Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆందోళనలో ప్రత్యామ్నాయ వైద్యులు
- పోరుబాటలో యునానీ, హౌమియో, నేచురోపతి విద్యార్థులు
- బీజేపీ సర్కారు నిర్ణయాన్ని టీఆర్ఎస్ వ్యతిరేకించాలి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
దేశంలో అల్లోపతి వైద్యవిధానంతో పాటు ఆయుర్వేదం, యునానీ, హౌమియోపతి తదితర వాటిని వైద్యవిధానాలుగా కేంద్రం గుర్తించింది. ఆ మేరకు వారికి పాఠ్యపుస్తకాలు, కళాశాలలు, కోర్సులున్నాయి. పోటీ పరీక్షలు, ప్రవేశాలు షరామామూలే. దీంతో మిగిలిన కోర్సుల మాదిరిగానే దీన్ని చదివిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగాలకు అభ్యర్థులు పోటీపడే వారు. జాతీయ ఆరోగ్య మిషన్ కింద ఇంతకుముందు అన్ని రకాల వైద్యవిధానాలకు గుర్తింపు ఉండేది. దీంతో గతంలో ఎలాంటి సమస్య లేకుండా అన్ని పోస్టులకు, అన్ని రకాల వైద్యవిధానాలను అభ్యసించిన వారు సమానంగా పోడీ పడే వీలుండేది. తాజాగా కేంద్రంలోని బీజేపీ సర్కారు తీసుకున్న నిర్ణయం అల్లోపతి, ఆయుర్వేదేతర వైద్యవిధానాలను చదివిన విద్యార్థులను ఆందోళనకు గురి చేసింది. దీంతో రాష్ట్రంలో యునానీ, హౌమియోపతి తదితర వైద్యవిధానాలను అభ్యసిస్తున్న విద్యార్థులు గత కొన్ని రోజులుగా ఆందోళన బాటపట్టారు. ఇప్పటికే హైదరాబాద్ చార్మినార్లో ఉన్న ప్రభుత్వ యునానీ కళాశాల విద్యార్థులు ఆయుష్ కమిషనర్ ప్రశాంతిని ఘెరావ్ చేసి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. రోజువారీ నిరసనలతో ప్రభుత్వం దిగిరాకపోవడంతో తాజాగా నిరవధిక నిరాహారదీక్షకు పూనుకుంటున్నట్టు విద్యార్థి నాయకులు ఇబ్రహీం తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్తాధ్వర్యంలో ఆయా రాష్ట్రాల్లో జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్హెచ్ఎం) అమలవుతున్నది. అయితే దీనికి సంబంధించిన నిర్ణయాలను కేంద్రం ఏకపక్షంగా తీసుకుంటున్నదనే విమర్శలున్నాయి. యునానీ, హౌమియోపతి అభ్యర్థులను తొలగించడం కూడా ఈ క్రమంలోనే చోటు చేసుకున్నదనే వాదన వినపడుతున్నది. అయితే కేంద్రం జారీ చేసిన నోటిఫికేషన్ను రాష్ట్ర ప్రభుత్వం యథాతథంగా అమలు చేసేందుకు ప్రయత్నించడం పట్ల విద్యార్థుల్లో ఆగ్రహం వ్యక్తమవుతున్నది. ఇప్పటికే ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ దీనిపై కేంద్ర ఆరోగ్యశాఖకు లేఖ రాశారు. కేంద్రం తీసుకున్న అనాలోచిత నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరారు. రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు కూడా కేంద్రానికి లేఖ రాశారు. ఇప్పటికే విడుదలైన నోటిఫికేషన్లో జాతీయ ఆరోగ్య మిషన్ కింద మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్ (ఎంఎల్హెచ్పీ), కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ (సీహెచ్ఓ) 956 పోస్టులను భర్తీ చేయనున్నట్టు ఆయన ప్రకటించారు. వీటికి ఎంబీబీఎస్, బీఏఎంఎస్తో పాటు బీ.యస్సీ (నర్సింగ్) చదివిన వారిని ఇందుకు అర్హులుగా నిర్ణయించారు.
న్యాయపోరాటం...
యునానీ తదితర కోర్సులు చదివిన వారికి కొత్తగా అవకాశమివ్వకపోవడమే కాకుండా ఇప్పటికే ఆయా పోస్టుల్లో ఉన్న వారిని తొలగించారు. దీంతో వారు ఆందోళనబాట పట్టారు. న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీనికి తోడు కొత్త వారికి అవకాశమివ్వకపోవడంతో విద్యార్థులు పోరుబాట ను ఎంచుకున్నారు. కాలేజీలు, కోర్సులు పెట్టడమెం దుకు? అంటూ ప్రశ్నిస్తున్నారు. ఆ తర్వాత ఉద్యోగాలకు అర్హత లేదనడం కేవలం అనాలోచిత చర్య అని వారు విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా కేంద్రం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం కేంద్ర నిర్ణయాన్ని వ్యతిరేకించాలని కోరుతున్నారు.