Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
జాతీయ సమైక్యతను నిలుపుకోలేకపోతే దేశం అల్లకల్లోలమవుతుందని తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మెన్ జూలూరు గౌరీశంకర్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రగతిశీల శక్తులు, అభ్యుదయవాదులు, సామాజికంగా ఆలోచించే కవులు, రచయితలు నేడు జాతీయ సమైక్యత, మతసామరస్యంపై విరివిగా రచనలు చేయాలని కోరారు. ఆదివారం పీవీ నరసింహారావు వెటర్నటీ యూనివర్సిటీ ఆడిటోరియంలో జాతీయస్థాయి తెలంగాణ 'పోయెట్రీ ఫెస్టివల్'ను జూలూరు ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ మతాన్ని నమ్ముకున్న రాజ్యాలు ఏ రకమైన దుస్థితిని ఎదుర్కొంటున్నాయనే విషయాన్నే ఈ తరానికి రచనల ద్వారా తెలియజేయాలని కోరారు. జాతీయస్థాయిలో కవి సమ్మేళనాన్ని ఏర్పాటు చేయడంతోపాటుగా స్థానికంగా కూడా యువతకు స్ఫూర్తిని కలిగించే విధంగా రచనలు చేయాలని తెలిపారు. కవులు డాక్టర్ దామెర రాములు, డాక్టర్ అప్పాల చక్రధారి, సుంకర రమేష్, కొండి మల్లారెడ్డి, అన్నవరం దేవేందర్, తుమ్మల దేవరావు, అంబటి నారాయణ, శ్రీరామకవచం సాగర్ తదితరులు హాజరయ్యారు.కార్యక్రమానికి ప్రముఖ అనువాదకుడు డాక్టర్ మంతెన దామోదరాచారి అధ్యక్షత వహించారు.