Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, గంగుల కమలాకర్
నవతెలంగాణ-కల్చరల్
భూమికోసం, భుక్తి కోసం, అణగారిన వర్గాల వెట్టి చాకిరి విముక్తి, పేదల హక్కులకోసం నాటి దొరలు, రజాకార్లపై తిరుగుబాటు చేసిన వీరనారి ఐలమ్మను చాకలి ఐలమ్మగా పిలిచి ఒక కులానికి పరిమితం చేయరాదని మంత్రులు గంగుల కమలాకర్, తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. హైదరాబాద్లోని రవీంద్రభారతిలో సోమవారం రాష్ట్ర వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో చిట్యాల ఐలమ్మ 127వ జయంతి సభను అధికారికంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా మంత్రులు గంగుల కమలాకర్, తలసాని శ్రీనివాస్ యాదవ్ హాజరయ్యారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. 2014కు ముందు ఐలమ్మ గురించి ఆయా కులాల వారే మాట్లాడుకునేవారని, కేసీఆర్ సీఎం అయ్యాక తెలంగాణ పోరాట యోధులకు తగిన గుర్తింపు లభిస్తోందని అన్నారు. సీఎం ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని వివరించారు. వీటిని గుర్తించకుండా కొందరు అవాకులు చవాకులు మాట్లాడుతున్నారని, వీరు గతంలో చేసింది ఏమీ లేదని, ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉండి కూడా బీసీలకే చేసిందేమీ లేదన్నారు. బీసీ కులాలకు ప్రత్యేక శాఖ మంత్రి వర్గంలో లేదని విమర్శించారు. దళిత బంధు లాగానే ప్రాధాన్యత క్రమంలో బీసీ బంధు కూడా వస్తుందని అభిప్రాయపడ్డారు.
మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ.. బాంచెన్ దొర కాల్మొక్కుతా నుంచి బందూకు పట్టి సాయుధ పోరాటంలో తన వంతు పాత్ర పోషించిన ఐలమ్మ తెలంగాణ ఆస్తి అన్నారు. అందుకే తెలంగాణ గడ్డపై నేడు గ్రామగ్రామాన ఐలమ్మ విగ్రహాలకు దండలు వేసి గౌరవించుకునే పరిస్థితి కేసీఆర్ కల్పించారన్నారు. బీసీల విద్య కోసం 310 గురుకులాలు ప్రారంభించిన కేసీఆర్ను ప్రజలు ఎన్నటికీ విస్మరించరని అన్నారు. కార్యక్రమంలో బీసీ కమిషన్ చైర్మెన్ డాక్టర్ వకులాభరణం కృష్ణ మోహనరావు, సాహిత్య అకాడమీ చైర్మెన్ జూలూరి గౌరీశంకర్, ఎమ్మెల్యే బసవరాజు సారయ్య, న్యాయశాఖ కార్యదర్శి నరసింగరావు, సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్ర వెంకటేశం, ఐలమ్మ జయంతి వేడుకల కమిటీ చైర్మెన్ అక్కరాజు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.