Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కాంట్రాక్టు కార్మికులకు కనీస వేతనం రూ.24 వేలు చెల్లించాలి
- తెలంగాణ మున్సిపల్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్
నవతెలంగాణ-సిటీబ్యూరో
రాంకీ ఒప్పందాన్ని వెంటనే రద్దు చేయాలని, జీహెచ్ఎంసీ కాంట్రాక్టు కార్మికులకు కనీస వేతనం రూ.24 వేలు చెల్లించాలని తెలంగాణ మున్సిపల్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ డిమాండ్ చేశారు. జీహెచ్ఎంసీ ఎంప్లాయీస్ యూనియన్ (సీఐటీయూ), గ్రేటర్ హైదరాబాద్ సౌత్, సెంట్రల్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సోమవారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం ఎదుట మహా ధర్నా నిర్వహించారు. పెద్దఎత్తున కార్మికులు, నాయకులు జీహెచ్ఎంసీ ప్రధాన గేట్ ఎదుట బైటాయించారు. రాంకీకి, అధికారులకు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పాల్గొన్న పాలడుగు భాస్కర్ మాట్లాడుతూ.. బల్దియాను దివాలా తీసేందుకు ప్రభుత్వం, అధికారులు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. బల్దియా భూములు, వాహనాలు, సిబ్బందిని హౌల్సేల్గా రాష్ట్ర ప్రభుత్వం రాంకీకి అప్పగిస్తోందని విమర్శించారు.
దీనివల్ల ప్రజలపై పన్నుల భారం మరింత పెరిగిందన్నారు. నగరవాసుల ప్రయోజనాలకు భంగం కలిగించే రాంకీ ఒప్పందాన్ని తక్షణం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం డీజిల్, పెట్రోల్, వంటగ్యాస్, నిత్యావరస సరుకుల ధరలను భారీగా పెంచిందని గుర్తు చేశారు. నాలుగు లేబర్ కోడ్లను పార్లమెంట్లో ప్రవేశపెట్టి కార్మిక హక్కులను కాలరాస్తోందన్నారు. కేంద్రం సంక్షేమానికి కోతలు పెట్టి ప్రజలపై మరింత భారం మోపుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వేతనాలు మూడు సార్లు పెరిగాయి కానీ కార్మికుల జీతాలు మాత్రం పెరగలేదన్నారు. జీవో 60ని అమలు చేయాలని, గ్రీన్ సిటీ హైదరాబాద్‌ను రాంకీకి అప్పగిస్తే చెత్తసిటీ గా మారుతుందని అన్నారు. కాంట్రాక్టు ఎంప్లాయీస్‌ను పర్మనెంట్ చేస్తామని హామీనిచ్చిన ప్రభుత్వం రెండు సార్లు మోసం చేసిందని, మూడో సారీ మోసం చేసేందుకు ప్రయత్నిస్తోందని చెప్పారు. బల్దియా పనులను ప్రయివేటీకరించ డాన్ని అడ్డుకుంటామని హెచ్చరించారు. అనంతరం జీహెచ్ఎంసీ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షులు జె.వెంకటేష్ మాట్లాడుతూ... కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. పెండింగ్ వేతనాలు కూడా చెల్లించాలని, ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యాలు కల్పించడంతో పాటు 10 డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని జీహెచ్ఎంసీ కమిషనర్‌కు అందజేశారు. కార్యక్రమంలో గ్రేటర్ హైదరాబాద్ సౌత్ జిల్లా అధ్యక్షురాలు యాదమ్మ, ప్రధాన కార్యదర్శి ఎం.శ్రావణ్‌కుమార్, కోశాధికారి ఎస్.కిషన్, గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ సిటీ అధ్యక్షులు ఆర్.వాణి, ప్రధాన కార్యదర్శి రేణుక, ఉపాధ్యక్షులు సి.మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.