Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తమ్ముడి ఓటమి భయంతోనే రంగంలోకి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
- కాంగ్రెస్‌లో ఉంటూ రహస్యంగా బీజేపీ కోసమా?
- సాధారణ ఎన్నికల నాటికి కమలం చెంతకేనా?
- అప్పటిలోగా హస్తం పార్టీకి డ్యామేజీ వ్యూహం .. కాంగ్రెస్‌లో చర్చ
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
తమ్ముడి కోసం అన్న అంటే ఇదేదో సినిమా టైటిల్ అనుకోకూడదు. వేర్వేరు పార్టీల్లో ఉంటూ ఎన్నికల్లో పరస్పరం సహకరించుకుంటున్న కోమటిరెడ్డి బ్రదర్స్ కథే ఈ కథనం...కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఇటీవల బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. అన్న కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాత్రం కాంగ్రెస్‌లో కొనసాగుతున్న సంగతి విదితమే. సిద్ధాంత వైరుధ్యం ఉన్న ఆ రెండు పార్టీల్లో ఉంటూ బ్రదర్స్ ఆడుతున్న ఓ డ్రామా రాజకీయ వర్గాల్లో రక్తికడుతుందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. మునుగోడుపై అతిగా ఆశించి బొక్కబోర్లా పడి ఉనికి కోసం వెంపట్లాడుతున్న రాజగోపాల్‌రెడ్డికి అన్న వెంకట్‌రెడ్డి లోలోన నుంచి 'చేయి'చ్చి పైకి లేపేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నాడని సమాచారం. మునుగోడు నియోజకవర్గంలోని గట్టుప్పల్ జెడ్పీటీసీ కర్నాటి వెంకటేష్, ఇద్దరు ఎంపీటీసీలతో అన్న వెంకట్‌రెడ్డి రహస్యంగా మంతనాలు జరిపి, భారీ మొత్తంతో ఒప్పందం కుదిర్చారనీ, ఆ ఒప్పందం మేరకే వారు కాషాయం కండువా కప్పుకున్నారని స్థానికంగా ప్రజలు కోడై కూస్తున్నారు. కాంగ్రెస్ ఎంపీగా ఉన్న వెంకట్‌రెడ్డి తమ్ముడిపై ప్రేమతో సొంత పార్టీకే పంగనామాలు పెడుతున్నారని స్థానిక కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ్ముడితోపాటు బీజేపీలోకి పోకుండా కాంగ్రెస్‌కు నష్టం కలిగించేలా వ్యవహరిస్తున్నారని స్థానికులు అంటున్నారు. మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి రాజగోపాల్‌రెడ్డి ఓడిపోతున్నారనే వివిధ సర్వేల నేపథ్యంలో అన్న రంగంలోకి దిగారంటూ జోరుగా ప్రచారం జరుగుతున్నది. అంతకు ముందే ఆయన బీజేపీ సీనియర్ నేత బన్సల్‌తో ఢిల్లీలో రహస్యంగా చర్చలు జరిపినట్టు వర్గాలు అంటున్నాయి. మునుగోడు ఉప ఎన్నికపై సుదీర్ఘంగా చర్చించినట్టు తెలిసింది. సాధారణ ఎన్నికల్లో బీజేపీ గెలవాలంటే ముందుగా మునుగోడు గెలవాలనీ, అందుకు తమ్ముడిని గెలిపించే బాధ్యతను అన్న కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి భుజస్కంధాలపై కమలనాథులు షరతు పెట్టినట్టు ఆ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. అందుకే ఆయన కాంగ్రెస్ తరఫున ఎన్నికల ప్రచారం చేయకుండా పార్టీ క్యాడర్, ఓటర్లతోనూ ఆయన ఫోన్లోలో మాట్లాడుతూ బీజేపీకి అనుకూలంగా ఓటర్లను ప్రభావితం చేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. రాజగోపాల్‌రెడ్డి కాంట్రాక్టుల కోసమే ఆయన పార్టీ మారారనీ, కోట్లు ఖర్చు పెట్టి స్థానిక ప్రజా ప్రతినిధులను కొనుగోలు చేస్తున్నారంటూ పెద్ద ఎత్తున్న కాంగ్రెస్ నేతలు విమర్శలు చేస్తున్నారు. దీంతో బీజేపీలో చేరిన కొంత మంది నాయకులు తిరిగి హస్తం గూటికి చేరిన విషయం తెలిసిందే. గెలవకపోయినా, కనీసం రెండవ స్థానాన్ని దక్కించుకోవాలనే రాజగోపాల్‌రెడ్డి ఆశలు ఆడియాశలు అవుతున్నాయని పార్టీ నేతలు చెబుతున్నారు. దీంతో ఆయనకు ఓటమి భయం పట్టుకున్నట్టు సన్నిహితులు చెబుతున్నారు. తాజా పరిణామాలు తేడా కొట్టడంతో తానే స్వయంగా రంగంలోకి దిగినట్టు ప్రచారం జరుగుతున్నది. నేరుగా కాంగ్రెస్ నేతలు, ప్రజాప్రతినిధులను డబ్బులు ఆశపెట్టి...భయపెట్టి బీజేపీలో చేరేలా చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ఊకొండి ఎంపీటీసీ పి సైదులు గౌడ్ భర్తకు వెంకట్‌రెడ్డి స్వయంగా వాట్సాఫ్కాల్ చేసి తన తమ్ముడి గెలుపు కోసం పని చేయాలని బెదిరించారట. ఈ విషయాన్ని ఎంపీటీసీ భర్త స్వయంగా మీడియా ముందుకొచ్చి వెంకట్‌రెడ్డి తీరును ఎండగట్టారు. తనకేకాదు నియోజకవర్గంలోని చాలా మంది నేతలకు ఆయన ఫోన్ చేస్తున్నారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఉపఎన్నికను అడ్డం పెట్టుకుని వెంకట్‌రెడ్డి కాంగ్రెస్‌పార్టీకి చేయాల్సిన నష్టాన్ని చేసి, సాధారణ ఎన్నికల నాటికి ఆయన తమ్ముడి బాటలో నడించేందుకు ప్లాన్ చేసినట్టు ఏఐసీసీ సభ్యులొకరు తెలిపారు. తమ్ముడి గెలుపు కోసం కావాల్సిన ప్రాతిపదిక ఏర్పాటు చేసిన కోమటిరెడ్డి...కాంగ్రెస్ అభ్యర్థి తరఫున చేసే ప్రచారం నుంచి తప్పించుకునేందుకు అమెరికా వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్టు ఆయన తన సన్నిహితుల వద్ద చెప్పినట్టు విశ్వసనీయ సమాచారం.
నిజంగా ఆయనకు పార్టీ పట్ల విశ్వాసం ఉంటే కాంగ్రెస్ అభ్యర్థి స్రవంతి పక్షాన ప్రచారంలో పాల్గొనాలి కానీ ప్రచారానికి సంబంధించిన ఏ బాధ్యతను ఆయన తీసుకునేందుకు ముందుకు రావడం లేదని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. ఆయన మౌనంగా ఉండటానికైనా ప్రయత్నించాలి లేదా ప్రచారంలోనైనా పాల్గొనాలి. ఇవేవీ చేయకుండా తమ్ముడిని గెలిపించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత ఒకరు తెలిపారు.