Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 1400 ఎకరాల భూములు లాక్కునేందుకు ప్రభుత్వం యత్నం
- రోడ్డున పడనున్న 400 కుటుంబాలు
- నాలుగు తరాలుగా గీ భూములే మాకు బువ్వపెట్టాయి
- భూములు వదులుకోమంటున్నయాచారం మండలంలోని 4 గ్రామాల రైతులు
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి
'మా భూములు వేలం వేయొద్దు. నాలుగు తరాలుగా గీ భూములే మా కడుపు నింపినవి. ఉన్న పలంగా గిప్పుడోచ్చి ఈ భూముల ప్రభుత్వానివి.. దేవాదాయ శాఖవీ అంటే ఊరుకునేది లేదు. 72 ఏండ్లుగా సాగు చేస్తున్నాం. ఇక్కడ ఉన్న చెట్టు పుట్టలపై మాకే సర్వ హక్కులు ఉన్నవి. 'దున్నేవాడిదే భూమి' అనే నినాదంతో ఏర్పడిన టెనెంట్ యాక్ట్ ప్రకారం ఈ భూముల మాకు వచ్చినవి. మా తాతలు, తండ్రులు కాయ కష్టం చేసి రెక్కలు ముక్కలు చేసుకుని బీడు భూములు చదును చేసి సాగులోకి తెచ్చారు. ఈ భూములు నమ్ముకుని 400 కుటుంబాలు బతుకుతున్నాయి. ఈ భూములు లాక్కోంటే మా బతుకులు ఏం కావాలి. ఏ ప్రభుత్వం వచ్చినా, ఏ అధికారి వచ్చినా మా భూముల్లో అడుగుపెట్టనివ్వం. సెంటు జాగా ఇడ్చేది లేదు. ప్రాణాలైనా వదులుకుంటాం కానీ భూములు వదులుబోం' అని రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలోని 4 గ్రామాల రైతులు తేల్చి చెబుతున్నారు. భూములు కోల్పోతున్న రైతుల సమస్యలపై నవతెలంగాణ కథనం.
రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలోని నాలుగు గ్రామాలు నజ్దిక్ సింగారం, తాడిపర్తి, కుర్మిద్ద, నందివనపర్తిలో టెనెన్ట్ యాక్ట్ ప్రకారం 37/ఎ సర్టిఫికెట్లు పొందిన 400 మంది రైతుల నుంచి 1400 ఎకరాల భూములను సర్కారు లాక్కోవడానికి సర్వ ప్రయత్నాలు చేస్తోంది. 1950లో మిగులు భూముల కింద ఈ ప్రాంత భూస్వాములు ప్రభుత్వానికి అప్పగించిన భూముల్లో.. అప్పటికే సాగులో ఉన్న పేద రైతులకు ఈ భూములపై రక్షిత కౌలుదారు చట్టం ప్రకారం 37/ఎ సర్టిఫికెట్లు ఇవ్వడం జరిగింది. 38/ఇ ప్రకారం రైతులకు పట్టాలివ్వాల్సి ఉన్నప్పటికీ.. ఈ భూములకు పట్టాదారులైన భూస్వాముల్లో ఒకరు ఈ భూములు పేదలకు దక్కొద్దన్న దురుద్దేశంతో తెల్లకాగితంపై ఓం కారేశ్వర దేవాలయానికి విరాళంగా ఇచ్చినట్టు తప్పుడు పత్రాలను సృష్టించినట్టు లబ్దిదారులు చెబుతున్నారు. దాంతో సర్వే నెంబర్ 148 నుంచి 199 వరకు గల సర్వే నెంబర్లలో ఉన్న 1200 ఎకరాల భూములకు పట్టాదారుగా ఓం కారేశ్వర దేవాలయ పేరు.. కాస్తుదారులుగా రైతుల పేర్లు రెవెన్యూ రికార్డుల్లో వస్తున్నాయి. దాంతో ఈ భూములు దేవాలయానికి సంబందించినవి అన్న కారణంతో అధికారులు 20 ఏండ్లపాటు రైతుల నుంచి కౌలు వసూలు చేశారు. కానీ ప్రభుత్వం 1950లో రైతులకు 37/ఎ సర్టిఫికెట్లు అందజేసిందిజ దాంతో 1953లో భూస్వాములు దేవాలయానికి అధికారంగా ఇచ్చినట్టు ఎక్కడా కూడా సరైన రికార్డు లేకపోవడంతో రైతులు కౌలు చెల్లించడం నిలిపివేశారు. తమ భూములకు పట్టాలివ్వాలని రైతులు పోరాటం చేస్తున్నారు. కానీ ప్రభుత్వం పట్టించుకోకపోగా ఈ భూములు దేవాదాయ శాఖకు చెందినవిగా చెప్తూ వేలం వేయడానికి సిద్ధమవుతుంది. తాడిపర్తి గ్రామానికి చెందిన మల్లికొడుకు రామయ్యకు మిగులు భూముల పంపిణీలో భాగంగా సర్వే నెంబర్ 165, 166, 167లో 36 ఎకరాలకు రక్షిత కౌలుదారు చట్టం ప్రకారం 37/ఎ సర్టిఫికెట్లు వచ్చాయి. 1953 నుంచి రెవెన్యూ రికార్డులో కాస్తుకాలంలో రామయ్య పేరు నమోదయింది. రామయ్య మరణానంతరం నలుగురు కొడుకులు సత్తయ్య, రాజారత్నం, నర్సింహ, శేఖర్ పేర్లు 2019 వరకు కాస్తుకాలంలో వచ్చాయి. ధరణి పేరుతో వారికి ఉన్న ఫలంగా కాస్తుకాలం ఎత్తివేయడంతో రైతుల పేర్లు లేకుండాపోయాయి. ప్రస్తుతం రామయ్య సంతానం 15 కుటుంబాలయ్యాయి. దాంతో 36 ఎకరాల భూమి పంచుకోగా ఒక్కో కుటుంబానికి 2 నుంచి 3 ఎకరాలు వచ్చింది. ఈ భూములే సాగు చేసుకుంటూ వారు జీవనం సాగిస్తున్నారు.
భూములు ఇచ్చేది లేదు
సాగులో ఉన్న రైతులకు పట్టాలివ్వాల్సిన ప్రభుత్వం ఏకంగా భూములు లాక్కోవడం సరికాదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ భూములకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. న్యాయపరంగా తమకు చెందాల్సిన భూములు తామే దున్నుకుంటామని, మా భూముల్లో అడుగు పెడితే ఊరుకునేది లేదని, ఎంతటికైనా తెగిస్తామని ప్రాణాలు ఇచ్చేందుకు సిద్ధ్దమే కానీ భూములు ఇచ్చేందుకు మాత్రం సిద్ధంగా లేమంటూ రైతులు స్పష్టం చేస్తున్నారు. తమ భూములకు పట్టాలివ్వాలని రైతులు కోరుతున్నారు.
సాగులో ఉన్న రైతులకు పట్టాలు ఇవ్వాలి
రక్షిత కౌలుదారీ చట్టం ప్రకారం రైతులకిచ్చిన 37/ఎ సర్టిఫికెట్ల ప్రకారం సాగులో ఉన్న రైతులకు 38/ఇ ప్రకారం న్యాయపరంగా రైతులకు చెందాల్సిన భూములకు పట్టాలు ఇవ్వాలి. భూస్వాములు దేవాలయానికి విరాళంగా ఇచ్చినట్టు ఎక్కడా సరైన ఆధారాలు లేనప్పటికీ రెవెన్యూ అధికారులు జాప్యం చేయడం సరికాదు. తక్షణమే ప్రభుత్వం నాలుగు గ్రామాల రైతులకు పట్టాలివ్వాలి.
- సారంపల్లి మల్లారెడ్డి, రైతు సంఘం జాతీయ ఉపాధ్యక్షులు