Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆ పార్టీ పాలిత రాష్ట్రాల్లో ఉపాధి అంతంతే
- అందుకే ఉత్తరాది నుంచి తెలంగాణకు వలసలు
- గ్రామపంచాయతీ సిబ్బందికి అండగా ఉంటా
- బిల్కలెక్టర్లు, కారోబార్లది న్యాయమైన పోరాటం
- ఏ శాఖలోనూ లేని మల్టీపర్పస్ విధానం జీపీ కార్మికులకే ఎందుకు?
- సదస్సులో ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి
- హక్కుల కోసం పాలకుర్తి టూ ప్రగతిభవన్ పాదయాత్ర: పాలడుగు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
తెలంగాణలో బీజేపీ గెలిస్తే ఉన్న ఉపాధి అవకాశాలు కూడా పోతాయనీ, పక్కరాష్ట్రాలకు వలస పోవాల్సిన దుస్థితి వస్తుందని ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి హెచ్చరించారు. ఆ పార్టీ అధికారంలో ఉన్న ఉత్తరాది రాష్ట్రాల్లో అభివృద్ధి అంతంతేననీ, గంగాసింధూ పరివాహక ప్రాంతాల నుంచి తెలంగాణకు పెద్ద ఎత్తున వలసలు రావడమే అందుకు నిదర్శనమని చెప్పారు. అక్కడే సరైన ఉపాధి అవకాశాలు కల్పిస్తే లక్షలాది మంది ప్రజలు పొట్టచేతపట్టుకుని తెలంగాణకు ఎందుకొస్తారని ప్రశ్నించారు. గ్రామపంచాయతీల్లో మల్టీపర్పస్ పని విధానాన్ని రద్దు చేయాలనీ, బిల్కలెక్టర్లు, కారోబార్లను ప్రత్యేక కేటగిరీగా చూడటంతో పాటు సిబ్బందికి కనీస వేతనం ఇవ్వాలని డిమాండ్లపై కార్మికులు చేస్తున్న పోరాటంలో న్యాయముందన్నారు. వారి పోరాటానికి చట్టసభలోనూ, బయటా అండగా ఉంటానని భరోసానిచ్చారు. శుక్రవారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్, వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కారోబార్, బిల్కలెక్టర్ల రాష్ట్ర సదస్సు నిర్వహించారు. ఆ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు పి.గణపతిరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో నర్సిరెడ్డి మాట్లాడుతూ..ఏ శాఖలోనూ లేని మల్టీపర్పస్ పని విధానం గ్రామపంచాయతీల్లోనే ఎందుకు అని ప్రశ్నించారు. కలంతో పనిచేయాల్సిన బిల్కలెక్టర్లు, కారోబార్లతో మోరీలు తీయించడం, చెత్త ఎత్తించడటం ఎంతవరకు సబబు అని నిలదీశారు. ఈ విధానాన్ని రద్దు చేయాలంటూ సీఎం కేసీఆర్, పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావును కోరారు. రాష్ట్రంలో 64 లక్షల మంది రైతులకు ఎల్ఐసీ ద్వారా బీమా చేయించిన సర్కారు గ్రామాభివృద్ధిలో, పరిశుభ్రతలో కీలక పాత్ర పోషిస్తున్న 50 వేల మంది జీపీ కార్మికులకు ఇన్సూరెన్స్ చేయించలేదా? అని ప్రశ్నించారు. పరిశుభ్రత విషయంలో దేశంలో టాప్20 గ్రామాల్లో తెలంగాణవే 19 అని రాష్ట్ర సర్కారు గొప్పలు చెప్పుకుంటున్నదనీ, ఆ ఊర్లను ఆస్థాయిలో తీర్చిదిద్దిన పంచాయతీ కార్మికులకు కనీస వేతనాలు, ప్రోత్సహకాలు ఇవ్వాలనే సోయిని మాత్రం మరిచిందని విమర్శించారు. పంచాయతీ కార్మికులకు ప్రత్యేక గ్రాంట్ ద్వారా వేతనాలు ఇవ్వాలని కోరారు. రెండున్నర లక్షల కోట్ల రూపాయల భారీ బడ్జెట్లో ఇప్పుడిస్తున్న వేతనాల ఖర్చుకు అదనంగా మరో రూ.55 కోట్లు భరించి కనీస వేతనం ఇవ్వలేరా? అని ప్రశ్నించారు. నువ్వు దొంగ అంటే..కాదుకాదు నువ్వే పెద్ద దొంగ అంటూ బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు రాజకీయ క్రీడ ఆడుతూ ప్రజా సమస్యలను పక్కనబడేశాయని విమర్శించారు. సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ మాట్లాడుతూ..జీపీ కార్మికుల కోసం రాష్ట్ర సర్కారుపై ఒత్తిడి పెంచుతామన్నారు. పంచాయతీ కార్మికులకు వేతనాలు పెంచి పర్మినెంట్ చేయాలనీ, బిల్కలెక్టర్లు, కారోబార్లకు ప్రత్యేకహోదా కల్పించాలని డిమాండ్ చేశారు. లేదంటే సమ్మెలోకి వెళ్తామని హెచ్చరించారు. సమస్యల పరిష్కారం కోసం పక్షం రోజులు ఎదురుచూస్తాం..ఆ తర్వాత పాలకుర్తి నుంచి ప్రగతిభవన్వరకు గ్రామపంచాయతీ కార్మికులతో భారీ పాదయాత్ర చేపడతామని ప్రకటించారు. ఒకే పని చేస్తున్న మున్సిపల్ కార్మికులకు, జీపీ కార్మికులకు వేర్వేరు వేతనాలు ఏంటని ప్రశ్నించారు. జీవో నెంబర్ 51ని సవరించాలని డిమాండ్ చేశారు. కార్మికుల ఐక్యతను దెబ్బతీయాలని ప్రయత్నిస్తున్న వారి కుట్రలను పసిగట్టాలని సూచించారు. సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి ఎస్వీ.రమ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వంలేబర్కోడ్లను తీసుకొచ్చి కార్మికుల హక్కులను కాలరాసేందుకు కుట్రలు పన్నుతున్నదని విమర్శించారు. రాష్ట్రంలోని కార్మికులు, ఔట్సోర్సింగ్ సిబ్బంది తమ హక్కుల కోసం రోడ్లు ఎక్కుతున్నారనీ, సమస్యలు పరిష్కరించకుంటే వారి ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్, వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీహెచ్ వెంకటయ్య మాట్లాడుతూ..కారోబార్, బిల్ కలెక్టర్లకు ప్రత్యేక హోదా ఇచ్చి సిబ్బంది కేటగిరీల వారీగా వేతనాలు పెంచాలనీ, అందర్నీ పర్మినెంట్ చేయాలని తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. సదస్సు దాన్ని ఏకగ్రీవంగా ఆమోదించింది. కార్యక్రమంలో సుధాకర్, సోమన్న, ఈశ్వర్, పాండు, మహేశ్, యాదయ్య , వినోద్, దశరథ, సాంబయ్య, అప్పిరెడ్డి, శంకర్, తదితరులు పాల్గొన్నారు.