Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆలస్యమైతే అధికారులదే బాధ్యత
- స్వయంగా తనిఖీలు నిర్వహిస్తా:
- పౌరసరఫరాల శాఖ అధికారులతో మంత్రి గంగుల కమలాకర్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) సేకరణ వేగవంతం చేయాలనీ, ఆలస్యమైతే అధికారులే బాధ్యత వహించాల్సి వస్తుందంటూ రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. శాఖలోని ఉన్నతాధికారులు, జిల్లాల డీఎస్ఓ, డీఎంలతో సోమవారం హైదరాబాద్లోని డాక్టర్ మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో ఆయన సమీక్ష నిర్వహించారు. భారత ఆహార సంస్థ సీఎంఆర్ సేకరణను పునరుద్దరించిన తర్వాత జరుగుతున్న మిల్లింగ్ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కచ్చితమైన నిబంధనలు పాటిస్తూ గడువులోగా మిల్లింగ్ కోసం చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. త్వరలోనే స్వయంగా జిల్లాల్లో పర్యటిస్తానని మంత్రి తెలిపారు. ఇటీవల కురిసిన వర్షాలకు ఎంత ధాన్యం తడిసిపోయిందనే వివరాలతో పాటు, ప్రస్తుత వానాకాలం సేకరించాల్సిన ధాన్యం పరిమాణంపై వారంలోగా సమగ్ర నివేదికలు అందించాలని అధికారులను ఆదేశించారు.
ఇప్పటికే దాదాపు 77 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం నిల్వ ఉన్న నేపథ్యంలో వానాకాలం ధాన్యం కోసం ఇంటర్మీడియట్ స్టోరేజీలను గుర్తించాలని ఆదేశించారు. పీడీఎస్ బియ్యం పక్కదారి పట్టకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలనీ, అవసరమైతే ఇందుకోసం టాస్క్ ఫోర్స్ విభాగాన్ని మరింత పటిష్టం చేయాలని ఆదేశించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పీడీఎస్ బియ్యం రీసేల్, రీసైకింగ్ల్ జరగకుండా చట్టాలను అమలు చేయాలన్నారు. సంక్షేమ గురుకులాలు, హాస్టళ్లకు, విద్యాలయాలకు కూడిన పాత బియ్యాన్నే అందించాలన్నారు. ఈ విషయంలో జిల్లా అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు.