Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- త్వరలో విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు అందిస్తాం
- విద్యపై దృష్టి సారించండి మంత్రి కేటీఆర్
- ముందస్తుగా ప్రతిపక్ష నాయకుల అరెస్టులు
నవతెలంగాణ-బాసర
అర్జీయూకేటీ విద్యార్థులు సంయమనంతో తమ సమస్యల కోసం గాంధేయవాదంతో చేసిన పోరాటం తనను ఆకర్షింపజేసిందని ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు అన్నారు. సోమవారం బాసర ఆర్జీయూకేటీ యూనివర్సిటీలో మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, శ్రీనివాస్ గౌడ్, అల్లోల ఇంద్రకరణ్ రెడ్డితో పాటు స్థానిక ఎమ్మెల్యే విఠల్ రెడ్డితో కలిసి పర్యటించారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో బాసరకు బయలుదేరిన మంత్రులు యూనివర్సిటీలో ఏర్పాటుచేసిన హెలీపాడ్‌లో దిగారు. వారికి యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ వెంకటరమణ, జిల్లా కలెక్టర్ ముషారఫ్ అలీ పారూఖీ, ఎస్పీ ప్రవీణ్ కుమార్, ఘన స్వాగతం పలికారు. ముందుగా యూనివర్సిటీలోని మెస్‌లో మంత్రి కేటీఆర్ విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. విద్యార్థులను మెస్‌లోని సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం స్టూడెంట్ యాక్టీవిటీ భవనంలో విద్యార్థులతో సమావేశమయ్యారు. కాగా, పూర్తిస్థాయి వీసీ, అధ్యాపకులను నియమించాలని, యూనివర్సిటీలోని సమస్యలను పరిష్కరించాలని జూన్‌లో విద్యార్థులు ఆందోళన నిర్వహించిన సంగతి తెలిసిందే.
మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థులు తల్లిదండ్రుల కలలను సాకారం చేయాలని, మంచి భవిష్యత్తు కోసం ఉన్నత చదువులు చదివి తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. యూనివర్సిటీలోని సమస్యలను ప్రభుత్వం దశలవారీగా పరిష్కరిస్తుందని హామీ ఇచ్చారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ.. విద్యార్థులు తమ సమస్యల కోసం గాంధేయ మార్గంలో చేసిన నిరసన తనకు నచ్చిందన్నారు.
రాజకీయ పార్టీల మద్దతు లేకుండా తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకుంటామని విద్యార్థులు చెప్పడంపై మంత్రి సంతోషం వ్యక్తం చేశారు. విద్యార్థులు విద్యపై దృష్టి సారించాలన్నారు. ఏడాదిపాటు కరోనాతో విద్యా సంస్థలు మూతపడ్డాయని, దాంతో విద్యా వ్యవస్థ గడి తప్పిందని తెలిపారు. యూనివర్సిటీని క్రమశిక్షణలో ఉంచేందుకుగాను ప్రత్యేకంగా ఉన్నత విద్యాశాఖకు చెందిన వెంకటరమణను ఇన్చార్జి వైస్ ఛాన్స్‌లర్‌గా నియమించామన్నారు. హాస్టల్ కష్టాలు ఎలా ఉంటాయో తనకు తెలుసుని, అందుకే విద్యార్థుల సమస్యలను విడతల వారీగా అన్నింటినీ పరిష్కరించేందుకు కృషి చేస్తామని, దానికి కొంత సమయం పడుతుందని తెలిపారు. త్వరలోనే విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు అందిస్తామని హామీ ఇచ్చారు. వెయ్యి కంప్యూటర్లతో ప్రత్యేక ల్యాబ్‌ను ఏర్పాటు చేస్తామని, ప్రత్యేకంగా 50 తరగతి గదులను నిర్మిస్తామని తెలిపారు. ఆడిటోరియం అభివృద్ది పరుస్తామన్నారు. మూడు కోట్లతో స్పోర్ట్స్ స్టేడియం నిర్మిస్తామని హామీ ఇచ్చారు. నవంబర్‌లోపు మరోసారి యూనివర్సిటీని సందర్శిస్తానని మంత్రి కేటీఆర్ విద్యార్థులకు హామీ ఇచ్చారు. కాగా, విద్యార్థులతో మంత్రులు సమావేశమైన ఆడిటోరియంలో కుర్చీలు లేక విద్యార్థులు కింద కూర్చోవడంపై మంత్రి స్పందించారు. విద్యార్థులు కింద కూర్చోవడం తనకు నచ్చలేదని, త్వరలో కుర్చీలు ఏర్పాటుచేస్తామని, దానికయ్యే డబ్బును వెంటనే మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.
ముందస్తుగా ప్రతిపక్ష నాయకుల అరెస్టులు
మంత్రి కేటీఆర్ అర్జీయూకేటీ యూనివర్సిటీ పర్యటనను దృష్టిలో ఉంచుకొని ముందస్తుగా కాంగ్రెస్, బీజేపీ నాయకులు, వీఆర్ఏలను అదుపులోకి తీసుకున్నారు. యూనివర్సిటీలో మంత్రి కేటీఆర్ విద్యార్థులతో సమావేశం జరుగుతుండగా యూనివర్సిటీ ప్రధాన గేటు వద్ద బీజేపీ నాయకులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ యూనివర్సిటీలోకి చొచ్చుకు వచ్చేందుకు ప్రయత్నించగా స్థానిక టీఆర్ఎస్ నాయకులు బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దాంతో అప్రపత్తమైన పోలీసులు బీజేపీ నాయకులను అదుపులోకి తీసుకొని స్థానిక పోలీస్ స్టేషన్‌కు తరలించారు. స్థానిక ప్రజాప్రతినిధులను యూనివర్సిటీలోకి పోలీసులు అనుమతించలేదు. మంత్రి కేటీఆర్ పర్యటనను దృష్టిలో ఉంచుకొని జిల్లా ఎస్పీ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు.