Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మీడియా ప్రచారం చేయాలి : సీసీఎంబీ మాజీ డైరెక్టర్ డా.మోహన్‌రావు
- తెలుగు రాష్ట్రాల్లో విజ్ఞాన శాస్త్ర ప్రచారం- ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ సమాచార మాధ్యమాల పాత్రపై వర్క్‌షాప్
నవతెలంగాణ-ఓయూ
సైన్స్, సైంటిఫిక్ ఆలోచనలు ప్రజలకు చేరువ కావాలని, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రసారం చేయాల్సిన, ప్రచురించాల్సిన అవసరం ఎంతైనా ఉందని సీసీఎంబీ మాజీ డైరెక్టర్ డా.మోహన్‌రావు చెప్పారు. ఓయూ సీఎఫ్ఆర్డీ కార్యాలయంలో డీఎస్టీ విజ్ఞాన్ ప్రసార్వారి సౌజన్యంతో నేషనల్ ఇన్ష్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ టెక్నాలజీ, వరంగల్, ఓయూ జర్నలిజం విభాగం ఆధ్వర్యంలో ''తెలుగు రాష్ట్రాల్లో విజ్ఞాన శాస్త్ర ప్రచారం - ప్రింట్, ఎలక్ట్రానిక్ సమాచార మాధ్యమాల పాత్ర'' అంశంపై శుక్రవారం వర్క్‌షాప్ నిర్వహించారు. సీసీఎంబీ మాజీ డైరెక్టర్ డా.మోహన్‌రావు, నవతెలంగాణ తెలుగు దినపత్రిక ఎడిటర్ ఆర్.సుధాభాస్కర్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా డా.మోహన్‌రావు మాట్లాడుతూ.. సైన్స్, సైంటిఫిక్ ఆలోచనలు ప్రజలకు చేరువయ్యేటట్టు ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా సులభమైన భాషలో ప్రసారం చేయాల్సిన, ప్రచురించాల్సిన బాధ్యత తీసుకోవాలని సూచించారు. సైన్సు ఇంటలెక్చువల్ యాక్టివిటీ అని, దానిని తెలుసుకోవాలన్న కుతూహలం అందరిలో ఉండాలని అన్నారు. ప్రతి వ్యక్తి నిత్య జీవితం సైన్స్‌తో ముడిపడి ఉందన్నారు. అన్నింట్లో ముందుడే సైన్సు.. దినపత్రికల్లో ఎందుకు ముఖ్యం కావడం లేదని ప్రశ్నించారు. సైన్స్‌తోనే ఆలోచనలు వికసించి నూతన పరిశోధనలు వెలుగులోకి వస్తాయన్నారు. ప్రజలకు పనికొచ్చే సైన్సు అంశాలపై మరిన్ని వ్యాసాలు రాయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. సైన్స్‌లో యూఎస్, జపాన్, సౌత్ కొరియా ఎలా ముందు వరుసలో ఉన్నాయో వివరించారు. ఆ దేశాలు సైన్స్ అండ్ టెక్నాలజీపై నిధులు ఖర్చు చేసినట్టు మన దేశం కూడా ఖర్చు చేయాలని కోరారు. దీనికి మీడియా కూడా కృషి చేయాలన్నారు. జర్నలిస్టులు సైంటిస్టులను ఇంటర్వ్యూలు చేసి సైన్స్ గురించి విపులంగా రాయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.
నవతెలంగాణ ఎడిటర్ ఆర్.సుధాభాస్కర్ మాట్లాడుతూ.. ప్రజల్లో మూఢనమ్మకాలు తొలగించడానికి ఏదైనా సంఘటనలు జరిగినప్పుడు దానిలోని శాస్త్రీయతను ప్రజలకు అర్థం అయ్యేలా రాయాల్సిన అవసరం ఉందన్నారు. హేతువాదంగా ఆలోచించేటట్టు మీడియా ప్రయత్నం చేయాలన్నారు. తాను సైన్స్ వల్ల ఎంతో నేర్చుకున్నట్టు తెలిపారు. సైన్సుతోపాటు సోషల్ సైన్సు కూడా ఉండాలని సూచించారు. దేశంలో అసమానతలు పెరుగుతున్నాయని, దానికి పరిష్కారం సైన్సుతో సాధ్య మవుతుందని చెప్పారు. అశాస్త్రీయత, మూఢనమ్మకాలు, అసమానతలు పెంచే న్యూస్ కాకుండా.. సైన్స్ ఆలోచనలను పెంపొందించే వార్తలు రాయాలన్నారు. నవతెలంగాణ దినపత్రిక అశాస్త్రీయ విషయాలకు ప్రాధాన్యం ఇవ్వదని చెప్పారు.
గ్రామాల్లో మూఢ నమ్మకాలు ఇంకా ఉన్నాయని, చేతబడి పేరుతో గ్రామ బహిష్కరణకు గురై ఎన్నో జీవితాలు ఛిద్రమవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఉత్తరప్రదేశ్‌లో దళిత బాలుడు దేవుడి విగ్రహాన్ని ముట్టుకున్నాడని వెలి వేయడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. ఇటువంటివి మూఢ నమ్మకాలకు వ్యతిరేకంగా.. శాస్త్రీయతను పెంపొందించేలా మీడియా ప్రచారం చేయాలని కోరారు. సరుకుల వినియోగం కోసం మనుషులను తయారు చేసే విధానం పోవాలన్నారు.
ఓయూ రిజిస్ట్రార్ లక్ష్మీనారాయణ వర్కుషాప్‌ను ప్రారంభించి మాట్లాడుతూ.. మూఢనమ్మకాలు లేని మేధోమథన సమాజానికి సైన్సు అవసరం ఎంతైనా ఉందన్నారు. ఓయూలో ఓపెన్ డే, ల్యాబ్ టు ల్యాండ్ సాధారణ ప్రజలకు తెలియజేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉడుముల సుధాకర్, కేజీడి సురేష్, వరంగల్ ఎన్ఐటీ ప్రిన్సిపాల్ ఇన్వెస్టిగేటర్ ప్రొ.లక్ష్మణరావు, ఓయూ జర్నలిజం విభాగం హెడ్ ప్రొఫెసర్ స్టీవెన్సన్, సిఎఫ్ఆర్డి డెరైక్టర్ ప్రొ.కరుణసాగర్, డా.పి.మురళీధర్‌రెడ్డి, వరంగల్ స్కోప్ తెలుగు పోగ్రాం కో ఆర్డినేటర్ ప్రొ.ఎ.రామచంద్రయ్య, జేవీవీ నేతలు ప్రొ.బిఎన్ రెడ్డి, ప్రొ.సత్య ప్రసాద్, వర ప్రసాద్, ప్రొ. కోయ వెంకటేశ్వర్రావు, ప్రొ.ఆదినారాయణ, రాజా, విద్యాసాగర్, విద్యార్థులు పాల్గొన్నారు.