Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రజకవృత్తిదారుల సంఘం ప్రధాన కార్యదర్శి ఆశయ్య
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్ర ప్రభుత్వం జయంతి వేడుకలతోనే ఆగకుండా వీరనారి ఐలమ్మ విగ్రహాన్ని హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్‌పై ఏర్పాటు చేయాలని తెలంగాణ రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పైళ్ల ఆశయ్య డిమాండ్ చేశారు. సోమవారం రవీంద్ర భారతిలో నిర్వహించిన ఐలమ్మ 127వ జయంతి కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఆమె జయంతిని అధికారికంగా హైదరాబాద్‌లో, జిల్లా కేంద్రాల్లో నిర్వహించడం అభినందనీయమని చెప్పారు. ఆమె విగ్రహాన్ని ట్యాంక్‌బండ్‌పై ఏర్పాటు చేసి రాష్ట్ర ప్రజలకు ఐలమ్మ వీరోచిత పోరాటాన్ని వివరించాలని కోరారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని గుర్తించి అమరవీరుల విగ్రహాలనూయ నెలకొల్పాలని డిమాండ్ చేశారు. రజక వృత్తిదారులకు ప్రభుత్వం రుణాలు ఇవ్వడం లేదని బీసీ కార్పొరేషన్ ఫెడరేషన్లకు తగిన నిధులు కేటాయించాలనీ, వృత్తిదారులందరికీ రుణాలివ్వాలని కోరారు. రజకులపైన పెద్ద ఎత్తున సామాజిక దాడులు దౌర్జన్యాలు కొనసాగుతున్నాయనీ, వాటిని అరికట్టడంలో ప్రభుత్వ యంత్రాంగం విఫలమవుతున్నదని విమర్శించారు. ప్రత్యేక రక్షణ చట్టం చేయాలని కోరారు. చేతివృత్తుల ఆధునీకరణ, ఉపాధి కల్పనకు ప్రభుత్వాలు తగిన విధంగా ప్రోత్సాహకాలు కల్పించి వృత్తిదారులను ఆదుకోవాలని సూచించారు.