Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- క్రికెట్ మ్యాచ్‌కు మూడంచెల భద్రత
- 4:30 గంటలకు స్టేడియంలోకి అనుమతి
- రాచకొండ సీపీ మహేష్‌భగవత్
నవతెలంగాణ-సిటీబ్యూరో
క్రికెట్ మ్యాచ్ టిక్కెట్ల కోసం గురువారం జింఖానా గ్రౌండ్ వద్ద జరిగిన తొక్కిసలాట అనంతరం పరిణామాల నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఉప్పల్ స్టేడియంలో ఆదివారం ఆస్ట్రేలియా- భారత్ జట్ల మధ్య టీ-20 క్రికెట్ మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. స్టేడియంతోపాటు పరిసర ప్రాంతాల్లో మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు. స్టేడియంలో కూర్చునే ప్రతి వ్యక్తి కదలికపైనా నిఘా ఉంటుందని రాచకొండ సీపీ మహేష్‌భగవత్ తెలిపారు. శుక్రవారం ఉప్పల్ స్టేడియంలో ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. అనంతరం విలేకరుల సమావేశంలో డీసీపీ రక్షితామూర్తి, శ్రీనివాస్‌తో కలిసి సీపీ మహేష్‌భగవత్ భద్రత ఏర్పాట్లపై వివరించారు.
హైదరాబాద్‌లో మూడేండ్ల తర్వాత క్రికెట్ మ్యాచ్ జరుగుతుండటంతో 2,500 మంది పోలీసు సిబ్బందితో భద్రత ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. మ్యాచ్‌కు దాదాపు 40వేల మంది వచ్చే అవకాశముందన్నారు. 7:30గంటలకు మ్యాచ్ ప్రారంభం అవుతుందని, ప్రేక్షకులను సాయంత్రం 4:30గంటల నుంచే అనుమతిస్తామని చెప్పారు. 4 గంటల నుంచి 9గేట్లలో రద్దీ ఎక్కువగా వుంటుందని, ప్రేక్షకులు ముందుగానే స్టేడియం వద్దకు చేరుకోవాలని సూచించారు. మహిళల కోసం ప్రత్యేక ఎంట్రెన్స్ ఉంటుందన్నారు. 300 సీసీ కెమెరాలను బిగించామని, మ్యాచ్‌పై ఇంటెలిజెన్స్ నిఘా ఉంటుందని చెప్పారు. ఇరు జట్ల క్రీడాకారులు శనివారం రానున్న నేపథ్యంలో శంషాబాద్ ఎయిర్‌పోర్టుతోపాటు వారు బసచేసే హోటల్స్ వద్ద భద్రత ఏర్పాటు చేశామన్నారు. క్రీడాకారులు తిరిగి వెళ్లేవరకు ప్రత్యేక బలగాలతో భద్రత కల్పిస్తామన్నారు.
మ్యాచ్‌లో కూర్చున్న ప్రతి వ్యక్తి కదలికలపైనా నిఘా ఉంటుందన్నారు. మొబైల్ ఫోన్లకు, ఇయర్ ఫోన్లకు అనుమతి ఉంటుందన్నారు. కెమెరాలకు అనుమతి లేదన్నారు. స్టేడియంలో తినుబండారాలపై అధిక ధరలు ఉంటే ఫిర్యాదు చేయాలని చెప్పారు. లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్, అక్టోపస్, ఏఆర్‌తోపాటు 8ప్లాటున్స్, షార్ప్షూటర్లను, షీ బృందాలను రంగంలోకి దించుతు న్నామన్నారు. ఇతర జిల్లాల నుంచి బలగాలను తెప్పిస్తున్నామన్నారు. ఐదు మొబైల్ పార్టీలతోపాటు ప్రత్యేకంగా సైడర్ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశామన్నారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని పిక్ప్యాకెటర్లపై నిఘా ఉంచామన్నారు. బ్లాక్‌లో టిక్కెట్లు అమ్మే వారిపై నిఘా ఉంటుందని, డయల్ 100కు సమాచారం తెలపాలని కోరారు.
అర్ధరాత్రి వరకు బస్సు, మెట్రో సౌకర్యాలు
మ్యాచ్ జరిగే రోజు అర్ధరాత్రి ఒంటి గంట వరకు మెట్రో రైలు, ఆర్టీసీ బస్సులు నడుస్తాయని సీపీ తెలిపారు. సికింద్రాబాద్, జూబ్లీ, ఇమ్లీబన్ తదితర ప్రాంతాల నుంచి ఉప్పల్ స్టేడియానికి ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశామన్నారు. ముందు జాగ్రత్తలో భాగంగా ఏడు అంబులెన్స్‌లు, అగ్నిమాపక వాహనాలను అందుబాటులో ఉంచామన్నారు. మొబైల్ టాయిలెట్స్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. సాయంత్రం 4గంటల నుంచి ఉప్పల్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయన్నారు. భారీ వాహనాలకు అనుమతులు లేవని, వాటిని ఎల్బీనగర్ మీదుగా మళ్లిస్తామని చెప్పారు. 21 పార్కింగ్ ప్రాంతాలను ఏర్పాటు చేశామన్నారు. ప్రత్యేక చెక్పోర్టులను ఏర్పాటు చేశామని, పాసులున్న వారిని మాత్రమే లోనికి అనుమతిస్తారన్నారు. ఈ సమావేశంలో ఏసీపీలు, ఉప్పల్ సీఐ గోవిందరెడ్డితోపాటు ఎస్ఐలు తదితరులు పాల్గొన్నారు.
స్టేడియంలోకి అనుమతులు లేని వస్తువులు
- పెద్దపర్సులు, క్యారీ బ్యాగ్స్, వాటర్‌బాటిల్స్
- ల్యాప్‌టాప్‌లు, బ్యానర్లు, కెమెరాలు, ఎలక్ట్రానిక్ వస్తువులు
- లైటర్లు, సిగరేట్లు, మ్యాచెస్ బాక్స్‌లు, ప్లాస్టిక్ వస్తువులు, బైనాక్యులర్స్
- షార్ప్ ఐటమ్స్, పెన్నులు, బ్యాటరీలు, హెల్మెట్లు, పర్ఫ్యూమ్స్
- తినుబండారాలు