Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వారిని ఆర్టిజన్లుగా నియమించండి
- సీఎం కేసీఆర్‌కు రేవంత్ లేఖ
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
కేటీపీఎస్ ఆరో దశ నిర్మాణంలో కార్మికుల కష్టం దాగుందని టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ ఎనుముల రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. వారిని ఆర్టిజన్లుగా నియమించాలని కోరుతూ గురువారం ఆయన సీఎం కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాశారు. 'మీరు ఇటీవలి కాలంలో విద్యుత్ రంగంపై చెప్పుకుంటున్న గొప్పల వెనుక ఎంతో మంది కార్మికుల కష్టం దాగి ఉంది. వారి శ్రమకు ప్రభుత్వమిచ్చిన బహుమతి మోసం' అని పేర్కొన్నారు. కేటీపీఎస్ ఆరో దశ నిర్మాణంలో 2008 నుంచి 2013 వరకు పాలుపంచుకున్న వారిని ఆర్టిజన్లుగా నియమించుకుంటామని ఆ సంస్థ హామీని ఇచ్చిందని గుర్తు చేశారు. దాని నిర్మాణం పూర్తయినప్పటికీ ఇంకా వారికి ఇచ్చిన మాటను నిలబెట్టుకోకపోవడం క్షమించరాని విషయమని పేర్కొన్నారు. కేటీపీఎస్ ఏడో దశ నిర్మాణ సమయంలో ఆరో దశలో పాలుపంచుకున్న కార్మికులను ఆర్టిజన్లుగా తీసుకుంటామని సంస్థ సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావు రాత పూర్వకంగా హామీ ఇచ్చారని తెలిపారు. రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌కు కూడా ఇదే విషయాన్ని లిఖిత పూర్వకంగా తెలిపారని పేర్కొన్నారు. ఇది జరిగి ఐదేండ్లు గడిచినప్పటికీ కార్మికులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోకపోవడం సరైందికాదని పేర్కొన్నారు.