Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సమావేశ హాల్లోకి దూసుకొచ్చిన మహిళా కౌన్సిలర్ల భర్తలు, పిల్లలు
- పనులు చేసినా బిల్లులు చెల్లించడం లేదంటున్న కాంగ్రెస్, టీఆర్ఎస్ కౌన్సిలర్లు
నవతెలంగాణ-జోగిపేట
సంగారెడ్డి జిల్లా జోగిపేట మున్సిపాలిటీ సర్వసభ్య సమావేశం రసాభసాగా సాగింది. జోగిపేట మున్సిపల్ సమావేశం గురువారం చైర్మెన్ మల్లయ్య అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఎజెండా అంశాలను సభ్యులకు చదివి వినిపిస్తుండగా పాలకవర్గం సభ్యులందరినీ పిలవకుండా ఎజెండా ఎలా తయారు చేస్తారని కాంగ్రెస్ కౌన్సిలర్లు ప్రశ్నించడంతో కొద్దిసేపు వాగ్వాదం జరిగింది. మున్సిపాలిటీలో అభివృద్ధి పనులు చేపడుతున్నామని పదే పదే చెబుతున్న అధికార పార్టీ నాయకులు, చేపట్టిన పనులకు బిల్లులను చెల్లించకపోవడమేనా అభివృద్ధి అని కాంగ్రెస్ కౌన్సిలర్ చిట్టిబాబు ప్రశ్నించారు. తన వార్డులో పనులు చేసినా ఇప్పటివరకు ఎంబీ రికార్డు ఎందుకు చేయలేదో చెప్పాలని, బిల్లుల రికార్డు చేయకుండా ఎవరు అపుతున్నారో చెప్పాలని అధికారులను నిలదీశారు. ఈ విషయంపై చైర్మెన్ మల్లయ్యతో వాదోపవాదాలు జరిగాయి. ఇదే సమయంలో పక్క గదిలో ఉన్న అధికార పార్టీ కౌన్సిలర్ల భర్తలు, కుమారులు సమావేశ మందిరంలోకి చొచ్చుకొచ్చారు. ఎజెండా అంశాలపై చర్చ జరగకుండా ఒక్కసారిగా అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో సభలోకి వచ్చేందుకు మీకు ఎలాంటి హక్కు లేదని కాంగ్రెస్ కౌన్సిలర్లు అడ్డుచెప్పారు. వారంతా లోపలికి చొచ్చుకొచ్చినా అధికారులు చూస్తూ ఉండిపోయారే తప్ప ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఈ విషయంపై జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తామని కాంగ్రెస్ కౌన్సిలర్లు బయటకు వచ్చేశారు.
అంతకుముందు వినాయక నిమజ్జనం కోసం చెరువు వద్ద ఏర్పాట్లకు సంబంధించి రూ.2 లక్షలు ఆమోదానికి పెట్టడంతో సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. చెరువు వద్ద ఎలాంటి ఏర్పాట్లు చేయలేదని, తమ వద్ద ఫొటోలతో కూడిన ఆధారాలున్నాయని కాంగ్రెస్ కౌన్సిలర్లు రంగ సురేశ్; హరికృష్ణ, రేఖా ప్రవీణ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. వార్డుల్లో నెలకొన్న సమస్యలపై మమ్మల్ని సంప్రదించకుండా ఎజెండా అంశాలను ఏ ప్రాతిపదికన తయారు చేశారని చైర్మన్ మల్లయ్య, కమిషనర్ అశ్రిత్ కుమార్లపై టీఆర్ఎస్ కౌన్సిలర్ నాగరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. బతుకమ్మ పండుగకు రూ.2 లక్షలు, దసరా ఏర్పాట్లకు రూ.2 లక్షలు అంచనా వ్యయంపై కూడా సభ్యులు అభ్యంతరం తెలిపారు. పట్టణ ప్రగతి మొదటి విడతలో తాను చేపట్టిన మినీ వాటర్ ట్యాంక్ బిల్లులు ఇప్పటివరకు చెల్లించలేదన్నారు. అధికార పార్టీలో ఉన్నా ఏం లాభమని 14వ వార్డు టీఆర్ఎస్ కౌన్సిలర్ దుర్గేష్ ఆరోపించారు.
వార్డుల్లో నెలకొన్న సమస్యలపై ఎన్ని సార్లు తీర్మానాలు చేసినా, పనులు జరగకపోవడం ఏందని చైర్మెన్ మల్లయ్యపై టీఆర్ఎస్ కౌన్సిలర్ సుమిత్ర సత్యం ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి వార్డుకు రూ.2 లక్షలను జనరల్ ఫండ్‌ను కేటాయించడంపై సభ్యులు ఆమోదం తెలిపారు. రూ.48 లక్షలకు సంబంధించిన బడ్జెట్‌ను ఆమోదించారు. మరిన్ని అంశాలను ఆమోదించారు.