Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 18వ రోజుకు సింగరేణి కాంట్రాక్టు కార్మికుల సమ్మె
- బతుకమ్మ ఆటలు ఆడుతూ, పాటలు పాడుతూ నిరసన
నవతెలంగాణ-విలేకరులు
సమస్యలు పరిష్కరించాలని జేఏసీ ఆధ్వర్యంలో సింగరేణి కాంట్రాక్టు కార్మికులు చేస్తున్న సమ్మె సోమవారం 18వ రోజుకు చేరుకుంది. ఈసందర్భంగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ ముట్టడి నిర్వహించారు. అ సందర్భంగా గోదావరిఖనిలోని రామగుండం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయాన్ని ముట్టడించి గేటు ఎందుట బైటాయించి నిరసన తెలిపారు. భారీ ఎత్తున బతుకమ్మ ఆటలు ఆడుతూ, పాటలు పాడుతూ మధ్యాహ్నం వరకు నిరసన కొనసాగించారు. మధ్యాహ్నం వరకు సామరస్యంగా సాగిన నిరసన.. ఆ తరువాత కొంత ఆందోళనకు దారి తీసింది. స్టేడియం దగ్గరున్న దుర్గాదేవి ఆలయంలో పూజలు చేస్తున్న ఎమ్మెల్యే వద్దకు కార్మికులంతా భారీ ర్యాలీగా వెళ్లేందుకు ప్రయత్నించారు. దాంతో పోలీసులు రెండు, మూడు చోట్ల అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కార్మికులు ముందుకు సాగడంతో చివరికి కూరగాయల మార్కెట్ వద్ద పోలీసులు మోహరించి అడ్డుకున్నారు.
కొత్తగూడెంలోని సింగరేణి హెడ్డాఫీస్ ఎదుట కాంట్రాక్ట్ కార్మికులు వంటావార్పు చేసి నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ.. సింగరేణి యాజమాన్యం ఇప్పటికైనా కళ్లు తెరిచి కార్మికులకు వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్లో జరిగే చర్చల్లో కార్మికులకు వేతనాలు పెంచాలని కోరారు. దసరా పండుగ సమీపిస్తున్న తరుణంలో కార్మికులను ఆర్థిక ఇబ్బందులు పెట్టకుండా వెంటనే వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. టేకులపల్లిలో ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియ ఇంటిని ముట్టడించేందుకు వెళుతుండగా పోలీసులు అడ్డుకున్నారు.
నల్ల బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేసిన పర్మినెంట్ ఉద్యోగస్తులు
సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల సమ్మెకు మద్దతుగా పర్మినెంట్ ఉద్యోగస్తులం సమ్మె చేస్తామనిసింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ (సీఐటీయూ) రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి యాజమాన్యానికి హెచ్చరించారు. కాంట్రాక్ట్ కార్మికుల సమ్మెకు మద్దతుగా రామగుండంలోని ఆర్జీ-లో పర్మినెంట్ ఉద్యోగులతో కలిసి నల్లబ్యాడ్జీలతో సోమవారం నిరసన వ్యక్తం చేశారు.