Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చికిత్స పొందుతున్న యువతి
నవతెలంగాణ-ఓయూ
ప్రేమించిన యువతిపై ప్రేమికుడే దాడి చేసిన ఘటన హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీ పోలీసు స్టేషన్ పరిధిలో శనివారం రాత్రి చోటు చేసుకుంది. ఓయూ ఇన్స్పెక్టర్ రమేష్ నాయక్ తెలిపిన వివరాల ప్రకారం.. ముషీరాబాద్ భోలక్‌పూర్‌కు చెందిన ఓ యువతి(18), రంజిత్(19) కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. యువతి ఓపెన్ డిగ్రీ చేస్తూ ముషీరాబాద్‌లో ఫార్మాసిస్టుగా పనిచేస్తుంది. కొన్ని రోజుల నుంచి ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలు రావడంతో ఆ యువతి రంజిత్‌ను దూరం పెడుతూ వస్తుంది. ఈ క్రమంలో శనివారం రాత్రి రంజిత్ యువతి ఉద్యోగం చేస్తున్న చోటకు వెళ్లి ఆమెను తన ద్విచక్ర వాహనంపై ఎక్కించుకుని మాట్లాడుకుందామని ఓయూ క్యాంపస్‌లోని మానేరు హాస్టల్ సమీపంలోకి తీసుకొచ్చాడు. అక్కడ ఇద్దరి మధ్య మాటా మాట పెరిగింది. దాంతో తన వెంట తెచ్చుకున్న కత్తితో రంజిత్ యువతిపై దాడి చేశాడు. ఆమె ప్రతిఘటిస్తూ తప్పించుకునే ప్రయత్నంగా తనచేతిని అడ్డుగా పెట్టగా చేతిపై తీవ్ర గాయాలయ్యాయి. కాపాడంటూ యువతి పెద్దగా కేకలు వేయడంతో రంజిత్ తన ద్విచక్ర వాహనాన్ని అక్కడే వదిలిపెట్టి పారిపోయాడు. యువతి కేకలు విన్న క్యాంపస్‌లోని కొందరు విద్యార్థులు తన వద్దకి చేరుకొని విషయం తెలుసుకొని ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. గాయపడ్డ యువతిని చికిత్స కోసం గాంధీకి తరలించారు. ప్రస్తుతం మెరుగైన వైద్యం కోసం కాచిగూడలోని ప్రతిమా హాస్పిటల్లో చికిత్స పొందుతుంది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుని కోసం గాలిస్తున్నట్టు చెప్పారు.