Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గ్రామీణ సహకార సంఘాలకు సీఎస్ దిశా నిర్దేశం
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
వ్యాపార లావాదేవీలను పెంచుకోవాలంటూ గ్రామీణ సహకర సంఘాలకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌కుమార్ ఆదేశించారు. గురువారం హైదరాబాద్‌లోని బీఆర్కేఆర్ భవన్లో కో-ఆపరేటివ్ క్రెడిట్ సంస్థల ఆర్థిక పరిపుష్టి పర్యవేక్షణపై సీఎస్ నేతృత్వంలోని ఉన్నత స్థాయి కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. రాష్ట్ర, జిల్లా సహకార బ్యాంకుల పనితీరుపై ఆయన ఈ సందర్భంగా సమీక్షించారు. రాష్ట్రం అన్ని రంగాల్లో వేగంగా ప్రగతిని సాధిస్తున్న నేపథ్యంలో గ్రామీణ సహకార సంస్థలు తమ వ్యాపార పరిమాణాన్ని పెంచుకునేందుకు అపారమైన అవకాశాలున్నాయని తెలిపారు. సహకార బ్యాంకుల ఆర్థిక పరిస్థితులను మెరుగుపరచడంలో బ్యాంకర్లు మరిన్ని అంశాలపై విషయాలపై దృష్టి సారించాలని కోరారు. గతేడాది రూ. 13,245 కోట్ల వ్యాపారం కాగా, ఈ ఏడాది అది రూ. 16,276.71 కోట్లకు చేరిందని వివరించారు. 2021-22లో టీఎస్సీఏబీ షేర్ క్యాపిటల్‌లో 25.41 శాతం వృద్ధి ఉందన్నారు. నిల్వలు 2020-21లో రూ. 556.53 కోట్ల నుంచి 2021-22లో రూ. 615 కోట్లకు పెరిగాయని వివరించారు. 2020-21లో డిపాజిట్లు రూ.5466.41 కోట్ల నుంచి రూ.6941.95 కోట్లకు పెరిగాయని తెలిపారు. రుణాలు 15.67 శాతం పెరిగి, రూ.6261.80 కోట్లకు చేరాలని వివరించారు. పెట్టుబడులు 40.27 శాతం పెరిగి రూ.2058.52 కోట్లకు చేరాయని వెల్లడించారు. టీఎస్సీఏబీ నిర్వహణ లాభం 2022 మార్చి 31 నాటికి రూ.100.89 కోట్లుకు చేరిందన్నారు. గతేడాది లాభం రూ. 59.38 కోట్లతో పోలిస్తే ఇది 69.90 శాతం పెరిగిందన్నారు. అలాగే నికర లాభం 66.82 శాతానికి చేరుకుని రూ.77.29 కోట్లకు చేరిందని చెప్పారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల కంప్యూటరీకరణలోతెలంగాణ దేశంలోనే అగ్రగామిగా నిలిచిందని తెలిపారు. ఈ సమావేశంలో వ్యవసాయ కార్యదర్శి ఎం. రఘునందన్‌రావు, ఆర్థిక శాఖ కార్యదర్శి టికె. శ్రీదేవి, సహకార శాఖ కమిషనర్ ఎం.వీరబ్రహ్మయ్య, టీఎస్సీఏబీ చైర్మెన్ కొండూరు రవీందర్రావు, ఎండీ నేతి మురళీధర్, ఆర్బీఐ రీజినల్ డైరెక్టర్ కె.నిఖిల, నాబార్డ్ సీజీఎం సుశీల చింతల, నాబార్డు జీఎం వై.హరగోపాల్ ఇతర అధికారులు పాల్గొన్నారు.