Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పథకాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి
- దొడ్డిదారిన మూడు నల్లచట్టాలను అమలు చేసే యత్నం :
రౌండ్‌టేబుల్‌లో ఏఐకేఎస్ ఉపాధ్యక్షులు సారంపల్లి మల్లారెడ్డి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం 'ప్రధాని నమస్కారం' అని మంచి పేరుపెట్టి దేశ ప్రజలను ప్రపంచ మార్కెట్‌కు తాకట్టు పెట్టే కుట్రకు పూనుకున్నదనీ, అదే జరిగితే మన దేశం మరో సోమాలియాగా మారుతుందని ఏఐకేఎస్ ఉపాధ్యక్షులు సారంపల్లి మల్లారెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. వ్యవసాయాన్ని కేవలం 8 మంది కార్పొరేట్లకు అప్పగించే కుట్ర దాని వెనుక ఉందని విమర్శించారు. పీఎం ప్రణామ్ పథకాన్ని వెనక్కితీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆదివారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో 'పీఎం ప్రణామ్-పర్యవసనాలు' అనే అంశంపై రౌండ్‌టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు పి.జంగారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ రౌండ్‌టేబుల్‌లో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తీగల సాగర్ పీఎం ప్రణామ్ పథకాన్ని కేంద్రం వెనక్కి తీసుకోవాలనే తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ.. ఒకప్పుడు ప్రపంచానికి ఆహార ధాన్యాలు ఎగుమతి చేసే స్థాయి నుంచి నేడు దిగుమతులు చేసుకునే స్థాయికి మన దేశాన్ని పాలకులు దిగజార్చారనీ, కార్పొరేట్ల లాభాల కోసమే ఇదంతా చేస్తున్నారని విమర్శించారు. పాల, గుడ్ల ఉత్పత్తుల్లో ప్రపంచంలోనే నెంబర్ వన్ స్థానంలో ఉన్న మన దేశం వేరే దేశాల నుంచి వాటిని దిగుమతి చేసుకోవడమేంటని ప్రశ్నించారు. దిగుమతులు విషయంలో డబ్బులు పెద్దఎత్తున చేతులుమారి అవినీతి జరుగుతున్నదని విమర్శించారు. డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ మరింత పడిపోవటం వల్ల దిగుమతుల భారం దేశంపై మరింత పెరిగిందని వివరించారు. సేంద్రియ ఎరువులు, రసాయన ఎరువులను సమపాళ్లలో వాడితేనే పంట దిగుబడి ఎక్కువగా వస్తున్నదని వివరించారు. సేంద్రియ ఎరువుల ప్రమోట్ పేరుతో రైతులను వ్యవసాయం నుంచి దూరం చేసి ఆ రంగాన్ని మోడీ సర్కారు కార్పొరేట్లకు కట్టబెట్టచూస్తున్నదని విమర్శించారు. సాగర్ మాట్లాడుతూ...వ్యవసాయ చట్టాలను వేరే రూపంలో అమలు చేసే ప్రయత్నానికి కేంద్రం పూనుకున్నదన్నారు. రైతాంగానికి ఇస్తున్న ఎరువుల సబ్సిడీలను ఎత్తేసే కుట్ర పీఎం ప్రణామ్ పథకం వెనుక ఉందన్నారు. అదే సమయంలో వాటి సబ్సిడీలు ఎత్తేస్తే దానికి సంబంధించిన నిధుల్లో రాష్ట్రాలకు వాటా ఇస్తామని ఆశచూపుతున్నదని విమర్శించారు. ఆ పథకం వల్ల దేశ ఆహారభద్రతకు ప్రమాదం పొంచి ఉందనీ, ప్రజాపంపిణీ వ్యవస్థను నిర్వీర్యమవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కనీస మద్దతు ధరల చట్టం తేవడంలో కేంద్రం విఫలమైందని విమర్శించారు.
పీఎం ప్రణామ్ పథకానికి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా, మండల కేంద్రాల్లో వారంపాటు రౌండ్‌టేబుల్ సమావేశాలు, సదస్సులు, విస్తృత, అవగాహనా సమావేశాలు నిర్వహిస్తామని ప్రకటించారు. కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్.వెంకట్రాములు, కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.స్కైలాబ్‌బాబు, గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్.శ్రీరామ్‌నాయక్, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ప్రసాద్, వృత్తిదారుల సమన్వయ కమిటీ నాయకులు పైళ్ల ఆశయ్య, డీవైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు కోట రమేశ్, రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు అరిబండి ప్రసాద్‌రావు, సహాయ కార్యదర్శి ఎం.శోభన్, రైతాంగ సమితి నాయకులు సాయన్న, తదితరులు పాల్గొన్నారు.