Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రత్యేక నిధికి రూ.75,450కోట్లు కేటాయింపు
- ఆదర్శంగా ఎస్టీ గ్రామపంచాయతీలు
- ప్రత్యేక గురుకులాల ఏర్పాటు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
గిరిజనుల సమగ్రభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నది. వారి అభివృద్ధి కోసం ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసి రూ.75,450కోట్లు కేటాయించింది. అందులో ఇప్పటి వరకు రూ. 47,258 కోట్లు ఖర్చు చేసింది.
గిరిజన గూడాలను,తండాలను గ్రామపంచాయతీ లుగా గుర్తించాలని దశాబ్దాలుగా చేస్తున్న పోరాటంతో 3,146 తండాలు, గూడేలకు ప్రభుత్వం గ్రామపంచాయతీ హోదాను కల్పించింది. ఎస్టీ పంచాయతీల్లో 3,146 సర్పంచులు, 24,682 మంది వార్డు సభ్యులు పరిపాలనలో పాలుపంచుకుంటున్నారు. ఆయా పంచాయతీల్లో రూ.1,837.08 కోట్లతో ప్రభుత్వం పలు అభివృద్ధి పనులు చేపట్టింది. పంచాయతీ భవనాల నిర్మాణం కోసం రూ. 300 కోట్లను ఎస్టీ ఎస్డీఎఫ్ కింద ప్రత్యేకంగా కేటాయించినట్టు రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది.
పల్లె ప్రగతి ద్వారా పంచాయతీలు అభివృద్ధి
పల్లె ప్రగతిలో భాగంగా ఆయా గ్రామపంచాయతీలకు ట్రాక్టర్, ట్రాలీ, ట్యాంకర్లను సర్కారు సమకూర్చింది. పల్లె ప్రకృతి వనాలు, డంపింగ్ యార్డులు, వైకుంఠధామాలు తదితర వసతులు కల్పించింది. రూ.1,682 ఆవాసాలలో రూ.1,276 కోట్లతో బీటీ రోడ్లను అభివృద్ధి చేసింది. ఈ ఏడాది 2090 గిరిజన పల్లెల్లో రోడ్ల అభివృద్ధి కోసం రూ.1000కోట్లను ప్రభుత్వం కేటాయించింది. ఆదివాసీ తెగలు నివసిస్తున్న గ్రామాల్లో అంతర్గత సీసీ రోడ్లు మురుగునీటి పారుదల వ్యవస్థల నిర్మాణానికి ప్రత్యేక నిధుల కింద రూ.133 కోట్లు కేటాయించింది.వారి గృహ అవసరాలకు 101 యూనిట్ల విద్యుత్‌ను ఉచితంగా అందిస్తున్నది. ఆదివాసీల వ్యవసాయానికి త్రీఫేజ్ లైన్లను అభివృద్ధి చేసి మెరుగైన విద్యుత్‌ను అందిస్తున్నది.
ప్రత్యేక గురుకులాలు..
విద్యారంగంలో ముందుండాలనే సదుద్దేశంతో గురుకుల విద్యాలయాలను నెలకొల్పింది. రెసిడెన్షియల్ డిగ్రీ , ఫైన్ ఆర్ట్స్ , లా, సైనిక్, కాలేజీ ఆఫ్ ఎక్స్‌లెన్స్ కాలేజీలను ఏర్పాటు చేసింది. గురుకులాల్లో శిక్షణ పొందిన 918 మంది ఎస్టీ విద్యార్థినీ విద్యార్థులు ఐఐటీ,ఎన్ఐటీ,ఐఐఐటీ తదితర వృత్తిపరమైన కోర్సుల్లో ప్రవేశాలు సాధించారు. ఎక్కడా లేని విధంగా విదేశాల్లో ఉన్నత చదువుల కోసం అంబేద్కర్ ఓవర్సిస్ విద్యానిధి కింద ప్రతి విద్యార్థికి రూ.20లక్షల చొప్పున రూ.33.49 కోట్లతో 237 మంది విద్యార్థులు లబ్దిపొందారు.