Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అటవీ, రెవెన్యూ, పంచాయతీ కార్యదర్శులతో సర్వే : అటవీ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి
- కుమురం భీం - ఆసిఫాబాద్ జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం
నవతెలంగాణ-ఆసిఫాబాద్
సీఎం కేసీఆర్ హామీ మేరకు పోడు భూముల సమస్యను పరిష్కరిస్తామని అటవీ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి చెప్పారు. గురువారం ఆసిఫాబాద్ కలెక్టరేట్లో కలెక్టర్ రాహుల్‌రాజ్ అధ్యక్షతన పోడు భూముల సర్వేపై అధికారులతో సమీక్షించారు. ప్రభుత్వం పోడు భూముల సమస్య పరిష్కారానికి జీఓ 140 జారీ చేసిందని, దీనికనుగుణంగా అటవీ, రెవెన్యూ, పోలీస్ అధికారులతోపాటు ఇతర విభాగాలు సమన్వయంతో పనిచేసి సర్వే పూర్తి చేయాలని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆసిఫాబాద్ జిల్లాలో ఎక్కువగా దరఖాస్తులు వచ్చాయన్నారు. వెంటనే సర్వే నిర్వహించి వివాదాస్పదంగా ఉన్న భూములకు సంబంధించి అటవీ శాఖ కార్యదర్శికి నివేదిక అందజేయాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. పోడు భూముల సమస్య పరిష్కారం తర్వాత ఇంచు అటవీ భూమి కూడా ఆక్రమణకు గురికాకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై, ప్రజాప్రతినిధులపై ఉంటుందన్నారు. కలెక్టర్ రాహుల్‌రాజ్ మాట్లాడుతూ.. జిల్లాలో పోడు భూములకు సంబంధించి 653 హాబిటేషన్స్లో 15వేల మంది గిరిజనులు, 16వేల మంది గిరిజనేతరులు దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. అటవీ శాఖ అధికారులు, పంచాయతీ సెక్రెటరీలు, రెవెన్యూ సిబ్బందితో శనివారం సర్వేకు సంబంధించి శిక్షణ కార్యక్రమం నిర్వహించనున్నట్టు చెప్పారు. సర్వే పారదర్శకంగా చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు వివరించారు. గిరిజన, గిరిజనేతరుల దరఖాస్తుల మోకాపై సర్వే చేయడానికి కనీసం రెండు నెలల సమయం పడుతుందని తెలిపారు. అటవీ, రెవెన్యూ సరిహద్దుల వివాదం ఉన్న భూమి 70వేల ఎకరాలు ఉందన్నారు. ఐటీడీఏ పీఓ వరుణ్‌రెడ్డి మాట్లాడుతూ.. గతంలో పట్టాలు పొందిన వారు కూడా దరఖాస్తు చేశారని, అటువంటి వారిని గుర్తించి తొలగించాలన్నారు. దీనికోసం ఆధార్ కార్డులను ప్రామాణికంగా తీసుకోవాలని సూచించారు. జడ్పీ చైర్పర్సన్ కోవ లక్ష్మి మాట్లాడుతూ.. అటవీ భూముల్లో శ్మశానవాటికలు ఉన్నచోట అధికారులు అభ్యంత రాలు వ్యక్తం చేస్తున్నారని, అలా చేయకుండా చూడాలన్నారు.
ఆసిఫాబాద్, సిర్పూర్ ఎమ్మెల్యేలు ఆత్రం సక్కు, కోనేరు కోనప్ప మాట్లాడుతూ.. మొదట రెవెన్యూ, అటవీ భూముల సరిహద్దుల వివాదాలు తొలగిన తర్వాత సర్వే మొదలు పెట్టాలని మంత్రిని కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ దండె విఠల్, జిల్లా అదనపు కలెక్టర్లు చాహత్ బాజ్‌పేయి, రాజేశం, డిఆర్ఓ సురేష్, ఎస్పీ సురేష్ కుమార్, జిల్లా అటవీ శాఖ అధికారి దినేష్ కుమార్, సంబంధిత శాఖ అధికారులు పాల్గొన్నారు.