Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రభుత్వానికి సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ సూటి ప్రశ్న
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
అటవీ హక్కుల చట్టాన్ని పక్కనపెట్టి పోడుభూములకు పట్టాలెలా ఇస్తారంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర కమిటీ సూటిగా ప్రశ్నించింది. ఈ మేరకు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి సాధినేని వెంకటేశ్వరరావు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఆ చట్టాన్ని యధాతథంగా అమలు చేయకుండా మంత్రులు, ప్రజాప్రతినిధులకు పోడు పట్టాల జారీ బాధ్యతను అప్పగించటం నిబంధనలకు బాహాటంగా తూట్లు పొడవడం అధికార దుర్వినియోగానికి పాల్పడడమేనని విమర్శించారు. ఇంచార్జ్ మంత్రి కన్వీనర్‌గా జిల్లా అధికారులతో ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలతోపాటు జిల్లా పరిషత్ చైర్మెన్లను ప్రత్యేక ఆహ్వానితులుగా నియమించటమనేది రాజకీయ దురుద్దేశంతో చేసిన చర్య అని తెలిపారు. ఇప్పటికే గ్రామాల్లో అధికార పార్టీ కార్యకర్తలు పోడు భూములకు పట్టాలు ఇప్పిస్తామంటూ పైరవీ దందాలకు తెరలేపారని పేర్కొన్నారు. గిరిజన, ఆదివాసీల నుంచి రేట్లు నిర్ణయించి వసూళ్లకు పాల్పడుతున్నారని విమర్శించారు. .
తిక్కన్న మరణం పట్ల విప్లవ జోహార్లు
కర్నూల్ జిల్లా ఆదోనికి చెందిన సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ ఏపీ కమిటీ సభ్యులు తిక్కన్న అనారోగ్యంతో మరణించడం పట్ల ఆ పార్టీ తెలంగాణ కార్యదర్శి సాదినేని వెంకటేశ్వరరావు సంతాపం ప్రకటించారు. ఆయన మరణం విప్లవోద్యమానికి తీవ్ర నష్టమని తెలిపారు.