Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రభుత్వ వైద్యం పట్ల ప్రజల్లో పెరిగిన విశ్వాసం
- రాష్ట్ర సమాచార శాఖ కమిషనర్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
''ఒకనాడు నేను రాను బిడ్డో సర్కారు ధవాఖానా''కు అన్నట్టు వుండే ప్రభుత్వ ఆస్పత్రుల తీరు నేడు పూర్తిగా మారాయి. ప్రభుత్వ వైద్యం పట్ల ప్రజల నమ్మకం, విశ్వాసం పెరిగింది. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావుకు ప్రజల ఆరోగ్యం పట్ల ఉన్న మక్కువతో రాష్ట్రం ఆరోగ్య తెలంగాణాగా ఆవిర్భవిస్తున్నది. ఈ మేరకు రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ కమిషనర్ గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్న దాని ప్రకారం...గత ఎనిమిదేండ్లుగా ప్రభుత్వం చేపట్టిన బహుముఖ చర్యలతో జాతీయ ఆరోగ్య సూచికల్లో మూడో స్థానానికి చేరుకున్నది. రాష్ట్రం ఏర్పడక ముందు 92గా ఉన్న మాతృ మరణాల రేటు, ప్రస్తుతం 56కు, శిశు మరణాల రేటు 39 నుంచి 21కి తగ్గింది. ఐదేండ్లలోపు వయస్సు ఉన్న పిల్లల మరణాల రేటు 41 నుంచి 30కు, నవజాత శిశు మరణాల రేటు 25 నుంచి 17కి తగ్గింది. కేసీఆర్ కిట్ ద్వారా 2017 నుంచి ఇప్పటివరకు 13,29,951 మంది లబ్ది పొందారు. ఇందుకోసం రూ.1,176 కోట్లను నేరుగా బ్యాంకు ఖాతాల ద్వారా లబ్దిదారులకు ప్రభుత్వం బదిలీ చేసింది. 102 రిఫరల్ రవాణా ద్వారా 41 లక్షల మంది గర్భిణిలు సదుపాయం పొందారు. యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ రాష్ట్రం లో 99 శాతం లక్ష్యాన్ని సాధించింది. 35 ప్రత్యేక నవజాత సంరక్షణ యూనిట్లు లేబర్ రూమ్‌ల సమీపంలో ఉండి అనారోగ్యంతో ఉన్న శిశువులకు సరైన ప్రత్యేక సంరక్షణ సేవలను సకాలంలో అందిస్తున్నాయి. జీహెచ్ఎంసీ పరిధిలో 259 బస్తీ దవాఖానాలుండగా, వాటిలో 195 రకాల మందులు, 57 రకాల ల్యాబ్ పరీక్షలు అందుబాటులో ఉన్నాయి. ఉచిత డయాగ్నోస్టిక్ కేంద్రాలు ద్వారా రక్త పరీక్షలు,ఈసీజీ, ఎక్స్‌రే, యూజీసీ సేవలను ప్రభుత్వం అందిస్తున్నది. ప్రస్తుతం 20 జిల్లాల్లో ఈ టెస్ట్ లాబ్స్ ఉన్నాయి. మరో 13 ల్యాబ్‌ల ఏర్పాటు చేయనున్నది. ప్రతి నెలా దాదాపు నాలుగు లక్షల శాంపిళ్లను ఈ టెస్ట్ లాబ్స్ లో పరీక్షిస్తున్నారు.
ద్వితీయ స్థాయిలో 10,170 పడకలతో 175 ఆస్పత్రులు సెకండరీ హెల్త్ కేర్ సేవలను ప్రభుత్వం అందిస్తున్నది. రాష్ట్రంలో ప్రతి జిల్లాకు ప్రభుత్వ వైద్య కళాశాల ఉండేలా జిల్లాలకు వైద్య కళాశాల ను ప్రభుత్వం మంజూరు చేసింది. 2021 మే 18న ఆయుష్మాన్ భారత్ స్కీమ్‌తో ఆరోగ్యశ్రీని అనుసంధానించింది. తద్వారా 87.5 లక్షల కుటుంబాలకు లబ్ది చేకూరుతుంది. ఆరోగ్యశ్రీ కింద రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి 25 లక్షలకు పైగా శస్త్రచికిత్సలను నిర్వహించారు. తద్వారా 13 లక్షలకు పైగా రోగులకు సేవలందాయి. 57 ప్రభుత్వ రక్తనిధి కేంద్రాలు, 17 రక్త నిల్వ కేంద్రాలు ఉచితంగా సేవలు అందిస్తున్నాయి. 27 బ్లడ్ బ్యాంకుల్లో కాంపోనెంట్ సెపరేటర్లు ఉన్నాయి. ప్రభుత్వ వైద్య ఆరోగ్య సేవలను మెరుగుపరిచేందుకు కొత్త ''ఇంటిగ్రేటెడ్ హాస్పిటల్ ఫెసిలిటీ మేనేజ్మెంట్ సర్వీసెస్‌ను ప్రవేశపెట్టారు. ఈ విధానంలో భాగంగా డైట్ ఛార్జీలను రెట్టింపు చేసి కొత్త డైట్ మెనూను ప్రవేశపెట్టారు.