Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఎమ్‌డీకి ఆర్. కృష్ణయ్య వినతి
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
విద్యుత్ సంస్థల ప్రమోషన్లలో బీసీ ఉద్యోగులకు అన్యాయం జరుగుతున్నదని రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య అన్నారు. సోమవారంనాడాయన తెలంగాణ విద్యుత్ బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కే కుమార స్వామి, ముత్యం వెంకన్నగౌడ్ తదితరులతో కలిసి విద్యుత్ సౌధలో టీఎస్ జెన్కో, ట్రాన్స్‌కో సీఎమ్‌డీ దేవులపల్లి ప్రభాకరరావుకు ఈ మేరకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగా ణ విద్యుత్ సంస్థల్లో పోటీ పరీక్షల ద్వారా ప్రారంభ దశలో ఏదైనా ఉద్యోగంలో నేరుగా నియమించబడి, ఉద్యోగుల అంతర్గత సీనియారిటీ తర్వాత ప్రమోషన్ కోసం సంబంధిత పోటీ పరీక్షలో పొందిన మెరిట్ ఆధారంగా నిర్ధారించిన విద్యుత్ బోర్డ్ సర్వీస్ రెగ్యులేషన్లు, ప్రభుత్వ ఉత్తర్వులు, సుప్రీంకోర్టు, హైకోర్టు ఆదేశాల మేరకు అన్ని కేటగిరిల్లో సీనియారిటీలను ప్రకటించి ప్రమోషన్లు కల్పించాలని కోరారు. అలాగే తెలంగాణ విద్యుత్ సంస్థల్లో 2 జూన్ 2014 నుంచి ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం కల్పించిన పదోన్నతులను సమీక్షించి నష్టపోయిన బీసీ ఉద్యోగులు, ఇంజనీర్లకు ప్రమోషన్లు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. వారితో పాటు సీఎమ్డీని విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న పలువురు బీసీ ఉద్యోగులు కూడా కలిశారు. తమ డిమాండ్లపై యాజమాన్యం సానుకూలంగా స్పందించాలనీ, లేనిపక్షంలో రాష్ట్రంలోని అన్ని విద్యుత్ సంస్థల్లోని బీసీ ఉద్యోగులు నిరసన కార్యక్రమాలతో ప్రత్యక్ష ఆందోళనలకు దిగుతారనీ, సమ్మెకూ వెనుకాడబోమని హెచ్చరించారు.