Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మృతుల్లో ఎంపీటీసీ భర్త, పశువుల కాపరి
- మరో ఐదుగురికి గాయాలు
నవతెలంగాణ - కాగజ్నగర్ రూరల్/నిజాంసాగర్
వర్షంతోపాటు ఉరుములు, మెరుపులతో పిడుగులు పడ్డాయి. ఈ క్రమంలో చేను వద్ద ఉన్న ఇద్దరు మృతిచెందారు. వీరిలో ఎంపీటీసీ భర్త ఒకరు, మరొకరు పశువుల కాపరి ఉన్నారు. ఈ ఘటనలు గురుఆరం కుమురం భీం-ఆసిఫాబాద్ జిల్లా, కామారెడ్డి జిల్లాల్లో జరిగాయి. వివరాలిలా ఉన్నాయి.. కామారెడ్డి జిల్లా కాగజ్నగర్ మండలంలోని ఆరెగూడ గ్రామంలో గురువారం తెల్లవారుజామున పిడుగుపాటుతో బిమన్కార్ మోహన్రావు(48) మృతిచెందాడు. ఆరెగూడ గ్రామానికి చెందిన ఆరుగురు రైతులు అడవి పందుల బెడద నుంచి పంటలను కాపాడుకోవడానికి బుధవారం రాత్రి కాపు కాచేందుకు వెళ్లారు. అర్ధరాత్రి వర్షం కురియడంతో చేనులో ఏర్పాటు చేసిన ఓ పందిరి వద్దకు చేరి మంచంపై కూర్చున్నారు. ఇదే సమయంలో భారీ శబ్దంతో పిడుగు పడింది. దీంతో బిమన్కార్ మోహన్రావు, తుమ్మిడె గౌరయ్య, మానెంపల్లి కృష్ణ, ఎల్ములె రవి, డోకె రాజేందర్, రోహిణి మోసంబి అపస్మారక స్థితిలోకెళ్లారు. కొద్దిసేపటికి తేరుకున్న డోకె రాజేందర్ మిగతా రైతులను పరిశీలించగా మోహన్రావు విగతజీవిగా కనిపించాడు. మిగతా వారు గాయపడ్డారు. వెంటనే గ్రామస్తులకు సమాచారం అందజేశాడు. వారిని ఈజ్గాంలోని రేణుక సమీరన్ ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. మోహన్రావు గతంలో ఉపసర్పంచిగా పనిచేశారు. మోహన్రావు భార్య ప్రస్తుతం ఎంపీటీసీగా కొనసాగుతున్నారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, జెడ్పీ వైస్ చైర్మెన్ కోనేరు కృష్ణారావు బాధిత కుటుంబీకులను, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. ఈజ్గాం ఎస్ఐ జగదీష్ కేసు దర్యాప్తు చేస్తున్నారు.
మరొకరు మృతి
కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలం మంగ్లూర్ గ్రామానికి చెందిన సుబ్బూరి భూమయ్య(60) తన పశువులను మేపడానికి చేనుకెళ్లాడు. ఆ సమయంలో ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది. ఈ క్రమంలో పిడుగుపడటంతో భూమయ్య అక్కడికక్కడే ప్రాణం కోల్పోయాడు.