Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జెండా ఊపి ప్రారంభించిన కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
- టీఆర్ఎస్, బీజేపీ మధ్య పోటాపోటీగా నినాదాలు
నవ తెలంగాణ-మెదక్ టౌన్
మెదక్ జిల్లా అక్కన్నపేట్-మెదక్ రైల్వేలైన్‌ను జాతికి అంకితం చేస్తూ ఈ మార్గంలో తొలి రైలును కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి శుక్రవారం జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 17.2 కిలోమీటర్ల రైల్వే లైన్ నిర్మాణం మెదక్ జిల్లా ప్రజల చిరకాల వాంఛ అని తెలిపారు. రూ.118 కోట్ల అంచనాతో ప్రారంభమైన ఈ రైల్వేలైన్ రూ.205 కోట్లతో పూర్తయిందన్నారు. రైల్వేట్రాక్ నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. స్వాతంత్య్రం వచ్చాక తెలంగాణ ప్రాంతానికి రైల్వే లైన్ల విషయంలో అన్యాయం జరిగిందని, ఈ ఎనిమిదేండ్లలో తెలంగాణకు 12 కొత్త ప్రాజెక్టులు వచ్చాయని చెప్పారు. రైల్వేస్టేషన్లలో అటోమేటిక్ ట్రైన్ ప్రొటెక్టివ్ సిస్టమ్ ఏర్పాటు చేయడం ద్వారా రైలు ప్రమాదాలను అడ్డుకట్ట బడిందన్నారు. దేశవ్యాప్తంగా రైలు ప్రమాదాలు గణనీయంగా తగ్గాయన్నారు. సీసీటీవీల ఏర్పాటు ద్వారా రైల్వే స్టేషన్లలో ప్రయాణీకుల భద్రత విషయంలోనూ దక్షిణమధ్య రైల్వే ప్రత్యేకంగా కృషి చేస్తోందన్నారు. అక్కన్నపేట-మెదక్ రైల్వే మార్గం ప్రజలకు అందుబాటులోకి రావడం ద్వారా ఈ ప్రాంతంలో అభివృద్ధికి బాటలు పడతాయని చెప్పారు. గూడ్స్ రైళ్ల కోసం ప్రత్యేక ట్రాక్‌ల నిర్మాణం జరుగుతోందన్నారు. సికింద్రాబాద్-ముంబై రైల్వేలైన్‌కు అక్కన్నపేట్-మెదక్ మార్గం అనుసంధానం చేయడం ద్వారా దేశీయ మార్కెట్‌తో మెదక్ ప్రజల అనుసంధానం మరింత పెరిగిందన్నారు. ఏడుపాయల జాతరకు, మెదక్ చర్చిని సందర్శించేందుకు వచ్చేవారికి కూడా ఈ మార్గం చాలా ఉపయోగపడుతుందన్నారు. ఇకపై కాచిగూడ నుంచి మెదక్‌కు రెగ్యులర్‌గా రైళ్లు నడుస్తాయన్నారు. తెలంగాణలోని 174 రైల్వే స్టేషన్లలో హైస్పీడ్ వైఫై సదుపాయాన్ని కూడా దక్షిణ మధ్య రైల్వే కల్పిస్తోందన్నారు. గ్రీన్ ఎనర్జీ దిశగా దక్షిణ మధ్య రైల్వే తీవ్రంగా కృషి చేస్తోందన్నారు. 587 కిలోవాట్స్ పర్ ఇయర్ గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి జరుగుతోందన్నారు. ఇందుకుగాను నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అవార్డులతో పాటు ఐఎస్వో 14,001 సర్టిఫికేషన్ పొందడం అభినందనీయ మన్నారు. చేగుంటలో రైల్వే టికెట్ బుకింగ్ కార్యాలయం, ఆ స్టేషన్లో కొన్ని రైళ్లకు స్టాపింగ్ ఉండేలా చొరవ తీసుకోవాలన్న నాయకుల డిమాండ్‌పై స్పందిస్తూ.. అక్కడే ఉన్న దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్‌తో ఈ డిమాండ్లను త్వరలోనే పూర్తిచేస్తామని హామీ ఇప్పించారు. కాగా, మరికాసేపట్లో రైల్వే స్టేషన్ ప్రారంభించాల్సి ఉందనగా బీజేపీ, టీఆర్ఎస్ కార్యకర్తలు భారీగా చేరుకొని పోటాపోటీగా నినాదాలు చేశారు.
దాంతో అక్కడ టెన్షన్ వాతావరణ ఏర్పడింది. వెంటనే అలర్ట్ అయిన పోలీసులు ఇరు గ్రూపులను శాంతింపచేశారు. అంతేకాకుండా, మెదక్‌లో టీఆర్ఎస్, బీజేపీ మధ్య పోటాపోటీగా ఫ్లెక్సీలు వెలిశాయి. ఇరు పార్టీ మధ్య ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తుగా పోలీసులు పకడ్బందీ చర్యలు తీసుకున్నారు. కార్యక్రమంలో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు, ఎమ్మెల్సీ సుభాష్ రెడ్డి, జెడ్పీ ఉపాధ్యక్షులు లావణ్య రెడ్డి, మున్సిపల్ చైర్మెతన్ చంద్రపాల్ పాల్గొన్నారు.