Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాత్రి పది తర్వాత సౌండ్ రాకుండా చూడాలి
- పోలీసులకు హైకోర్టు ఆదేశం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
హైదరాబాద్‌లోని పబ్‌ల్లో రాత్రి 10 గంటల తర్వాత ఎలాంటి మ్యూజిక్ సౌండ్ పెట్టరాదని హైకోర్టు మరోసారి స్పష్టం చేసింది. రాత్రి 10 గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకు సౌండ్ వెలువడకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఇదివరకు హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయాలని చెప్పింది. సౌండ్ రెగ్యులేషన్ అండ్ కంట్రోల్ నిబంధనలను పబ్‌లు ఇష్టానుసారంగా ఉల్లంఘిస్తున్నాయంటూ జూబ్లీహిల్స్ రెసిడెంట్స్ క్లీన్ అండ్ గ్రీన్ అసోసియేషన్ ఇతరులు రిట్లు దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ కె లలిత సోమవారం విచారణ చేపట్టారు. రాత్రి 10 గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకు ఎలాంటి సౌండ్ వెలువడకుండా చర్యలు తీసుకోవాలనీ, సిటీ పోలీస్ యాక్ట్, సౌండ్ పొల్యూషన్ రెగ్యులేషన్స్ యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. లౌడ్ స్పీకర్ల గడువుకు మించి వాడకూడదనీ, అయితే వాటిని ఇండ్లు, విద్యాసంస్థలున్న ప్రదేశాల్లో పబ్‌లకు ఎలా అనుమతి ఇచ్చారంటూ గతంలోనే హైకోర్టు ప్రశ్నించింది. ఈ పరిస్థితుల్లో సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ల పరిధిలో నిబంధనలకు వ్యతిరేకంగా ఉన్న పబ్‌లపై చర్యలు తీసుకున్నట్టు ఆ రెండు పోలీస్ కమిషనర్లు అఫిడవిట్లను హైకోర్టుకు సమర్పించారు. సైబరాబాద్‌లో 34, రాచకొండలో రెండు చొప్పున పబ్‌లుంటే వాటిలో లౌడ్ స్పీకర్లను వాడేందుకు అనుమతి ఇవ్వలేదని వివరించారు. అవి పెట్టుకోవాలంటే అనుమతి పొందాలన్నారు. రాత్రి పది గంటల తర్వాత సౌండ్ వెలువడితే కాలుష్య, పర్యావణ చట్టాలకు వ్యతిరేకమన్నారు. పబ్‌లు, బార్లను నివాస గృహాలకు 500 మీటర్లలోపు అనుమతి ఇవ్వరాదన్న నిబంధనకు వ్యతిరేకంగా ఎక్సైజ్ శాఖ అనుమతి ఇచ్చిందని జీహెచ్ఎంసీ తెలిపింది. విచారణ వచ్చే నెలకు వాయిదా పడింది.
ప్రభుత్వ పిటిషన్ కొట్టివేత
రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం రాయదుర్గ్‌లోని సర్వే 46లోని 84 ఎకరాల 30 గుంటల భూమి తమదేనంటూ ప్రభుత్వం వేసిన రీకాల్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది. లింగయ్య ఇతరులకు చెందిన భూమి అని హైకోర్టు ఇచ్చిన తీర్పును రీకాల్ చేయాలంటూ రెవెన్యూ శాఖ పిటిషన్ వేసింది. గత తీర్పులో జోక్యం చేసుకునేందుకు ఏమీ లేదని న్యాయమూర్తులు జస్టిస్ గండికోట శ్రీదేవి, జస్టిస్ ఎంజి ప్రియదర్శినితో కూడిన ధర్మాసనం సోమవారం తీర్పు చెప్పింది.