Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్ర మంత్రి నిరంజన్ జ్యోతి సాధ్వికి టీఆర్ఎస్ సూటి ప్రశ్న
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి నిరంజన్ జ్యోతి సాధ్వి... వాస్తవాలను మరిచి రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేయటం తగదని టీఆర్ఎస్ పేర్కొంది. రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడిందంటూ ఆమె చేసిన వ్యాఖ్యలను ఆ పార్టీ ఎమ్మెల్యే కేపీ వివేకానంద ఖండించారు. శుక్రవారం హైదరాబాద్లోని టీఆర్ఎస్ శాసనసభాపక్ష కార్యాలయంలో ఎమ్మెల్సీ యెగ్గె మల్లేశంతో కలిసి ఆయన విలేకర్ల సమావేశం నిర్వహించారు. సాధ్వి ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖే తెలంగాణకు 13 అవార్డులను ఇచ్చిందంటూ గుర్తు చేశారు. అలాంటప్పుడు రాష్ట్రంలో అభివృద్ధి లేదంటూ ఎలా మాట్లాడతారని ప్రశ్నించారు. 'అవార్డులు ఇచ్చేది మీరే.. తిరిగి విమర్శలు చేసేదీ మీరే...' అంటూ ఎద్దేవా చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజరు చేపట్టిన నాలుగో విడత ప్రజా సంగ్రామ యాత్ర అట్టర్ ఫ్లాప్ అయిందని విమర్శించారు. ఆయన మాటల్లో సరుకు, సామర్థ్యం ఏమీ లేవని అన్నారు. బీజేపీ పాలనలో చెప్పుకోవటానికి ఒక్క పథకమూ లేదు కాబట్టే ఆయన తమ ప్రభుత్వంపై లేనిపోని అభాండాలు వేస్తున్నారని వివేకా ఈ సందర్భంగా ఆగ్రహం వ్యక్తం చేశారు.