Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రభుత్వ విధుల్లో నిర్లక్ష్యం
- ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 14మంది వైద్యులకు షోకాజ్ నోటీసులు
నవతెలంగాణ-నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి
వైద్యులకు ప్రభుత్వ జీతం కంటే ప్రయివేటు ప్రాక్టీస్‌లోనే అధిక సంపాదన ఉంటుందన్న విషయం అందరికి తెలిసిందే. అందుకే పేరుకు మాత్రమే ప్రభుత్వవైద్యులుగా ఉంటూ చాలా మంది డాక్టర్లు ప్రయివేటు క్లీనిక్‌లు ఏర్పాటు చేసుకుని చికిత్స చేస్తున్నారు. దాంతో నెలకు రూ.లక్షలు సంపాదించుకుంటున్నారు. ఇలా ప్రభుత్వ వైద్యులు తమ విధుల్లో నిర్లక్ష్యంగా ఉండటమే కాక, విధులకు డుమ్మా కొట్టి ప్రయివేటు క్లీనిక్‌లో వైద్యం అందిస్తున్న తీరుపై ప్రభుత్వం కన్నేసి ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 14మంది వైద్యులకు ఫోకాజ్ నోటీసులు జారీచేసింది.
ప్రభుత్వరంగంలో వైద్యం అందించే డాక్టర్లు సొంతంగా హాస్పిటల్స్ ఏర్పాటు చేసుకుని, అక్కడ చికిత్స అందిస్తూ సంపాదనకు అలవాటు పడి ప్రభుత్వ విధుల్లో నిర్లక్ష్యంగా ఉంటున్నారనే ఆరోపణలతో వారి పనితీరుపై ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి. దాంతో ప్రభుత్వమే ఇంటలిజెన్స్ ద్వారా ప్రభుత్వ వైద్యుల పనితీరుపై ఆరా తీసి వైద్యులందరి పనితీరుపై వివరాలు సేకరించింది. అలా ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని 14మందికి షోకాజ్ నోటీసులు అందినట్టు తెలిసింది. వారంతా నోటీసులకు సంజాయిషీ ఇచ్చే పనిలో లీనమయినట్టు సమాచారం. ఇదిలా ఉంటే జిల్లా స్థాయిలో బాధ్యులుగా ఉన్న వైద్యులకు కూడా నోటీసులు రావడం అంటే వారి పనితీరు ఏలా ఉందో అర్థమవుతుంది.
చర్యలు ఉండేనా..?
విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్న ఆరోపణలతో ఫోకాజ్ నోటీసులు అందుకున్న వైద్యులపై చర్యలుంటాయా లేదా అనుమానం తలెత్తుతుంది. ఈ మధ్యకాలంలో ప్రభుత్వ హాస్పిటల్ వైద్యుల నిర్లక్ష్యం కారణంగా బాలింత అఖిల మరణించగా, విచారణ చేసిన రాష్ట్రస్థాయి వైద్య అధికారులు స్థానిక డాక్టర్ల తప్పు ఏ మాత్రం లేదని ప్రకటించారు. బంధువులు, ప్రజా సంఘాలు, ప్రజాప్రతినిధులు హాస్పిటల్ వైద్యులు, సిబ్బంది కారణమని చెప్పిన వారి చెవికెక్కలేదు. అలాంటిది ఏండ్ల తరబడి ఇక్కడి హాస్పిటల్లోనే విధులు నిర్వహిస్తూ పాతుకుపోయిన వైద్యులపై చర్యలుంటాయంటే ఎలా నమ్మగలమనే అందరిలోనూ ఉంది. అయితే ఈమధ్యనే జిల్లాలో కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన వినరుకృష్ణారెడ్డి జిల్లా వైద్య వ్యవస్థపై ప్రత్యేక దృష్టి సారిస్తే ఫలితాలు వచ్చే అవకాశం లేకపోలేదు.
షోకాజ్ నోటీసులు అందిన మాట వాస్తవమే
- డాక్టర్ మాతృనాయక్, జిల్లా ఆస్పత్రుల సమన్వయ అధికారి నల్లగొండ
ప్రభుత్వ వైద్యులుగా పనిచేస్తున్న వైద్యులకు షోకాజ్ నోటీసులు అందిన మాట వాస్తవమే. నోటీసులు వచ్చి దాదాపు వారంరోజులు దాటింది. వాటికి సంబందించిన వివరణలు కూడా అందజేస్తున్నాం. ఎప్పుడు కూడా పేదలకు మెరుగైన వైద్యం అందించేందుకే తాము సిద్ధంగా ఉన్నాం.
నిర్లక్ష్యంగా ఉన్న వైద్యులపై చర్యలు తీసుకోవాలి - పాలడుగు ప్రభావతి,
ఐద్వా జిల్లా కార్యదర్శి నల్లగొండ
ప్రయివేటు హాస్పిటల్స్ ఏర్పాటు చేసి అధిక సంపాదనకు అలవాటు పడి ప్రభుత్వాస్పత్రిలో సమయం వెచ్చించకుండా సొంత హాస్పిటల్‌కు ప్రాధాన్యత ఇస్తూ విధుల్లో నిర్లక్ష్యంగా ఉన్న ప్రభుత్వ వైద్యులపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఏండ్ల తరబడిగా ఇక్కడే విధులు నిర్వహిస్తున్న వారిని వెంటనే బదిలీ చేయాలి.