Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రెండ్రోజుల్లో నోటిఫికేషన్
- పీహెచ్‌సీల్లో డాక్టర్ పోస్టుల భర్తీకి చర్యలు
- గాంధీలో పిడియాట్రిక్, సర్జరీ ఐసీయూ, ఎన్ఐసీయూ, సెమినార్ హాల్స్ ప్రారంభం
నవతెలంగాణ-బంజారాహిల్స్ / సికింద్రాబాద్
రాష్ట్రంలోని టీచింగ్ ఆస్పత్రుల్లో 1140 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేస్తామని, రెండ్రోజుల్లో నోటిఫికేషన్ ఇస్తామని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు వెల్లడించారు. ఇవేగాక ప్రైమరీ హెల్త్ సెంటర్స్‌లో కూడా డాక్టర్లు, సిబ్బంది కొరతను నివారిస్తామని, వారం పదిరోజుల్లో వెయ్యి మంది డాక్టర్ల నియామకానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇన్ఫెక్షన్ నియంత్రణ ప్రోగ్రామ్‌లో భాగంగా రాష్ట్రంలోని 30 టీచింగ్ ఆస్పత్రులకు చెందిన డాక్టర్లు, నర్సులకు శుక్రవారం హైదరాబాద్ పంజాగుట్టలోని నిమ్స్ ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమంలో హరీశ్‌రావు మాట్లాడారు.
దశలవారీగా వైద్య ఆరోగ్యశాఖలో అవసరమైన ఉద్యోగాల భర్తీకి చర్యలు తీసుకుంటామన్నారు. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని చెప్పారు. ఆస్పత్రుల్లో మూడంచెల విధానం ద్వారా ఇన్ఫెక్షన్ను నియంత్రించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. ప్రతి ఆస్పత్రిలోనూ సూపరింటెండెంట్ ఆధ్వర్యంలో ఇన్ఫెక్షన్ కంట్రోల్ కమిటీని ఏర్పాటు చేస్తామన్నారు. ప్రతి సోమవారమూ ఆ కమిటీ సమీక్ష చేసి నివేదిక సమర్పించాల్సి ఉంటుందన్నారు. ఆపరేషన్ల థియేటర్ల వారీగా ఇన్ఫెక్షన్ కంట్రోల్ ఆఫీసర్, స్టాఫ్ నర్సులను నియమిస్తామని చెప్పారు. నిమ్స్ ఆస్పత్రిలో ఇన్ఫెక్షన్ కంట్రోల్ చాలా మెరుగ్గా ఉందని ప్రశంసించారు. మంత్రి వెంట నిమ్స్ ఇన్చార్జి డైరెక్టర్ రామ్మూర్తి, సూపరింటెండెంట్ సత్యనారాయణ, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ శ్వేతా మహంతి తదితరులు ఉన్నారు.
మెడికల్ కళాశాలల విషయంలో కేంద్రం ద్వంద్వ వైఖరి
మెడికల్ కళాశాలల విషయంలో కేంద్ర ప్రభుత్వం ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తోందని మంత్రి హరీశ్‌రావు అన్నారు. గాంధీ ఆస్పత్రిలో పిడియాట్రిక్ ఐసీయూ, సర్జరీ ఐసీయూ, ఎంఐసీయూ, సెమినార్ హాల్స్‌ను మంత్రి ప్రారంభించారు. కేంద్రం ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ఎయిమ్స్ విషయంలో ఒక నీతి, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో నడిచే మెడికల్ కళాశాలల విషయంలో ఒక నీతి అన్నట్టుగా కేంద్రం వివక్ష చూపుతోందన్నారు. కేంద్రానికి ఒక పాలసీ, రాష్ట్రానికి ఒక పాలసీ ఎందుకని ప్రశ్నించారు.
ఎయిమ్స్ విద్యార్థుల భవిష్యత్‌ని దృష్టిలో ఉంచుకుని భువనగిరి ఆస్పత్రిలో శిక్షణ కోసం అనుమతి ఇచ్చామన్నారు. ఎయిమ్స్‌కి 200 ఎకరాల భూమి, రూ.200 కోట్ల విలువైన భవనాలు ఉచితంగా ఇచ్చినట్టు తెలిపారు.