Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చిన్నారుల మృతదేహాలతో షాద్నగర్ ముఖ్య కూడలిలో ధర్నా
- ఆందోళనకారులను చెదరగొట్టిన పోలీసులు
నవతెలంగాణ-షాద్ నగర్
నీటి గుంటలో పడి ముగ్గురు చిన్నారులు మృతి చెందిన ఘటన రంగారెడ్డి జిల్లా షాద్నగర్ మున్సిపాలిటీ పరిధిలోని సోలిపూర్లో సోమవారం జరిగింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. రోడ్లపై గుంతలు పూడ్చేందుకు గ్రామంలోని ఓ ప్రాంతంలో మట్టిని తవ్వారు. దాన్ని అలాగే వదిలేయడంతో ఇటీవల కురిసిన వర్షాలకు ఆ గుంతలో నీరు ఆగింది. కాగా, గ్రామానికి చెందిన అక్షిత్ గౌడ్(10), ఫరీద్(9), ఫారిన్(9)తో పాటు మరొక బాబు ఆడుకుంటూ నీటిగుంట వరకు వెళ్లారు. దాంట్లో చేపలు ఉన్నాయని, వాటిని పట్టుకోవాలని ముగ్గురు చిన్నారులు నీటి గుంతలోకి దిగారు. కొద్దిసేపటికే వారు కనిపించకపోయే సరికి వెంట వచ్చిన మరో 11 ఏండ్ల బాబు వెంటనే చుట్టూ పక్కల వారికి సమాచారం ఇచ్చాడు. గ్రామస్తుల సహాయంతో ముగ్గురిని బయటకు తీశారు. అయితే అప్పటికే ముగ్గురూ మృతిచెందారు. కుమారుల మృతితో తల్లిదండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరయ్యారు. గ్రామస్తులు ఆగ్రహంతో చిన్నారుల మృత దేహాలతో షాద్నగర్ టౌన్లో ధర్నా చేశారు. విషయం తెలుసుకున్న ఆర్డీఓ రాజేశ్వరి, తహసీల్దార్ గోపాల్, మున్సిపల్ చైర్మెన్ నరేందర్.. ధర్నా జరుగుతున్న ప్రాంతానికి వచ్చి ప్రభుత్వం తరుపున బాధిత కుటుంబాలను ఆదుకుంటామని చెప్పినప్పటికి వారు శాంతించలేదు. అధికారులు, అందోళనకారుల మధ్య వాగ్వివాదం జరగడంతో ఆందోళన చేపట్టిన వారిని ఏసీపీ కుశల్కర్ ఆధ్వర్యంలో పోలీసులు చెదరగొట్టారు.