Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆహ్వాన కమిటీ గౌరవాధ్యక్షులుగా ఎమ్మెల్సీ ఎల్ రమణ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
స్వాతంత్య్ర సమరయోధుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతిని మంగళవారం రాష్ట్ర పండుగగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. ఎమ్మెల్సీ ఎల్ రమణ గౌరవాధ్యక్షులుగా, సిహెచ్ ప్రభాకర్ చైర్మెన్‌గా, ముఖ్య సలహాదారులు, ఉపాధ్యక్షులు, కన్వీనర్లు, కో కన్వీనర్లు, కో ఆర్డినేటర్లతో ఆహ్వాన కమిటీని ప్రభుత్వం నియమించింది. మంగళవారం జయంతి వేడుకలు నిర్వహించాలని అన్ని జిల్లాల కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది. ఉదయం పది గంటల నుంచి హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో బాపూజీ 107వ జయంతి వేడుకలను నిర్వహిస్తున్నట్టు వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శి, బీసీ సంక్షేమ శాఖ కమిషనర్ బి వెంకటేశం సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.
తెలంగాణ గర్వించే గొప్పనేత బాపూజీ : కేసీఆర్
బడుగు, బలహీనవర్గాల కోసం, తెలంగాణ సాధన కోసం, జీవితాంతం పోరాడిన కొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ గర్వించే గొప్ప నేత అని ముఖ్యమంత్రి కె చంద్ర శేఖర్ రావు అన్నారు. మంగళవారం ఆయన జయంతిని పురస్కరించుకుని సీఎం కేసీఆర్ ఘన నివాళులర్పించారు. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఉద్యమకారుడిగా, ప్రజాస్వామిక వాదిగా, పీడిత ప్రజల పక్షపాతిగా, నిబద్ధత కలిగిన గొప్ప రాజకీయ నాయకుడిగా పలుపార్శ్వాలతో కూడిన కొండా లక్ష్మణ్ బాపూజీ జీవితం రేపటి తరానికి ఆదర్శనీయమని కేసీఆర్ కొనియాడారు. తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల నేపథ్యంలో, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట కాలంలో వారు చేసిన కృషి, నిస్వార్థ సేవలను సీఎం స్మరించుకున్నారు. నాటి తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొంటూనే, చాకలి ఐలమ్మతో సహా పలువురు ఉద్యమకారులకు న్యాయవాదిగా సేవలందించారంటూ కేసీఆర్ గుర్తు చేసారు. అణగారిన వర్గాల హక్కుల సాధన కోసం, సహకార రంగాల పటిష్టత కోసం, కొండా లక్ష్మన్ బాపూజీ జీవితకాలం కృషి చేశారని తెలిపారు. బహుజన నేతగా నేతన్నలైన పద్మశాలీలను సంఘటితం చేశారని వివరించారు. రాష్ట్రం కోసం నాడు మంత్రి పదవికి రాజీనామా చేసిన బాపూజీ స్పూర్తి, మలి దశ తెలంగాణ సాధన పోరాటంలో ఇమిడి ఉందని వివరించారు. ఆయన జయంతి, వర్ధంతులను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్నదని పేర్కొన్నారు. రాష్ట్ర ఉద్యానవన విశ్వవిద్యాలయానికి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెట్టి గౌరవించుకున్నామని తెలిపారు. చేనేత రంగంలో ప్రతిభావంతులైన కళాకారులకు ఆయన పేరుతో అవార్డులను అందజేస్తూ, పద్మశాలీల అభ్యున్నతి కోసం రాష్ట్ర ప్రభుత్వం పాటుపడుతున్నదని వివరించారు. సబ్బండ వర్గాల అభివృద్ధి, సంక్షేమం కోసం అనేక పథకాలను అమలు చేస్తూ, ఆయన ఆశయాలకు రాష్ట్ర ప్రభుత్వం కార్యరూపం ఇస్తున్నదని కేసీఆర్ తెలిపారు.