీ పెంచడం, రిఫైనరీ కంపెనీలు ఇతర దేశాలకు పెట్రోల్, డీజిల్ ను ఎగుమతి చేసుకోవడమే ధరల పెరుగుదలకు కారణమన్నారు. హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో గురువారం 'దేశ ఆర్థిక రంగం - వాస్తవాలు-వక్రీకరణలు' అనే అంశంపై వెబినార్ నిర్వహించారు. ఎస్వీకే మేనేజింగ్ కార్యదర్శి ఎస్.వినయ కుమార్ సమన్వయకర్తగా వ్యవహరించారు.
ఈ సందర్భంగా పాపారావు మాట్లాడుతూ భారతదేశంలో తగినంత ఉత్పత్తి ఉన్న గోధుమల ఎగుమతికి అనుమతించడంతో ఒక్క ఏడాదిలోనే వాటి ధర 12 శాతానికి పెరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. బియ్యాన్ని 164 దేశాలకు ఎగుమతి చేసిన కేంద్ర ప్రభుత్వ పెద్దలు కొరతకు కారణమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంచి బియ్యాన్ని ప్రపంచ దేశాలకు సరఫరా చేసి నూకల బియ్యాన్ని మన ప్రజల కోసం ఉంచిన బీజేపీ గొప్ప దేశభక్తియుత పార్టీ అని ఎద్దేవా చేశారు. కేరళలో ప్రజా పంపిణీ వ్యవస్థ బ్రహ్మాండంగా ఉందనీ, దీంతో ధరలు అదుపులో ఉన్నాయని తెలిపారు. ఆ రాష్ట్రంలో బయటి మార్కెట్లో కూడా ధరలు పెరిగే అవకాశం లేకుండా ప్రజా పంపిణీ వ్యవస్థ పోటీ పడుతున్నదని తెలిపారు. దేశంలో పారిశ్రామికాభివృద్ధి కోసమంటూ కార్పొరేట్లకు పన్నులు తగ్గించి, ప్రోత్సాహకాలిచ్చినా ఆ మేరకు ఫలితం రాలేదని విమర్శించారు. ప్రజల కొనుగోలు శక్తి పెరిగి వస్తువులకు డిమాండ్ పెరగకుండా పారిశ్రామికాభివృద్ధి జరగదనే చిన్న విషయాన్ని బీజేపీ పాలకులు విస్మరిస్తున్నారన్నారు. నిరుద్యోగం రికార్డు స్థాయిలో పెరిగిందనీ, అధిక సంఖ్యాకులు రైతులుగా ఉన్న దేశం కూలీల దేశం మారిందని తెలిపారు.
ఆర్థిక సంక్షోభంలో ప్రపంచం...గొప్ప యుగం మన ముంగిట
ప్రపంచం ఆర్థిక సంక్షోభంలోకి వేగంగా పయనిస్తున్నదంటూ ఇప్పటికే బ్రిటన్ ఆ దశకు చేరుకోగా, ఈ ఏడాది చివరి నాటికి అమెరికా, ఆ బాటలోనే జపాన్ తదితర దేశాలున్నాయని పాపారావు తెలిపారు. పెట్టుబడీదారి వ్యవస్థ సంక్షోభంలోకి వెళ్తున్న క్రమాన్ని ఇతర దేశాలు గుర్తిస్తున్నాయని తెలిపారు. తెల్లవారే ముందు చీకటి పెరిగినట్టుగా ప్రపంచ పరిస్థితి ఉందనీ, చరిత్రలో గొప్ప సువర్ణాధ్య యంలోకి అడుగుపెట్టబోతున్నామని ఆశాభావం వ్యక్తం చేశారు. అమెరికాలోని యువత సైతం సోషలిజం వైపు మొగ్గు చూపుతున్నారని తెలిపారు. మన దేశంలో వనరులున్నాయనీ, దాన్ని గొప్ప శక్తివంతమైన దేశంగా మార్చుకోవచ్చని సూచించారు. ఈ మేరకు ప్రజలను చైతన్యం చేస్తూ, సమీకరణ జరగాలని ఆకాంక్షించారు.
అందరూ పన్ను చెల్లింపుదారులే....
కేంద్రం లేవనెత్తిన ఉచితాలపై సుప్రీంకోర్టు పన్ను చెల్లింపుదారులతో కమిటీ వేసిందన్న ప్రశ్నకు పాపారావు సమాధానమిస్తూ... ప్రజలంతా పన్ను చెల్లింపుదారులేనని స్పష్టం చేశారు. కొందరు మాత్రమే పన్ను చెల్లింపుదారులన్నట్టు గుర్తించడం సరికాదన్నారు.
జీఎస్టీ పేరుతో ప్రతినిత్యం ప్రజలు పన్నులు చెల్లిస్తూనే ఉన్నారన్నారు. నేరుగా పన్ను చెల్లించే వారి కన్నా పరోక్షంగా చెల్లించే వారి పన్నుల మొత్తమే ఎక్కువని తెలిపారు. వ్యవస్థ అనేది బీమా లాంటిదనీ, అది ప్రజల సంక్షేమం చూసే బాధ్యత కలిగి ఉందని వివరించారు. దాన్ని ఉచితం అనడానికి వీల్లేదనీ, కార్పొరేట్లకు ఇచ్చే రాయితీలు, ప్రోత్సాహకాలే ఉచితాలని పాపారావు వివరించారు. ఇప్పటికే కేరళ, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాలు కేంద్ర ప్రకటనను వ్యతిరేకించడం శుభపరిణామమని అన్నారు. మన రాష్ట్రంలో పారిశ్రామికీకరణ పెరిగిందనీ, ఇటీవల బెంగుళూరు కన్నా హైదరాబాద్ లో ఐటీ రంగం పురోభివృద్ధిని సాధిస్తున్నదని చెప్పారు.