Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎర్రజెండా మీకు అండ : కామారెడ్డి జిల్లా జంగంపల్లిలో పేదలకు జూలకంటి భరోసా
- గుడిసెలు తొలగించొద్దని అధికారులకు హెచ్చరిక
- పేదల భూమిని ఇతర అవసరాలకు మళ్లించడంపై ఆగ్రహం
- సీపీఐ(ఎం) సభతో పేదల్లో విశ్వాసం
నవతెలంగాణ-నిజామాబాద్ ప్రాంతీయ ప్రతినిధి, భిక్కనూర్
పోరాటాలతోనే పేదలకు హక్కులు దక్కుతాయని, ఆందోళన బాట వీడొద్దని కామారెడ్డి జిల్లా జంగంపల్లిలో భూముల కోసం పోరాడుతున్న పేదలకు మాజీ ఎమ్మెల్యే, సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి పిలుపునిచ్చారు. ఈ పోరాటాలకు సీపీఐ(ఎం) పూర్తి అండగా ఉంటుందని భరోసానిచ్చారు. కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం జంగంపల్లిలో ఇండ్ల స్థలాల కోసం సీపీఐ(ఎం) చేస్తున్న పోరాట కేంద్రాన్ని సోమవారం జూలకంటి రంగారెడ్డి, డీజీ నర్సింగ్‌రావు, రాష్ట్ర కమిటీ సభ్యులు ఎస్వీ రమ సందర్శించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో జూలకంటి మాట్లాడుతూ.. ఇండ్ల స్థలాల కోసం వారం రోజులుగా ఆందోళన చేస్తున్న పేదలను అభినందించారు. మీరు గొంతెమ్మ కోర్కెలు కోరడం లేదని, చాలా న్యాయమైన డిమాండ్‌తో పోరాటం చేస్తున్నారని తెలిపారు. 14 ఏండ్ల కింద పేదల ఇండ్ల కోసం ప్రభుత్వం కొన్న భూమిని వారికి కేటాయించకుండా ఇతర అవసరాలకు మళ్లించడంతో పలుమార్లు అధికారులకు దరఖాస్తులు చేసుకున్నా పట్టించుకోకపోవడం బాధ కరమన్నారు. అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో తప్పనిసరి పరిస్థితుల్లో గుడిసెలు వేసుకుని జీవిస్తున్నారన్నారు. అధికారులు, పోలీసులు.. అరెస్టులు, కేసులంటూ భయపెట్టే ప్రయత్నం చేస్తారని, అయినా ఎంతో కష్టంతో వేసుకున్న ఈ గుడిసెలను వీడొద్దని సూచించారు. వెంటనే ఈ స్థలాన్ని ప్లాట్లు చేసి అందరికీ ఇవ్వాలని, ఇండ్లు నిర్మించుకోవడానికి రూ.5లక్షల సాయం చేయాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి, ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఇక పేదలు వేసుకున్న గుడిసెలు జోలికి అధికారులు రావొద్దని హెచ్చరించారు. చిట్యాల ఐలమ్మ పోరాటస్ఫూర్తితో ఇండ్ల స్థలాలు దక్కేవరకు ఈ ప్రాంతం (జంగంపల్లిలో పేదలు గుడిసెలు వేసుకున్నస్థలం) వీడకుండా పోరాడాలని పిలుపునిచ్చారు.
అనంతరం డీజీ నర్సింగ్‌రావు మాట్లాడుతూ... టీఆర్ఎస్ సర్కారు అధికారంలోకి వచ్చి ఎనిమిదేండ్లు గడిచినా జంగంపల్లిలో ఇండ్ల స్థలాల విషయంలో పేదలకు న్యాయం దక్కలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ హామీలన్నీ నీటి బుడగల్లా ఉన్నాయని ఎద్దేవా చేశారు. ఇండ్ల పట్టాలు ఇచ్చి స్థలాలు కేటాయించకపోతే ఈ పేదల ఉసురు తగులుతుందని అన్నారు. సమస్య పరిష్కారం అయ్యే వరకు పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. ఎస్వీ రమ మాట్లాడుతూ... ఉద్యమనాయకులు అధికారంలోకి వస్తే మంచి జరుగుతుందని అంతా భావించామని, కానీ గడిచిన ఎనిమిదేండ్లలో పేదలకు ఏమీ జరగలేదని వాపోయారు. పేదల స్థలాలను క్రమబద్దీకరిస్తామన్న హామీ అటకెక్కించారని విమర్శించారు. ఉద్యమాలు చేస్తేనే హక్కులు సాధించుకుంటామని స్పష్టం చేశారు.
పేదల్లో భరోసా...
సీపీఐ(ఎం) రాష్ట్ర నాయకుల పర్యటనతో పేదల్లో భరోసా కలిగింది. పట్టాలు ఇచ్చి భూములు కేటాయించలేదని, కొంతమందికి ఆ పట్టాలు కూడా ఇవ్వలేదని నాయకులతో బాధితులు వాపోయారు. అయితే చివరి వరకు పోరాటం చేస్తారా అని ప్రశ్నించగా.. ముక్తకంఠంతో 'చేస్తాం' అని అన్నారు. కేసులు, జైళ్లు అని అధికారులు భయపెడితే వెళ్లిపోతారా? అని ప్రశ్నించగా 'వెళ్లబోం' అని అన్నారు. పైగా ఇండ్ల స్థలాలు ఇచ్చే వరకు ఈ గుడిసెల్లోనే నివసిస్తామని చెప్పారు. ధర్నాలో సీపీఐ(ఎం) కామారెడ్డి జిల్లా కార్యదర్శి వెంకట్‌గౌడ్, జిల్లా నాయకులు చంద్రశేఖర్, కొత్త నర్సింలు, మోతిరాం, బాల్‌రాజ్‌గౌడ్, అర్జున్, తదితరులు పాల్గొన్నారు.