Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జాతీయ సదస్సులో మంత్రి నిరంజన్‌రెడ్డి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
చిరుధాన్యాలకు ప్రాధాన్యమిచ్చేలా రైతులు ప్రయత్నించాలని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి సూచించారు. ప్రజలకు ఉపాధి, ఆహారం ఇచ్చే ముఖ్యమైనది వ్యవసాయ రంగమని చెప్పారు. ఆ రంగం నుంచి వచ్చే ఉత్పత్తులు సమకాలీన పరిస్థితులు, ప్రపంచపు ఆహారపు అలవాట్లను దృష్టిలో పెట్టుకుని ఉత్పత్తులు పెంచేలా రైతాంగాన్ని నడిపించాల్సి ఉంటుందని చెప్పారు. శుక్రవారం హైదరాబాద్‌లోని హెచ్ఐసీసీలో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్ రీసెర్చ్ నిర్వహించిన చిరుధాన్యాల జాతీయ సదస్సులో మంత్రి మాట్లాడారు. ఉమ్మడి రాష్ట్రంలో వచ్చిన పంటల సాగు, ఉత్పత్తులకు, ప్రస్తుత తెలంగాణ రాష్ట్రానికి పోల్చితే అద్భుతమైన పురోగతి ఉన్నదని తెలిపారు. ఈ వానాకాలంలో కోటీ 45 లక్షల ఎకరాల్లో వ్యవసాయ, ఉద్యాన పంటలు సాగవుతున్నాయని వివరించారు. ప్రపంచ వ్యాపితంగా ఉన్న ఆహారపు అలవాట్లను దృష్టిలో పెట్టుకుని మన దేశంలో పంటల సాగు చేయాల్సిన అవసరమున్నదని చెప్పారు. తెలంగాణ ప్రాంతం చిరు ధాన్యాలకు ప్రసిద్ది అనీ, కాలక్రమంలో అది తగ్గిందని అన్నారు. చిరుధాన్యాల సాగును ప్రోత్సహించాలని సూచించారు. చిరుధాన్యాల విస్తరణ పెంచడం ద్వారా భవిష్యత్తులో ప్రపంచ మార్కెట్‌ను భారత్ కైవసం చేసుకునే అవకాశం ఉన్నదని చెప్పారు. పంటల వైవిధ్యీకరణలో భాగంగా చిరుధాన్యాల సాగును పెంచాలనీ, పప్పు, నూనెగింజల పంటలు సాగుచేయాలని రైతులకు విజ్ఞప్తి చేశారు. చిరుధాన్యాల సాగు విస్తీర్ణం పెరగాలంటే పరిశోధనా సంస్థలు ఆ ధాన్యాల ఉత్పాదకతను పెంచాల్సిన అవసరమున్నదన్నారు. చిరుధాన్యాల సాగులో ఉన్న ఇబ్బందులు, ప్రభుత్వాలు తీసుకోవాల్సిన చర్యలపై విస్తృతంగా చర్చ జరగాల్సి ఉందన్నారు. పలు సంస్థలు, శాస్త్రవేత్తలు, అధికారులకు అవార్డులు అందించారు. ఐసీడీఎస్ ద్వారా చిరుధాన్యాలను ప్రోత్సహిస్తున్న ఆసిఫాబాద్ అడిషనల్ కలెక్టర్ చాహత్ భాజ్ పారు అవార్డు అందుకున్నారు. ఈ కార్యక్రమంలో నేషనల్ రెయిన్ ఫెడ్ ఏరియా అథారిటీ సీఈవో, అశోక్ దాల్వాయి, కేంద్రప్రభుత్వ సంయుక్త కార్యదర్శి శోభా ఠాకూర్, ఐకార్ అడిషనల్ డీజీ డాక్టర్ ఆర్.కె.సింగ్, ఐఐఎంఆర్ డైరెక్టర్ డాక్టర్ రత్నావతి, ఐఐఎంఆర్ న్యూట్రి హబ్ సీఈవో డాక్టర్ దయాకర్‌రావు, సమున్నతి సంస్థ అనిల్ కుమార్, వ్యవసాయ శాఖ అదనపు కమిషనర్ హన్మంతు తదితరులు పాల్గొన్నారు.