Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రష్యా, చైనా తర్వాత ఫారెస్టు వర్సిటీ ములుగులోనే
- పర్యావరణం, అటవీ సంరక్షణపై సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి
- ఎఫ్సీఆర్ఐ నుంచి ఐఎఫ్ఎస్కు ఎంపికైన విద్యార్థి
- పలు ప్రపంచ యూనివర్సీటీల్లో ఉన్నత చదువులకు విద్యార్థుల ఎంపిక
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
దేశంలోనే తొలి ఫారెస్టు యూనివర్సిటీని ములుగులో నెలకొల్పిన ఘనత రాష్ట్ర ప్రభుత్వానికి దక్కింది. అడవులు, పర్యావరణంపై పూర్తిస్థాయిలో అధ్యయనం చేసేందుకుగానూ రష్యా, చైనా తర్వాత ప్రపంచంలోనే ఫారెస్టు యూనివర్సిటీ మన దగ్గర ఉంది. పర్యావరణం, అటవీ సంరక్షణపై సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించడంతోనే ఎఫ్సీఆర్ఐ పురుడుపోసుకున్నది. డిగ్రీ కాలేజీ నుంచి వర్సిటీ స్థాయికి నేడు ఎదిగింది. ఆ కళాశాల విద్యార్థులు పలు ప్రపంచ స్థాయి వర్సిటీల్లో ఉన్నత చదువులకు ఎంపికవుతున్నారు. ఇప్పటికే ఆ కళాశాల విద్యార్థి ఐఎఫ్ఎస్గా ఎన్నికై చరిత్ర సృష్టించారు. ఈ మేరకు మంగళవారం సమాచార పౌర సంబంధాల శాఖ ఒక ప్రకటన జారీ చేసింది. సాంకేతిక విద్యకు ధీటుగా అటవీ విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ సూచనతో ఫారెస్ట్ కాలేజీ అండ్ రీసెర్స్ ఇనిస్టిట్యూట్‌ను 2016 లో మొదట దూలపల్లి ఫారెస్ట్ అకాడెమీలో ప్రారంభించారు. ఆ తర్వాత హైదరాబాద్ సమీపంలోని ములుగులో అత్యాధునిక సౌకర్యాలు, అన్ని హంగులతో క్యాంపస్‌ను కట్టి అక్కడకు తరలించారు. సీఎం ఓఎస్డీ (హరితహారం) ప్రియాంక వర్గీస్ ఫారెస్ట్ కాలేజీ డీన్‌గా కొనసాగుతున్నారు. మొదటి బ్యాచ్ నుంచి ఇప్పటి వరకు బీఎస్సీ ఫారెస్ట్రీ విద్యను అభ్యసించిన విద్యార్థులు అటు అమెరికా యూనివర్సిటీలతో పాటు, దేశంలోనే పేరెన్నిక గల డెహ్రాడూన్ ఫారెస్ట్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్, బనారస్ హిందూ వర్సిటీ, ఐకార్ లాంటి చోట్ల ఉన్నత చదువులు చదువుతున్నారు. ఇటీవల అటవీ విశ్వవిద్యాలయం ఏర్పాటుకు శాసనసభ, శాసన మండలి ఆమోదం తెలిపాయి. దీంతో ఆ కాలేజీ వర్సిటీగా మారింది. అటవీ కళాశాల, పరిశోధనా సంస్థ ద్వారా అటవీ విద్య, పరిశోధన, విస్తరణ, ఫలితాలను ప్రజలకు మరింత చేరువ చేయడం, అటవీ వనరుల సంరక్షణ- స్థిరమైన నిర్వహణ కోసం నిపుణులను తయారు చేయడం, సహజ అడవులపై ఒత్తిడిని తగ్గించే చర్యలు తీసుకోవడం, తదితర లక్ష్యాలను చేరాలనే దృఢ సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తున్నది. పీహెచ్డీ కోర్సులు, పట్టణ అటవీ వనాలు, నర్సరీ మేనేజ్మెంట్, అగ్రో ఫారెస్ట్రీ, గిరిజన జీవనోపాధి పెంపుదల, ఫారెస్ట్ ఎంట్రప్రెన్యూర్షిప్, క్లైమేట్ స్మార్ట్ ఫారెస్ట్రీ, ఫారెస్ట్ పార్క్స్ మేనేజ్మెంట్లో డిప్లొమా, తదితర సర్టిఫికేట్ కోర్సులను ప్రభుత్వం ప్రారంభించనున్నది. వర్సిటీ మారడంతో ప్రస్తుతమున్న 366 విద్యార్థుల సంఖ్య 726కి చేరనున్నది. ప్రస్తుతమున్న 118 ఉద్యోగుల సంఖ్య 210కి పెరుగనున్నది. ఆ వర్సిటీకి సీఎం ఛాన్సలర్‌గా ఉంటారు. ఆయన వైస్ ఛాన్సలర్ ను నియమిస్తారు.