Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
అంతరాలు లేని బతుకమ్మను జరుపుకుందామనీ, బతుకమ్మంటే ఉత్సవమే కాదు...ఉద్యమమంటూ చాటుదామని తెలంగాణ ప్రజా సాంస్కృతిక కేంద్రం నాయకురాలు గంగాభవాని, స్పందన సంస్థ డైరెక్టర్ జి.సుజాత పిలుపునిచ్చారు. బతుకమ్మ ఉత్సవాల్లో భాగంగా సోమవారం హైదరాబాద్లో జరిగిన వేడుకల్లో వారు మాట్లాడుతూ ప్రజల మధ్య పొడచూపుతున్న కుల భేదాలు అగ్రకుల, నిమ్న కుల భావనలు, అంతరాలు సమాజాన్ని వెనక్కి నెడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాజ్యాంగ స్ఫూర్తితో వీటిపై పోరాడాలని కోరారు. ఊరు-వాడ బేధాలు మరిచి ప్రతి ఊరిలో అంతా ఒక దగ్గరే అంతరాలు లేని బతుకమ్మను జరుపుకుని తెలంగాణ సంస్కృతిని చాటాలని పిలుపునిచ్చారు. సహజ వనరులను రక్షించుకునే ఉద్యమంగానూ, పర్యావరణ పరిరక్షణ, సామాజిక అణచివేతలను ఎదిరించే ప్రయాణంగా చూడాలని సూచించారు. బతుకమ్మ చీరెలను రాజకీయ చీరెలుగా పంచడం సరికాదనీ, నాణ్యత లేని చీరెలను కాకుండా నిజంగా చేనేత చీరెలను పంపిణీ చేయాలన్నారు. చెరువులు,కుంటలు, గుట్టలు, వాగులు, వంకలకు బతుకమ్మగా నామకరణం చేసి కాపాడుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. పంచభూతాలను అమ్ముకునే బహుళ జాతి దోపిడీదార్లను బహిష్కరిద్దాం.. వాటిని నమ్ముకున్న బహుజనులను కాపాడుకుందాం... అంటూ ఆడుతూ పాటలు పాడారు. ఆరుబయట అభ్యుదయ గీతాలతో అలరించారు. ఈ కార్యక్రమంలో తనుజ, అనుషా, లావణ్య, సమత తదితరులు పాల్గొన్నారు.