Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రత్యక్ష పోరాటాలతో బుద్ధి చెబుతాం
- ఇండ్ల స్థలాలు, 'డబుల్' ఇండ్లు పంచాలి: సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి
- పేదల ఆధీనంలో ఉన్న స్థలాలకు పట్టాలివ్వాలి: ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మీ
- తెలంగాణ ప్రజాసంఘాల పోరాట వేదిక ఆధ్వర్యంలో కలెక్టరేట్ల వద్ద ధర్నా
- అడ్డుకున్న పోలీసులు.. తోపులాట.. నాయకుల అరెస్ట్
నవతెలంగాణ - విలేకరులు
''కండ్లు మూసుకుపోయి.. సోయి లేకుండా ఉన్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇకనైనా సోయి తెచ్చుకోవాలి.. ప్రజల సమస్యలను పరిష్కరించాలి.. పేదలకు ఇండ్ల స్థలాలు, పూర్తయిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను వెంటనే పంచాలి.. లేదంటే ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ప్రత్యక్ష పోరాటాలకు సిద్ధమై తగిన విధంగా బుద్ధి చెబుతాం.. ప్రభుత్వ భూములను ఆక్రమించి పేదలకు పంచుతాం..'' అని మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే, సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి హెచ్చరించారు. ఇండ్లు, ఇండ్ల స్థలాలు, డబుల్ బెడ్ రూమ్ల సాధన కోసం తెలంగాణ ప్రజాసంఘాల పోరాట వేదిక ఆధ్వర్యంలో శుక్రవారం నల్లగొండ, సూర్యాపేట, మంచిర్యాల జిల్లా కలెక్టరేట్ల వద్ద ధర్నా నిర్వహించారు. నల్లగొండ కలెక్టరేట్ వద్ద జూలకంటి రంగారెడ్డి ప్రసంగించారు. ఇంటి స్థలం లేని పేదలకు స్థలాలు ఇవ్వాలని, ఇవ్వకపోతే తామే ప్రభుత్వ స్థలాలను ఆక్రమిస్తామని హెచ్చరించారు. గత ప్రభుత్వాలు చాలా గ్రామాల్లో పేదలకు ఇండ్ల స్థలాల కోసం ప్రభుత్వ భూమిని సేకరించాయని, అక్కడ కొంతమందికి స్థలాలు ఇచ్చాయని చెప్పారు. ఇప్పుడు ఆ స్థలాల్లో రాష్ట్ర ప్రభుత్వం పల్లె ప్రకృతి వనాలు, శ్మశానవాటికలు, క్రీడా మైదానాలు కట్టడం దుర్మార్గమన్నారు. ఇవి కట్టాలంటే ప్రభుత్వం ప్రత్యేకంగా భూములను సేకరించాలని కోరారు. స్థలాల పట్టాలున్న పేదలకు ఇంటి నిర్మాణం కోసం ప్రభుత్వం రూ.5లక్షలు వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించి డబుల్ బెడ్రూమ్ ఇండ్లను వెంటనే పూర్తి చేసి అర్హులైన పేదలకు పంపిణీ చేయాలని కోరారు. ఈ క్రమంలో శాంతియుతంగా ధర్నా చేస్తున్న ప్రజాసంఘాల నాయకులను పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట జరిగింది. అనంతరం నేతలను లాక్కెళ్లి అరెస్టు చేశారు. అనంతరం వారిని వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేశారు. సూర్యాపేట కలెక్టరేట్ వద్ద ఐద్వా రాష్ట్ర కార్యదర్శి మల్లు లక్ష్మి మాట్లాడారు. జిల్లాలో 1991 నుంచి 2000 సంవత్సరం వరకు 130 గ్రామాల్లో బలహీన వర్గాల కాలనీల కోసం 2500 ఎకరాల ప్రభుత్వ భూమిని కొనుగోలు చేశారని చెప్పారు. ఆ భూములను వెంటనే అర్హులైన వారికి పంపిణీ చేయాలని కోరారు. పేదల ఆధీనంలో ఉన్న భూమికి వెంటనే పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతాంగానికి తక్షణమే రుణమాఫీ అమలు చేయాలని కోరారు. మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రజాసంఘాల పోరాట వేదిక జిల్లా కన్వీనర్ మల్లు నాగార్జునరెడ్డి, తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టీ.సాగర్, డీవైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు కోట రమేష్ తదితరులు పాల్గొన్నారు. పేదలకు ఇండ్లు, ఇండ్ల స్థలాలు ఇవ్వాలని, పెరుగుతున్న ధరలను నియంత్రించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ప్రజాసంఘాల పోరాట వేదిక ఆధ్వర్యంలో మంచిర్యాల కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరికి నిరసనగా నినాదాలు చేశారు. ధర్నా అనంతరం కలెక్టర్ కార్యాలయ అధికారికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రజాసంఘాల పోరాట వేదిక రాష్ట్ర నాయకులు పి.ఆశయ్య మాట్లాడారు. పూర్తయిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీలో జాప్యం జరిగితే తెలంగాణ ప్రజాసంఘాల పోరాట వేదిక ఆధ్వర్యంలో పేదలతో కలిసి గృహప్రవేశం చేస్తామని హెచ్చరించారు. వరద ముంపులో సర్వం కోల్పోయిన నిరుపేదలకు వెంటనే నష్ట పరిహారం చెల్లించి ఆదుకోవాలని కోరారు.