Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ డైరెక్టర్ ఎం.హనుమంతరావుకు డీబీఎఫ్ వినతి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఉపాధి హామీ పెండింగ్ నిధులను వెంటనే విడుదల చేసేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డీబీఎఫ్ జాతీయ కార్యదర్శి పి.శంకర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం హైదరాబాద్లోని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి కమిషనరేట్లో ఆ శాఖ డైరెక్టర్ ఎం.హనుమంతరావుకు వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కూలీలకు పెండింగ్ వేతనాలను చెల్లించేందుకు చర్యలు తీసుకుంటున్నామని డైరెక్టర్ చెప్పారని తెలిపారు. బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ చట్టానికి నిధులు తగ్గించడం వల్ల కూలీలకు వంద రోజుల పని దొరకడం లేదన్నారు. దేశ వ్యాప్తంగా కూలీలకు పది వేల కొట్ల రూపాయల వేతనాలు పెండింగ్లో ఉండటం దుర్మార్గమన్నారు. ఉపాధి కూలీల పట్ల కేంద్రం వివక్షను విడనాడాలన్నారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలను రోజుకు ఎనిమిది వందలకు పెంచాలనీ, 200 పనిదినాలు కల్పించాలని డిమాండ్ చేశారు. కూలీలకు బీమా సౌకర్యం కల్పించాలని కోరారు. కార్యక్రమంలో డీబీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి పులి కల్పన, వెంకన్న, తదితరులు పాల్గొన్నారు.