Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- యజమానుల వైపా? కార్మికుల వైపా?
- సింగరేణి కాంట్రాక్టు కార్మికుల సమ్మెకు మద్ధతు
- లేబర్ కోడ్లను టీఆర్ఎస్ వ్యతిరేకించాలి
- కనీస వేతనాల జీవోలను అమలు చేయాలి : రాష్ట్ర స్థాయి ధర్నాలో కార్మిక సంఘాల నాయకులు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
సీఎం కేసీఆర్ ఎవరి పక్షం? పరిశ్రమల యజమానుల ఒత్తిడులకు తలొగ్గుతారా? లేదా కార్మికులకు కనీస వేతనాలిచ్చి వారికి అండగా నిలుస్తారా? అనే విషయాన్ని తేల్చుకోవాలని పలు కార్మిక సంఘాల రాష్ట్ర నాయకులు సవాల్ విసిరారు.యజమానుల వైపే ఉండేందుకు కేసీఆర్ నిర్ణయించుకుంటే భవిష్యత్తులో పోరాటాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. సింగరేణి కాంట్రాక్టు కార్మికులు చేస్తున్న సమ్మెకు వారు మద్ధతు ప్రకటించారు. రాష్ట్రంలోని షెడ్యూల్ పరిశ్రమల్లో 68 కనీస వేతనాల జీవోలను సవరించాలని, ఇప్పటికే ప్రభుత్వం తుది నోటిఫికేషన్ ఇచ్చిన ఐదు రంగాల జీవోలను గెజిట్ చేయాలనీ, సింగరేణి కాంట్రాక్టు కార్మికులు చేస్తున్న సమ్మెను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఇవే డిమాండ్లపై కేంద్ర, రాష్ట్ర కార్మిక సంఘాల జిల్లా నాయకుల అధ్యక్షతన సోమవారం హైదరాబాద్లోని ఇందిరాపార్కు వద్ద ధర్నా నిర్వహించారు.
లేబర్ కోడ్లను వ్యతిరేకించాలి
కార్మిక చట్టాల స్థానంలో కేంద్రంలోని బీజేపీ సర్కారు తెస్తున్న లేబర్ కోడ్లను వ్యతిరేకించాలని సీఐటీయూ కార్యదర్శి భూపాల్ టీఆర్ఎస్ను డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కార్మికులకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకుంటే రానున్న కాలంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఐదేండ్లకోసారి సవరించాల్సిన కనీస వేతనాల జీవోలను పదేండ్లయినా సవరించడం లేదని విమర్శించారు. టీఎస్ఐపాస్తో ఇస్తున్న సౌకర్యాలు, రాయితీలతో పారిశ్రామికవేత్తలు లాభపడుతున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో కార్మికులను ఆదుకోవాలని టీఆర్ఎస్ అనుబంధ కార్మిక విభాగంతో సహా అన్ని కార్మిక సంఘాలు ఏండ్ల తరబడి పోరాటం చేస్తున్నాయని గుర్తుచేశారు. అయినా యజమానుల ఒత్తిడికి లొంగి గెజిట్ చేయకపోవడం, జీవోలను సవరించకుండా నాన్చడం సరికాదని సర్కారుకు హితవు పలికారు. సింగరేణి కాంట్రాక్టు కార్మికుల వేతనాలు పెరగకపోవడానికి కూడా జీవో లేకపోవడమే కారణమని ఆ సంస్థ అధికారులు చెబుతున్నారని తెలిపారు. ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు బాలరాజు మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం చెవులు, కండ్లు లేనిదని విమర్శించారు. సింగరేణి కాంట్రాక్టు కార్మికులకు ఆ సంస్థ ఆస్పత్రిలో ఉచిత వైద్యసౌకర్యం కల్పించాలనీ, లేదంటే కనీసం ఈఎస్ఐ తదితర సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్టు కార్మికులు మరణించినప్పుడు వారికిచ్చే ఇచ్చే పరిహారం కాంట్రాక్టు కార్మికులకు పర్మినెంట్ ఉద్యోగులతో సమానంగా ఉండాలని తెలిపారు. ఐఎఫ్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.సూర్యం మాట్లాడుతూ శాస్త్రీయంగా నిర్ణయించిన వేతనాలను కూడా అమలు చేయకపోవడమే బంగారు తెలంగాణనా? అని ప్రశ్నించారు. ఏ పారిశ్రామికవేత్తలు చెబితే కార్మిక సంఘాల నాయకులు, కార్మికశాఖ అధికారులు, యజమానులు కలిసి ఉమ్మడిగా తీసుకున్న నిర్ణయాలను అమలు కాకుండా నిలిపేశారో చెప్పాలన్నారు. ఐఎఫ్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్.జనార్థన్ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దొందు దొందేననీ, దొంగే దొంగ....దొంగ అని అరిచినట్టుగా పరిస్థితి ఉందని చెప్పారు. బలమైన పోరాటంతోనే కనీస వేతనాలను సాధించుకోగలుగుతామన్నారు. టీఎన్టీయూసీ రాష్ట్ర అధ్యక్షులు ఎం.కె.బోస్ మాట్లాడుతూ ఎనిమిదేండ్లుగా ఒక్క జీవో కూడా విడుదల చేయని మొదటి ముఖ్యమంత్రి కేసీఆర్ అని విమర్శించారు. ఐఎఫ్ టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం శ్రీనివాస్ రాజ్యాంగంలోని ఆర్టికల్ 39 ప్రకారం సమాన పనికి సమాన వేతనమివ్వాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగంపై గౌరవముంటే దాని ఆధారంగా పాలన చేయాలని కోరారు. ఈ నిరసన కార్యక్రమంలో అధ్యక్ష వర్గంగా చంద్రశేఖర్ (సీఐటీయూ), హసీనా (ఏఐటీయూసీ), ప్రవీణ్, అరుణ (ఐఎఫ్ టీయూ) రత్నాకర్ రావు (టీఎన్టీయూసీ) వ్యవహరించారు.