Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పరిస్థితి విషమం, హైదరాబాద్‌కు తరలింపు
- ఆర్ఎఫ్సీఎల్లో ఉద్యోగం కోసం.. భార్య మెడలో పుస్తెలూ అమ్మేశా నంటూ సూసైడ్ నోట్
- నెలకు రూ.40వేల జీతం అని రూ.8.20లక్షలు వసూలు చేశారు
- ఇప్పుడు ఇష్టమొచ్చిన చోట చెప్పుకోమని బెదిరిస్తున్నరు..
నవతెలంగాణ - గోదావరిఖని క్రైం
రామగుండం ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ (ఆర్ఎఫ్సీఎల్)లో ఉద్యోగం కోసం దళారులకు డబ్బులు ఇచ్చి మోసపోయిన మరో బాధితుడు ఆత్మహత్యకు యత్నించాడు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం పత్తికుంటపల్లికి చెందిన అపరాధి శ్రీనివాస్ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. తన ఆత్మహత్య యత్నానికి గల కారణాలను శ్రీనివాస్ సూసైడ్ నోట్ ద్వారా పేర్కొన్నాడు. తాను ఆర్ఎఫ్సీఎల్ ఉద్యోగాల పేరిట మోసపోయిన బాధితుల్లో ఒకడినని పేర్కొంటూ.. పర్మినెంట్ ఉద్యోగమని, నెలకు రూ.40వేల వేతనం వస్తుందని, అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తారని తన వద్ద నుంచి రూ.8.2లక్షలు డబ్బును వసూలు చేశారని తెలిపాడు. ఆరుగురు దళారుల పేర్లను ఈ సూసైడ్ నోట్లో బాధితుడు వెల్లడించాడు. ఉద్యోగం పెట్టిస్తానని తూం నర్సయ్య, తూం తిరుపతి తన వద్ద నుంచి రూ.5.70లక్షలు వసూలు చేశారని, సొసైటీ పెద్దలు సిహెచ్.ఉపేందర్, పసునూటి రామస్వామి, కాశవేణి రాజయ్య రూ.2.30లక్షలు తీసుకున్నట్టు పేర్కొన్నాడు. అంతేగాకుండా తోట సంతోష్ అనే మధ్యవర్తికి ఈ ఉద్యోగం విషయంలో రూ.20వేలు ఇచ్చానట్టు వివరించారు. ఇలా తన నుంచి మొత్తం రూ.8.20 లక్షలు వసూలు చేశారని తెలిపారు. తీరా సంవత్సర కాల పరిమితి గల ఓ సాధారణ కాంట్రాక్టు ఉద్యోగమని తెలుసుకొని తాను మోసపోయానని, ఈ క్రమంలో తన డబ్బు తనకు చెల్లించాలని వారిని ప్రాదేయ పడ్డానని, ఈ విషయంలో గోదావరిఖని వన్‌టౌన్ పోలీస్ స్టేషన్లో కూడా తాను ఫిర్యాదు చేశానని బాధితుడు సూసైడ్ నోట్లో పేర్కొన్నాడు. అయినప్పటికీ ఎలాంటి చర్యలూ తీసుకోకపోవడం, అంతేకాకుండా దళారులు తనను బెదిరింపులకు గురి చేయడం, తాను ఏం చేయలేని పరిస్థితి ఏర్పడిందని, ఇటు తెచ్చిన అప్పులే కాకుండా ఇంట్లోని బంగారం, చివరికి తన భార్య మెడలోని పుస్తెలు సైతం అమ్మేశానని, ఇక ఇల్లు గడవని పరిస్థితులతో మనస్తాపానికి గురై ఆత్మహత్యకు యత్నిస్తున్నట్టు పేర్కొన్నారు. శ్రీనివాస్ పరిస్థితి విషమంగా ఉండటంతో గోదావరిఖని నుంచి మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించగా, చికిత్స పొందుతున్నాడు. ఇప్పటికీ పరిస్థితి విషమంగానే ఉన్నట్టు తెలుస్తోంది.