Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మొదటిరోజు హైదరాబాద్‌లో జర్నలిస్టుల భారీప్రదర్శన
- 10న రాష్ట్రవ్యాప్తంగా కోర్కెల దినం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్‌ల ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర మహాసభలు వచ్చేనెల 29, 30 తేదీల్లో హైదరాబాద్‌లో నిర్వహించాలని ఆ సంఘం రాష్ట్ర విస్తృతస్థాయి సమావేశం నిర్ణయించింది. సోమవారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య అధ్యక్షత సమావేశాన్ని నిర్వహించారు. రాష్ట్ర ఆఫీసు బేరర్లు, కార్యవర్గ సభ్యులతోపాటు అన్ని జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులు, జాతీయ, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి బసవపున్నయ్య కార్యకలాపాలపై నివేదికను సమర్పించారు. వివిధ జిల్లాల ప్రతినిధులు పలు అంశాలపై చర్చించడంతోపాటు రాష్ట్ర మహాసభల నిర్వహణపై పలు సూచనలు చేశారు. వచ్చేనెల 29న రాష్ట్ర మహాసభల మొదటిరోజు జర్నలిస్టులతో భారీ ప్రదర్శన నిర్వహించాలనీ, రెండోరోజు ప్రతినిధుల సభ జరపాలని సమావేశం నిర్ణయించింది. జర్నలిస్టులకు ఇండ్లస్థలాలివ్వాలని కోరుతూ వచ్చేనెల 10న రాష్ట్రవ్యాప్తంగా జర్నలిస్టులు డిమాండ్స్ డేను పాటిస్తూ కలెక్టర్లకు వినతిపత్రాలు సమర్పించాలని సమావేశం తీర్మానం చేసింది. అదేవిధంగా జర్నలిస్టుల రైల్వే రాయితీ పాస్‌లను పునరుద్దరింపజేయాలంటూ హైదరాబాద్‌లోని సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ కార్యాలయం ఎదుట ధర్నా చేయడంతోపాటు రాష్ట్రవ్యాప్తంగా పార్లమెంటు సభ్యులకు ఫెడరేషన్ తరపున విజ్ఞాపన పత్రాలను సమర్పించాలని నిర్ణయించింది. దళిత బంధు మాదిరిగా 'జర్నలిస్టు బంధు' పథకం ప్రవేశపెట్టి అర్హులైన పాత్రికేయులకు రూ.పది లక్షల ఆర్థిక సహాయం అందించాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఈ కార్యక్రమంలో టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పులిపలుపుల ఆనందం, పిల్లి రాంచందర్, ఎల్గొయి ప్రభాకర్, కార్యదర్శులు నర్సింగ్‌రావు, ఎస్కె సలీమా తదితరులు పాల్గొన్నారు.