Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలుగు అకాడమీ మాదిరిగా గోల్మాల్ జరుగుతోందా?
- నిబంధనలకు విరుద్ధంగా ఎఫ్డీలు
- అధికారులపై విచారణ జరిపించాలి : సీపీఐ(ఎం) గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ కమిటీ కార్యదర్శి ఎం.శ్రీనివాస్
నవతెలంగాణ- సిటీబ్యూరో
తెలంగాణ కార్మిక శాఖలోని భవన, ఇతర నిర్మాణ కార్మికుల వెల్ఫేర్ బోర్డు (బీఓసీడబ్ల్యూ) నిధుల భద్రతపై అనుమానాలు వ్యక్తమవుతున్నా యని, ఫిక్స్డ్ డిపాజిట్ల విషయంలో ఉన్నతాధికారులు నిబంధనలను ఉల్లంఘిస్తున్నారని సీపీఐ(ఎం) గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ కమిటీ కార్యదర్శి ఎం.శ్రీనివాస్ చెప్పారు. ఆ అధికారులపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. సీపీఐ(ఎం) హైదరాబాద్ నగర కార్యాలయంలో మంగళవారం కార్యదర్శివర్గ సభ్యులు ఎం.శ్రీనివాస్‌రావుతో కలిసి విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలుగు అకాడమీలో ఎఫ్‌డీల గోల్మాల్ జరిగిన తర్వాత.. ఎఫ్‌డీల నిర్వహణలో ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీచేసినా కార్మిక శాఖ అధికారులు తమకేమీ పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారని చెప్పారు. పలు అకౌంట్లలో ఉన్న ఎఫ్డీలను ఒకే బ్యాంకులోకి బదిలీ చేయాలని, నిధులను మూడు బ్యాంకుల్లోకి మించి జమ చేయకూడదని ప్రభుత్వం ఆదేశించింద న్నారు. ఆర్థిక శాఖ అనుమతిలేకుండా బ్యాంకుల్లో ఎఫ్డీలను పెట్టకూడదని తదితర నిబంధనలపై ఫిబ్రవరిలో ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినప్పటికీ కార్మికశాఖ అమలు చేయడం లేదని చెప్పారు. రూ.1000కోట్లకు సంబంధించి ఏడు బ్యాంకులకు చెందిన 150కిపైగా బ్రాంచ్‌ల్లో 450కిపైగా ఎఫ్డీలను చేశారని వివరించారు. ఒక్క కెనరా బ్యాంకుకు సంబంధించిన 90 బ్రాంచ్‌లో ఎఫ్డీలు చేశారని గుర్తుచేశారు. ఎఫ్‌డీలన్నీ ఒకే బ్యాంకులోకి మార్చాలన్న ప్రభుత్వ నిబంధనలు కార్మికశాఖకు వర్తించవా? అని ప్రశ్నించారు. ఇదంతా కార్మిక శాఖ ఉన్నతాధికారులకు తెలియకుండానే జరుగుతుందా? లేదా పట్టించుకోకుండా వదిలేశారా? ఎఫ్‌డీలుగా జమ చేసిన నిధులన్ని భద్రంగానే ఉన్నాయా? అనే అనుమానాలు వ్యక్తం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న ఎఫ్‌డీల నిర్వహణపై విచారణ జరపాలని, ఆ అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎఫ్‌డీల గడువు ముగుస్తుండటంతో ప్రతి రోజూ ఆ డబ్బుని రిలీజ్ చేయడం, కొత్త ఎఫ్డీలు వేయడం బోర్డులో నిరంతరంగా పని ఉంటుందని, బ్యాంకు అధికారులతో బేరసారాలు చేస్తూ అధికారులు కమీషన్ల రూపంలో భారీగా దండుకుంటున్నారని విమర్శించారు. కార్మిక శాఖ పేషీ వరకు పంపకాలు జరుగుతున్నాయని, డిప్యూటేషన్‌పై వచ్చిన ఓ అధికారి సూపరింటెండెంట్ హోదాలో ఒకే సీట్లో 9ఏండ్లుగా ఉంటూ ఇష్ట్యారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉన్నతాధికారుల అండదండలతోనే ఈ తతంగం జరుగుతుందని ఆరోపించారు. లేబర్ సెస్ వసూళ్లలో భారీగా అవకతవకలు జరుగుతున్న విషయాన్ని గతంలో సీపీఐ(ఎం) బయటపెట్టిందని గుర్తు చేశారు. కార్మికుల సంక్షేమానికి తగిన నిధులు విడుదల చేయకపోగా ఆర్బాటపు ఖర్చులు, అవినీతి కంపుతో కార్మికుల నిధులను దోచుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న లావాదేవీలను, అవినీతి, అక్రమాలను నిరోధించాలని, కార్మికుల సంక్షేమానికి పూర్తిస్థాయిలో నిధులు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.