Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ
- సీపీఐ జాతీయ మహాసభల ప్రచార పాటల సీడీ అవిష్కరణ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
చంబల్‌లోయ బందిపోట్ల మాదిరిగా ఈ దేశాన్ని మోడీ సర్కార్ కార్పొరేట్లకు దోచిపెడుతున్నదని సీపీఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ విమర్శించారు.మంగళవారం హైదరాబాద్‌లోని మఖ్దూం భవన్లో సీపీఐ24వ జాతీయ మహాసభల పాటల సీడీని ఆయన ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ సీపీఐ కార్యదర్శి కె రామకృష్ణ, మహాసభల ఆహ్వాన సంఘం కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, సినీ సంగీత దర్శకులు వందేమాతరం శ్రీనివాసరావు, ప్రజానాట్యమండలి సీనియర్ నాయకులు కందిమళ్ల ప్రతాపరెడ్డి,పీఎన్ఎం రాష్ట్ర కార్యదర్శి పల్లె నర్సింహా, ఏపీ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కె శ్రీనివాస్, చంద్రనాయక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ మోడీని చూస్తే రాక్షసుణ్ని చూసినట్టే ఉందని విమర్శించారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పురోగామి సంస్కృతిపై దాడిని తీవ్రతరం చేశారని తెలిపారు. భూస్వామ్య సంస్కృతికి ప్రతినిధిగా ఉంటున్నారని విమర్శించారు. రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక ప్రత్యామ్నాయం గురించి మాట్లాడితే..జైళ్లు నోళ్లు తెరుస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. వరవరరావు ఏం నేరం చేశాడో చెప్పాలని ప్రశ్నించారు. మోడీ పరిపాలనా విధానాలను చూస్తే ..ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలు ప్రత్యక్షంగా ప్రతిబిం బిస్తున్నాయని విమర్శించారు.తమ రాజకీయ ప్రత్యర్థులపై చట్టబద్ధ సంస్థలను వినియోగించి బెదిరింపులకు పాల్పడటం అనైతకం కాక మరేంటని ప్రశ్నించారు.దేశంలో బీజేపీ నేతలు ఎవరూ అవినీతికి పాల్పడటం లేదా?వారిపై ఈడీలు, సీబీఐలు ఎందుకు దాడులు చేయటం లేదు? అని నిలదీశారు. మన్మోహన్ కాలంలో ఈ పరిస్థితి లేదని గుర్తుచేశారు. దేశ భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని ప్రత్యామ్నాయ విధానాలను ప్రజలముందుంచేందుకు తమ పార్టీ జాతీయ మహాసభలో పలు తీర్మానాలు చేయబోతున్నట్టు తెలిపారు.
1975లో సీపీఐ జాతీయ మహాసభలు చాలా అట్టహాసంగా, పెద్దఎత్తున విజయవాడలో జరిగాయని గుర్తుచేశారు. వాటిలో తీసుకున్న నిర్ణయాలన్నీ..ఆచరణలో తప్పని పార్టీ రివ్యూచేసుకున్నదని గుర్తుచేశారు. ఎమర్జెన్సీకి మద్దతివ్వటం లాంటి తీర్మానాలు సరికాదని భావించామని తెలిపారు. ఇప్పుడు జరిగే మహాసభలో ప్రత్యామ్నాయమే ప్రధాన లక్ష్యంగా తీర్మానాలుంటాయని తెలిపారు. రామకృష్ణ మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్నదన్నారు. ఈ నేపథ్యంలో జరిగే జాతీయ మహాసభల్లో కమ్యూనిస్టుల ఐక్యతకు బీజం పడునుందని చెప్పారు.
చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని రంగాలను భ్రష్టుపట్టించిందని విమర్శించారు. కందిమళ్ల ప్రతాపరెడ్డి మాట్లాడుతూ కమ్యూనిస్టులు ఐక్యంగానే ఉన్నారనీ, ఇప్పుడు విలీనం కావాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని చెప్పారు. అందుకు తగిన ప్రాతిపదిక ఈ మహాసభల్లో వేయాలంటూ వేదిక మీదున్న నాయకులను కోరారు. వందేమాతరం శ్రీనివాస్ మాట్లాడుతూ సాంస్కృతిక రంగం కళాకారులు మహాసభల ప్రచారాన్ని వాడవాడలా తీసుకుపోవాలని చెప్పారు. సోషల్ మీడియా ద్వారా విస్తృత ప్రచారం చేయాలని సూచించారు.