Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆడి..పాడిన తమిళిసై సౌందరరాజన్
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
గవర్నర్ నివాసం రాజ్‌భవన్‌లో బతుకమ్మ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ స్వయంగా బతుకమ్మను ఎత్తుకొని, పూజ చేసి, పాడుతూ, ఆటలు ఆడారు. మహిళా జర్నలిస్టులు, మహిళా వైద్యులు, సినీ, టీవీ కళాకారులు ఆమెతో పాటు బతుకమ్మ ఆడారు. అంతకుముందు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం మాస్టర్స్ ఇన్ పెరఫార్మింగ్ ఆర్ట్స్ (ఎమ్పీఏ), నృత్య విభాగాధిపతి వనజా ఉదరు ఆధ్వర్యంలో విద్యార్థులు మహిషాసురమర్థని 'అయిగిరినందిని' నృత్యరూపకా న్ని ప్రదర్శించారు. మధుసూదన్ మహిషాసురుడిగా, అభినయ, కస్తూరి, చైతన్య, జోత్న్స, మేఘన, నళిని దుర్గా రూపాలుగా అభినయించారు. అనంతరం వారే ముఖారిరాగం, ఆదితాళంలో ఆలపించిన 'కృష్ణం కలైయసఖి సుందరం' అభినయించారు. అదే విశ్వవిద్యాలయాలంలో జానపద విభాగాధిపతి డాక్టర్ లింగయ్య నేతృత్వంలో డప్పుకళాకారులు ప్రదర్శన నిర్వహించారు. మొత్తం 8 మంది డప్పుకళాకారుల్లో నలుగురు మహిళా కళాకారులు డప్పులు కొడుతూ, ఆడటం ఆహూతులను ఆకర్షించింది. అనంతరం రమాదేవి బృందం 'బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో' పాటను ఆలపించారు. అయితే కోరస్ గతి తప్పినట్టు కనిపించింది. మైక్ కూడా సరిగా పనిచేయలేదు. 'దక్ష' అనే చిన్నారి సంప్రదాయ వేషధారణతో గవర్నర్‌కు శుభాకాంక్షలు తెలుపడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సందర్భంగా గవర్నర్ తెలంగాణ ప్రజలకు బతుకమ్మ, దసరా శుభాకాంక్షలు తెలిపారు. సాంప్రదాయ జీవనం, సమతుల పౌష్టిక ఆహార విధానం, ప్రకృతితో మమేకం వంటి అనేక విషయాలు బతుకమ్మ పండుగలో ఇమిడి ఉన్నాయని చెప్పారు. ప్రతిఒక్కరూ గుండె పునర్నిర్మాణ పునర్జీవనం (సీపీఆర్) గురించి తెలుసొకో వాలనీ, ఆపత్కాలంలో ఇతరులకు సహాయాన్ని అందించాలని విజ్ఞప్తి చేశారు.
కేటీఆర్ స్పందించకుంటే...
కరీంనగర్ జిల్లా కాపువాడకు చెందిన మిర్యాల్‌కార్ మానస బీటెక్ పూర్తిచేశారు. ఆమె తండ్రి మరణించడంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. తనకు ల్యాప్‌ట్యాప్ ఇప్పిస్తే కోడింగ్ కొత్త కోర్సు నేర్చుకుంటానంటూ మంత్రి కే తారకరామారావుకు ట్వీట్ చేశారు. దానికి ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్‌ను కూడా ట్యాగ్ చేశారు. అయితే వారిరువురి నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. కానీ ఆ ట్వీట్‌కు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ స్పందించారు. మానసతో పాటు రేణుక అనే మరో విద్యార్ధినిని బతుకమ్మ వేడుకల సందర్భంగా రాజ్‌భవన్‌కు ఆహ్వానించి, రోటరీక్లబ్ ద్వారా ల్యాప్‌ట్యాప్‌లు అందచేశారు. దీనికి ఆ విద్యార్థినులు సంతోషం వ్యక్తం చేస్తూ, గవర్నర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.