Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రౌండ్ టేబుల్ సమావేశంలో .. జీఎంపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉడుత రవీందర్
నవతెలంగాణ-ఎన్జీవోస్ కాలనీ
రాష్ట్ర ప్రభుత్వం గొల్ల కురుమల సంక్షేమం పేరుతో చేపట్టిన గొర్ల పంపిణీలో అవినీతికి అడ్డుకట్ట వేసేలా లబ్దిదారుల బ్యాంకు ఖాతాలకు నేరుగా నగదు బదిలీ చేయాలని గొర్రెల మేకల పెంపకందారుల సంఘం (జీఎంపీఎస్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉడుత రవీందర్ డిమాండ్ చేశారు. జీఎంపీఎస్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో హనుమకొండ రాంనగర్లోని ఐడీఈ అకాడమీలో శాతబోయిన రమేష్ అధ్యక్షతన సోమవారం నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం మొదటి విడతలో రాష్ట్రవ్యాప్తంగా 7.31 లక్షల మందిని లబ్దిదారులుగా ఎంపిక చేసినా కేవలం 3.91 లక్షల మందికి మాత్రమే గొర్రెలను పంపిణీ చేసిందన్నారు. మిగతా 3.39 లక్షల మందికి ఐదేండ్లు గడచినా పంపిణీ చేయలేదని విమర్శించారు. గొర్రెల పంపిణీలో భారీ అవినీతి, అక్రమాలు జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు.. సీపీఐ(ఎం) జిల్లా నాయకులు సారంపల్లి వాసుదేవరెడ్డి మాట్లాడుతూ.. ఓట్లు దండుకునేందుకే రాష్ట్ర ప్రభుత్వం గొర్ల పంపిణీ పథకాన్ని చేపట్టిందన్నారు. గొల్ల కుర్మలకు ఇచ్చిన మాటను రాష్ట్ర ప్రభుత్వం విస్మరించిందని ఆరోపించారు. సంఘం జిల్లా కార్యదర్శి కాడబోయిన లింగయ్య మాట్లాడుతూ.. జిల్లాలో 21,236 మందిని ఎంపిక చేసి కేవలం 13,740 మందికి పంపిణీ చేసి మిగతా 7,348 మందికి పంపిణీ చేయలేదని తెలిపారు. గొర్ల పంపిణీ పథకం దళారులకు, పశుసంవర్ధక శాఖ అధికారులకు, ప్రభుత్వంలోని పెద్దలకు మాత్రమే లబ్ది చేకూరుతోందని తెలిపారు. టీఆర్ఎస్ పార్టీ నాయకుడు, గొర్ల మేకల పెంపకందారుల సహకార సంఘం మాజీ జిల్లా అధ్యక్షులు బొజ్జ రవీందర్ మాట్లాడుతూ.. గొర్రెల పంపిణీలో అవినీతిని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ అనుబంధ మహిళా సంఘం జిల్లా అధ్యక్షులు బంక సరళ, అఖిల భారత యాదవ సంఘం, కురుమ సంఘం ఉమ్మడి జిల్లా ఉపాధ్యక్షులు మండల పరశురాములు, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్, ప్రధాన కార్యదర్శి కాశబోయిన దూడయ్య, బంక సంపత్, నక్క భాస్కర్ మాట్లాడుతూ.. అనేక ఏండ్లుగా జీఎంపీఎస్ పోరాడుతోందని చెప్పారు. పౌర స్పందన వేదిక జిల్లా అధ్యక్షుడు కరాటి శంకర్రావు మాట్లాడుతూ.. గొర్ల కాపరుల సమస్యల పట్ల ప్రభుత్వం మోసపూరితంగా వ్యవహరిస్తోందన్నారు. యాదవ సంఘం రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు వేల్పుల సారంగపాణి, జిల్లా ఉపాధ్యక్షులు నక్క కొమురెల్లి, జిల్లా కృష్ణమూర్తి, కోరె ఐలయ్య, కుమారస్వామి, పవన్ కళ్యాణ్ మాట్లాడారు. ముల్కలగూడెం సర్పంచ్, సంఘం జిల్లా సహాయ కార్యదర్శి బండి పర్వతాలు ప్రవేశ పెట్టిన తీర్మాణాన్ని ఏకగ్రీవంగా ఆమోదించారు. కార్యక్రమంలో జీఎంపీఎస్ జిల్లా నాయకులు వేల్పుల రమేష్, గంట సమ్మయ్య, మేకల సాంబరాజు, బండారి నారాయణ, సంపత్, బుద్ధం సాంబయ్య తదితరులు పాల్గొన్నారు.